లాక్‌డౌన్ అమలుతో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు ప్రతిరోజు వేల మంది హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని సొంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. 44 జాతీయ రహదారి వెంట వీరి కష్టాలపై ఫోకస్..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : కరోనా దెబ్బకు వలస కూలీలు విలవిలలాడుతున్నారు. పొట్ట చేతబట్టు కుని వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు వచ్చిన వీరి కుటుంబాలు లాక్‌డౌన్‌తో పడరాని పాట్లు పడుతున్నాయి. ఆయా రంగాలు కుదేలవడంతో ఆ సంస్థల్లో పనిచేస్తున్న కూలీలు పనులు కోల్పోయి పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్ప డింది. దీంతో వీరంతా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్కండ్ వంటి రాష్ట్రాల్లోని తమ స్వస్థలాలకు పయనమయ్యారు. 44వ జాతీయ రహదారి గుంపుగుంపులుగా నడుచుకుంటూ వెళుతున్నారు. 43 డిగ్రీల ఎర్రటి ఎండలో పిల్లాపాపలతో పడరాని పాట్లు పడుతున్నారు. కరోనా మహమ్మారి తమ బతుకులను అగమ్యగోచరంగా మార్చేసిందని కూలీలు వాపోతున్నారు. వీరంతా హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికులుగా, హోటళ్లల్లో వర్కర్లుగా, ఫ్యాక్టరీలలో రోజువారీ కూలీగా పనిచేసుకునే వారే.
మధ్యమధ్యలో వాహనాల్లో..
హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వైపు వెళుతున్న ఈ కార్మికులు మధ్యలో ఏదైనా వాహనం ఆపితే అందులో కొంత దూరం ప్రయాణిస్తున్నారు. కొందరు లారీల డ్రైవర్లు వీరికి లిఫ్టు ఇస్తున్నారు. దీంతో వాహనం ఎంత దూరం వెళితే అంత వరకు వెళ్లి.. మళ్లీ అక్కడి నుంచి కాలినడకన బయలు దేరుతు న్నారు. దారి మధ్యలో దాతలు ఇచ్చే ఆహారంతో పూట గడుపుకుంటున్నారు. తమతో పాటు తమ చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉందని రమేష్ అనే కార్మికుడు వాపోయారు. రహదారిపై రోజుకు సుమారు 2 వేల నుంచి మూడు వేల వరకు వలస కూలీలు తమ స్వస్థలాలకు పయనమవుతున్నట్లు అనధికారిక అంచనా. ఒక్కో గ్రూపులో 40 మంది నుంచి 70, 80 మంది వరకు ఉంటున్నారు.
తోడూ నీడగా..
44వ జాతీయ రహదారిపై ట్రైసైకిల్‌లో తన భార్య సొని యాను తీసుకువెళుతున్న వ్యక్తి పేరు రాజేష్. హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న సమయంలో ఆయన భార్య కాలు విరిగింది. లాక్‌డౌన్ కారణంగా పనులు లేవు. పస్తులుండలేక ఛత్తీస్‌గఢ్‌లోని తమ స్వస్థలానికి పయనమయ్యారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బయలు దేరిన వీరు మంగళవారం డిచ్‌పల్లి వద్దకు చేరుకున్నారు. మధ్యలో ఎవరైన దాతలు ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ పయనమవుతున్నారు.
నిండు గర్భిణి..
ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలానికి చెందిన దిలీప్ అతని భార్య సునీత సంవత్సరం కిందట మోపా ల్ మండలం నర్సింగ్‌పల్లి గ్రామానికి వలస వచ్చారు. సునీత ఏడు నెలల గర్భవతి. లాక్‌డౌన్ వేళ పని దొరకక పోవడంతో కిరాయి అద్దె చెల్లించలేదు. దీంతో ఇంటి యజ మాని ఇల్లు ఖాళీ చేయమన్నాడు. సొంతూరుకు వెళ్లడానికి ఏదైనా వాహనం కోసం 44వ జాతీయ రహదారిపై ఇలా ఎదురు చూస్తు న్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్–నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment