- సింగరేణిలో పేరుకుపోతున్న స్క్రాప్ నిల్వలు
- మట్టిలో కలిసిపోతున్న ఇనుప సామగ్రి
- అమ్మకాలను పట్టించుకోని అధికారులు
- చేతివాటం ప్రదర్శిస్తున్న దొంగలు
యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : సింగరేణి సంస్థలోని పాత ఇనుము దొంగలకు వరంగా మారింది. బొగ్గు ఉత్పత్తి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రా లు, పనిముట్లను కాలం చెల్లిన తర్వాత విక్రయించడం, ఇతర ప్రాంతాలకు తరలించడం పట్ల సంబంధిత అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గనుల వద్ద నిల్వ ఉన్న పాత ఇనుమును దొంగలు ఎంచక్కా ఎత్తుకెళ్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. సింగరేణి వ్యాప్తంగా సుమారు రూ. వంద కోట్లకు పైగా ఐరన్ స్క్రాప్ గనుల్లో పేరుకుపోయినట్లు తెలిసింది. ఓసీపీల్లో గడువుతీరిన భారీ యంత్రా లు, గనులు మూసివేతతో వెలికితీసిన పాత ఇనుప సామగ్రి, గనుల్లో పాడైపోయిన యంత్ర విడిభాగాలు సుమారు ఐదేళ్లుగా ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయాయి.
ఒక్క ఆర్జీ-2 ఏరియాలోనే సుమారు రూ. 10కోట్ల విలువచేసే ఇనుము గనులపై ఉండడం గమనార్హం. కాగా, కొన్నేళ్ల క్రితం మూతపడిన డివిజన్‌లోని జీడీకే-8, 8ఏ గనుల్లో వెలికితీసిన సామగ్రిని అధికారులు ఇతరగనులకు తరలించారు. అయితే పనికిరాని ఇనుమును విక్రయించకపోవడంతో అవి గనుల పై పేరుకుపోయింది. ఏళ్ల తరబడి మట్టిలోనే ఉంటుండడం తో తుప్పుపట్టి అమ్మ కానికి కూడా వీలులేకుండా పోతుందని కార్మికులు వాపోతున్నారు.
దొంగలకు కాసులు కురిపిస్తున్న స్క్రాప్ యార్డులు..
గనులపై ఏళ్ల తరబడి స్క్రాప్ నిల్వలు ఉండడం దొంగలకు వరంగా మారింది. చిన్న ఇనుప ముక్క దొరికినా కూడా వందలాది రూపాయలు వస్తుండడంతో వారు స్క్రాప్ యా ర్డులపై దృష్టి సారిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బృందాలు గా ఏర్పడి విధినిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డులను బెదిరించి ఇనుమును ఎత్తుకెళ్తున్నట్లు సమాచారం. కాగా, కోట్లు విలువచేసే ఐరన్ సామగ్రి కళ్లముందే చోరీకి గురవుతుండడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఓసీపీ యార్డులో గడువుతీరిన భారీ యంత్రాలను స్క్రాప్‌లో వేస్తుండడంతో దొంగలు బరితెగించి అందులోని విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నట్లు తెలుస్తుంది.
టెండర్ల విధానంలో మార్పు తీసుకురావాలి..
స్క్రాప్ టెండర్ల విధానంలో మార్పు తీసుకొచ్చి డివిజన్ల వారీగా స్క్రాప్ విక్రయించే పద్ధతికి శ్రీకారం చుట్టాలని కార్మికులు యాజమాన్యాన్ని కోరుతున్నారు. పాత ఇనుము అమ్మకం గురించి ప్రభుత్వ సంస్థకు దరఖాస్తు చేసుకుని టెం డర్ పక్రియ మొదలు పెట్టేంతవరకు పుణ్యకాలం గడిచిపోతోందని వారు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై చొరవ తీసుకుని డివిజన్ల వారీగా సంస్థకు లబ్ధి చేకూరేలా టెండర్లు నిర్వహించాలని కోరుతున్నారు.
ఆరునెలల్లో ఖాళీ చేయిస్తాం..
గనులైపై పేరుకుపోయిన స్క్రాప్‌ను ఇతర ప్రాంతాలకు తరలిం చేందుకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎంఏటీసీ ద్వారా టెం డర్ ప్రక్రియను పూర్తి చేసి స్క్రాప్‌ను విక్రయిస్తాం. ఒక్క ఇనుప ముక్కను కూడా విడిచిపెట్టకుండా చర్యలు తీసుకుంటాం. మరో ఆరునెలల్లో గనులపై నిలిచిపోయిన ఐరన్ స్క్రాప్‌ను తరలిస్తాం.
- మనోహర్‌రావు, సింగరేణి డెరైక్టర్