పాలకూట విషం..! | Milk poison in hyderabad | Sakshi
Sakshi News home page

పాలకూట విషం..!

Published Thu, Jun 22 2017 2:17 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

పాలకూట విషం..!

పాలకూట విషం..!

► నాసిరకం పాల పొడితో యథేచ్ఛగా పాల దందా
►పలు రాష్ట్రాల్లో సీజ్‌ చేసిన పాల పొడితో తయారీ..
► కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిల్వ
► నగరంలోని కొన్ని హాస్టళ్లకు నిత్యం ఇవే సరఫరా.. ఇబ్రహీంపట్నం శివార్లలో ఏడాదిగా వ్యవహారం
► ఇలాంటి పాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యుల హెచ్చరిక
► 5,000లీటర్లు గేదె పాల పేరిట మార్కెట్‌లో రోజూ అమ్ముతున్న పౌడర్‌ పాలు
►రెవా, ప్రీతి, ఎన్‌ఎస్‌ఆర్‌ పేర్లతో ప్యాకెట్లలో నింపి విక్రయం.. ప్రముఖ కాలేజీల హాస్టళ్లకు సరఫరా

ఎలా చేస్తున్నారంటే..?
నాసిరకం పాలపొడిని కిలోకు రూ.150 నుంచి 180 వరకు చెల్లించి కొంటున్నారు. ఆ పాల పొడికి నీళ్లు కలిపి 9 లీటర్ల దాకా పాలు తయారు చేస్తున్నారు. వాటిని వివిధ బ్రాండ్ల పేరుతో ప్యాకేజింగ్‌ చేసి.. లీటర్‌కు రూ. 40 చొప్పున మార్కెట్లో విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు ఐదు వేల లీటర్ల పాలను విక్రయిస్తూ.. రోజూ రూ.లక్షకుపైగా మిగుల్చుకుంటున్నారు.

హైదరాబాద్‌: అదో ‘కర్మాగారం’.. అందులో పాలు తయారవుతాయి.. పాలు తయారు కావడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును అక్కడ.. జరుగుతున్న తంతు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!  రైతులెవరూ పాలు విక్రయించకున్నా.. నేరుగా గేదెల నుంచి తీయకున్నా అక్కడ రాత్రికి రాత్రే వేల లీటర్ల కొద్దీ పాలు రెడీ అవుతాయి. అదంతా పాల పౌడర్‌ మహిమ! అదీ నాసిరకం పౌడర్‌. మహారాష్ట్ర, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో ఆ పాల పౌడర్‌ను అధికారులు ఎప్పుడో సీజ్‌ చేశారు. ఇక్కడ అదే పౌడర్‌తో వేల లీటర్ల పాలు తయారు చేస్తూ నోటికొచ్చిన ఓ బ్రాండ్‌ పేరుతో ప్యాకెట్లో అందంగా ముస్తాబు చేసి అచ్చమైన గేదె పాలు అంటూ మార్కెట్‌లో డంప్‌ చేస్తున్నారు. ఇలా హైదరాబాద్‌లో ప్రతిరోజూ ఏకంగా 5 వేల లీటర్ల పాలను అమ్మేస్తున్నారు.

కొన్ని ప్రముఖ విద్యా సంస్థల హాస్టళ్లకు నిత్యం అవే పాలను అంటగడు తున్నారు. రాజధాని నగర శివారులోని ఇబ్రహీంపట్నం సమీపంలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. దాదాపు ఏడాదిగా ఈ పా‘పాలు’ ప్రవహిస్తున్నా అధికారులెవరూ అడ్డుకట్ట వేయకపోవడం గమనార్హం. పాలు దొరకని రోజు తాత్కాలికంగా పౌడర్‌ పాలు వాడినా పెద్ద నష్టమేమీ ఉండదు. కానీ నిత్యం అవే పాలు, అందులోనూ నాసిరకం పౌడర్‌తో తయారైన పాలు తాగితే ఒళ్లు గుల్ల అవడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నోటికొచ్చిందే పేరు..
ఇబ్రహీంపట్నం పాల ఉత్పత్తి కేంద్రం పేరుతో ఈ డెయిరీ అక్రమ దందాకు పాల్పడుతోంది. తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు ప్యాకెట్లపై ఒకేపేరు కాకుండా రకరకాల బ్రాండ్ల పేర్లను వాడుకుంటోంది. రెవా, ప్రీతి, ఎన్‌ఎస్‌ఆర్‌ లాంటి పేర్లతో ముద్రించిన ప్యాకెట్లు ఈ డెయిరీలో సిద్ధంగా ఉంటాయి. వీటిల్లో నాసిరకం పౌడర్‌తో తయారు చేసిన పాలను నింపి గేదె పాలు అంటూ మార్కెట్లోకి సరఫరా చేస్తోంది. గతంలో కొంతకాలం ఈ డెయిరీ నిర్వాహకులు స్థానిక రైతుల నుంచి పాలను కొనుగోలు చేశారు. వాటిలో వెన్న తీసి ప్యాకెట్‌ పాలను విక్రయించారు.

అయితే పాల సేకరణ ధర పెరిగే కొద్దీ ఈ డెయిరీ దెబ్బతింది. గేదె పాల కంటే పౌడర్‌ పాలతో ఎక్కువ లాభాలు గడించే అవకాశముందని డెయిరీ నిర్వాహకులు ఈ దందాకు తెరలేపారు. మొదట్లో వినియోగదారులకు అనుమానం రాకుండా కొంచెం పాలు, పాల పౌడర్‌ వినియోగించి విక్రయించారు. ఇప్పుడు పూర్తిగా నాసిరకం పాల పౌడర్‌తో చేసిన పాలనే అమ్మేస్తున్నారు. కేంద్రంలో బస్తాల కొద్దీ పౌడర్‌ నిల్వ చేస్తున్నారు. వాటిని సరిగ్గా నిల్వ చేయకుంటే పౌడర్‌లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఇలా బస్తాలకు బస్తాలు నిల్వచేయడం ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వెన్నశాతాన్ని పెంచేస్తున్నారిలా..
ఇటీవల రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఎస్‌ఓటీ(స్పెషల్‌ ఆపరేషన్‌ టీం) పోలీసుల దాడుల్లో కల్తీ పాల దందా వెలుగులోకి వచ్చింది. ఇందులో కొందరు అక్రమార్కులు వెన్న శాతం పెంచేందుకు పాలల్లో యూరి యా, పామాయిల్‌ను కలుపుతున్నట్టు తేలింది. సహజంగా పాలల్లో 5 నుంచి 6 శాతం వెన్న ఉంటుంది. ఈ పాలకు లీటరుకు రూ.36 నుంచి రూ.39 వరకు చెల్లిస్తారు. అయితే కొందరు ఈ వెన్న శాతాన్ని పెంచేందుకు అక్రమమార్గం పట్టారు. ముందుగా రెండు లీటర్ల పాలను తీసుకుని అందులో కొంత యూరియా, పామాయిల్‌ వేశారు. దీంతో ఆ పాలు ఘన రూపంలోకి మారతాయి.

తర్వాత ఈ మిశ్రమానికి నీటిని కలిపి.. వాటిని మామూలు పాలలో కలిపేస్తున్నారు. దీంతో వెన్న శాతం ఘననీయంగా పెరుగుతోంది. ఇలా పాలను కల్తీ చేస్తూ సుమారు తొమ్మిది మంది ప్రతిరోజు మదర్‌ డెయిరీలో పాలను విక్రయిస్తూ అధిక ధర పొందారు. వెన్నశాతంపై అనుమానం రావడంతో రంగంలోకి దిగిన ఎస్‌ఓటీ పోలీసులు వారిని పట్టుకొని గుట్టు రట్టు చేశారు. అయితే ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నట్లు చెబుతున్నారు.

రోజు తాగితే ఊబకాయమే
గేదె, ఆవు పాలల్లో మ శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు తగిన మోతాదులో ఉంటాయి. పౌడర్‌ పాలల్లో ప్రోటీన్లు ఎక్కువున్నా కొవ్వు పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. ఈ పాలు రెగ్యులర్‌గా తీసుకుంటే పిల్లల్లో కొవ్వు ఎక్కువగా చేరుతుంది. దీంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. నడి వయసున్నవారికి మధుమేహం వచ్చే అవకాశం అధికం. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప పౌడర్‌ పాలు నిత్యం తీసుకోవడం మంచిది కాదు. – డాక్టర్‌ సుజాత, న్యూట్రీషియనిస్ట్, యశోద హాస్పిటల్‌
 

హైదరాబాద్‌కు పాలు ఇలా..

ప్రతిరోజూ కావాల్సింది           – 28 లక్షల లీటర్లు
ప్యాకెట్ల రూపంలో వచ్చేది     – 22 లక్షల లీటర్లు
రైతులు నేరుగా విక్రయిస్తోంది –6 లక్షల లీటర్లు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement