కదిలిస్తే కన్నీళ్లే! | Migrant Workers Worried on Going Native Places From Hyderabad | Sakshi

కదిలిస్తే కన్నీళ్లే!

Apr 1 2020 9:34 AM | Updated on Apr 1 2020 9:34 AM

Migrant Workers Worried on Going Native Places From Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌ మీదుగా కూలీలను లారీలో తరలిస్తున్న దృశ్యం

మహానగరంలో.. వలస కూలీల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. తినడానికి తిండి లేక..ఉండడానికి సరైన నీడ లేక నానా అవస్థలు పడుతున్నారు. పది రోజులుగా పని లేకపోవడంతో పూట గడవడం కష్టమై..కదిలిస్తే కన్నీటి పర్యంతమవుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరు సొంతూరుకు వెళ్లలేక..ఇక్కడ ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు. నగరంలో అధికారిక లెక్కల ప్రకారం లక్షన్నరకు పైగానే వలస కూలీలు ఉన్నట్లు అంచనా. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. వీరంతా ఇక్కడి చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో..నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా, బిహార్, చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా వీరికి ఎదురవుతున్న కష్టాలు గుర్తించిన ప్రభుత్వం..ప్రస్తుతం ఆదుకునే చర్యలు చేపట్టింది. వలస కార్మికుల్ని గుర్తించి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం లేదా గోధుమ పిండి, రూ.500ల చొప్పున నగదు పంపిణీకి శ్రీకారం చుట్టాయి. స్వచ్చంద సంస్ధలు, ట్రేడ్‌ యూనియన్లు సైతం ఆదుకుంటున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్‌/కుత్బుల్లాపూర్‌/గచ్చిబౌలి/హఫీజ్‌పేట్‌: వలస కూలీలను కదిలిస్తే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. లాక్‌డౌన్‌ కష్టాలతో తల్లడిల్లుతున్నారు. పది రోజులుగా పని లేకపోవడంతో పూట గడవటమే కష్టంగా మారింది. తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇంటి అద్దె, నెల చిట్టీలు, ఇప్పటికే తీసుకున్న అప్పుపై వడ్డీ, నిత్యావసర సరుకులన్నీ కలిపి తడిసి మోపెడు కానున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కార్మికులకు, వలస కూలీలది గుండెల్ని  పిండేసే పరిస్థితి. కష్టకాలం నుంచి గట్టెక్కేదెలా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

కార్మికుల అడ్డా..సిటీ..
హైదరాబాద్‌ మహా నగరం కార్మికుల అడ్డాకు చిరునామా. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉపాధి కోసం వలస కడుతున్నారు. గుండు సూది నుంచి క్షిపణిలో ఉపయోగించే అత్యంత కష్టతరమైన పరికరాల వరకు ఉత్పత్తిలో హైదరాబాద్‌ పరిశ్రమలు ఖ్యాతి గాంచాయి. నగరానికి వలస వచ్చే ప్రతి ఒక్కరికి ఇక్కడ పని లభిస్తోంది. మహానగర పరిధిలో  చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సుమారు 45 వేలు ఉన్నట్లు అంచనా.  గ్రేటర్‌ పరిధిలో సుమారు ఐదారు లక్షల మంది కార్మికులు ఉంటారని సమాచారం. నిర్మాణ రంగంలో లక్ష మందికిపైగా ఉంటారని అధికారులు అంచనా. 

 కొంపల్లి ఏఎంఆర్‌ గార్డెన్‌లో ప్రభుత్వం కల్పించిన వసతి గృహంలో ఉన్న కూలీలు
వలస కూలీల గుర్తింపు..
హైదరాబాద్‌ మహా నగరంతో పాటు శివార్లలో పెద్ద ఎత్తున జరుగుతున్న భవన నిర్మాణ రంగం పనుల్లో పూర్తిగా వలస కూలీలే. ఒడిశా, బిహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్‌ నుంచి వలస వచ్చి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో ఇక్కడ చిక్కుకున్నారు. ప్రభుత్వం వీరిని ఆదుకునేందుకు ఉపక్రమించింది. నగరంతో పాటు శివార్లలోని సుమారు 948 ప్రాంతాల్లో జరుగుతున్న భవన నిర్మాణ రంగం పనుల్లో సుమారు 98,859 పంది కూలీలు చిక్కుకున్నట్లు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, కార్మిక శాఖ గుర్తించింది. వారిలో సంఘటిత  నిర్మాణ రంగంలో 41,740 మంది వలస  కార్మికులు 284 వర్కింగ్‌ సైట్‌ ఉన్నట్లు అధికారుల సర్వేలో తెలింది.

పూట గడవటమే కష్టంగా ఉంది
మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేరు వీరపాలెం. ఏడాది క్రితం నా భర్త ఎల్లయ్యతో కలిసి కూలీ పనుల కోసం వలస వచ్చి అంజయ్యనగర్‌లో నివాసం ఉంటున్నాం.   పది రోజులుగా కూలీ లేకపోవడంతో చేతిలో డబ్బులు కూడా లేవు. పూట గడవడమే కష్టంగా ఉంది. అన్నపూర్ణ క్యాంటిన్‌లో భోజనం చేస్తున్నాం. రేషన్‌ బియ్యం, నగదు ఇంకా రాలేదు.   ఏం చేయాలో అర్థం కావడం లేదు. – ముక్తేషి, కూలీ, అంజయ్యనగర్‌  

అమ్మ ఊరికి రమ్మంటోంది  
మాది ఉత్తరప్రదేశ్‌. మియాపూర్‌లోని గోకుల్‌ ప్లాట్స్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో పెయింటర్‌గా పని చేస్తున్నాను. వారం రోజుల క్రితం కాంట్రాక్టర్‌ ఇచ్చిన డబ్బులు, రేషన్‌తో గడిపాం. గ్యాస్‌ అయిపొయింది, కట్టెల పొయ్యి మీదు వండుకుంటున్నాం.  రేషన్‌ కూడా లేదు.  బంద్‌తో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.    – సునీల్, పెయింటర్‌

ఇబ్బందులుపడుతున్నాం
మామూలు రోజుల్లోనే కూలిపనులు దొరకడం అంతంత మాత్రం. ఇప్పుడు అసలు పనే దొరకని పరిస్థితి. గత కొన్ని రోజులుగా పనులు లేక, చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు రేషన్‌ కార్డు కూడా లేదు. తినడానికి ఇబ్బందులు తప్పడం లేదు.   – వెంకటనర్సింహ, పాలూరు గ్రామం,ప్రకాశం జిల్లా

బాసటగా నిలిచేందుకు..
వలస కార్మికులు ఆహార పదార్థాల కోసం ఇబ్బంది పడకుండా జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, కార్మిక, పౌరసరఫరాల శాఖ సంయిక్తంగా  ప్రత్యేక కార్యచరణ దిగాయి. వలస కార్మికులు గుర్తించి ఒక్కోక్కరికి 12 కిలోల బియ్యం లేదా గోధుమ పిండి, రూ.500ల చొప్పున పంపిణీకి శ్రీకారం చుట్టాయి. నగరంలోని 34,283 మంది వలస కార్మికులకు 411 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందజేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. మరోవైపు వివిధ స్వచ్చంద సంస్ధలు, ట్రేడ్‌ యూనియన్లు సైతం వలస కార్మికులు ఆదుకునే చర్యలకు దిగాయి. మరోవైపు భవన నిర్మాణ కార్మికులకు తిరిగి పని కల్పించేంత వరకు ఆహారం అందించే బాధ్యత బిల్డర్లదేనని రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement