సాక్షి, హైదరాబాద్: స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)లు ఉండాలని, ఆ మేరకు ప్రస్తుత ఎంఎస్‌పీని వచ్చే ఖరీఫ్ నాటికి సవరించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సాగు ఖర్చుకు మరో 50 శాతం అదనంగా కలిపి ఎంఎస్‌పీ ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ వ్యయ, ధరల (సీఏసీపీ) కమిషన్‌కు ప్రతిపాదించింది. ఆ ప్రకారం వరికి ప్రస్తుత ఎంఎస్‌పీకి రెండింతలు, పత్తికి దాదాపు మూడింతలు పెంచాలని వ్యవసాయ శాఖ నివేదించింది. అందులో ఖరీఫ్‌లో వివిధ పంటలకు ఎంతెంత ఖర్చు అవుతుందో వివరించింది.
పంటల వారీగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంట కోత, రవాణా, కూలీ, రైతు కుటుంబ శ్రమకు ప్రతిఫలం అన్నీ కలిపి ఎంత ఖర్చు అవుతుందో సవివరంగా కేంద్రానికి నివేదించింది. ఒక వ్యాపారి తన వస్తువును అమ్ముకునేటప్పుడు ధర ఎలా నిర్ణయిస్తారో, ఆ ప్రకారమే పెట్టిన పెట్టుబడి, దానికి అయ్యే వడ్డీలను లెక్కలోకి తీసుకొని సాగు ఖర్చును నిర్ధారించారు. ఏటా ఇలాగే శాస్త్రీయంగా సాగు ఖర్చు, ఎంఎస్‌పీ ఎలా ఉండాలో తెలంగాణ వ్యవసాయ శాఖ ఇస్తూనే ఉంది. కానీ కేంద్రం తన పద్ధతిలో తాను ఎంఎస్‌పీని నిర్ధారిస్తూ పోతోందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ఎకరా వరి సాగు ఖర్చు రూ. 35 వేల పైనే..
సాధారణ వరి రకం పండించేందుకు నారుమడి సిద్ధం చేయడం మొదలు విత్తనాలు, నాట్లు, ఎరువులు, కలుపుతీత, పంట కోత, కూలీల ఖర్చు, కుటుంబ సభ్యుల శ్రమ మొత్తం కలుపుకుంటే ఎకరానికి రూ.35,156 ఖర్చు అవుతున్నట్లు లెక్కగట్టింది. చివరకు క్వింటా వరి పండించాలంటే రూ.2,529 ఖర్చు అవుతుందని నిర్ధారించింది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి ఎంఎస్‌పీ రూ.3,794 ఇవ్వాలని కోరింది.
ప్రస్తుతం వరి ఎంఎస్‌పీ రూ.1,815 ఉండగా, రెట్టింపునకు మించి పెంచాలని కోరింది. 2020–21 ఖరీఫ్‌లో ఈ మేరకు పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఇక పత్తి పండించాలంటే క్వింటా లుకు రూ.10,043 ఖర్చు అవుతుందని వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో పత్తి క్వింటాలుకు ఎంఎస్‌పీ రూ.5,550 కాగా, సాగు ఖర్చును లెక్కలోకి తీసుకొని స్వామినాథన్ ఫార్ములా ప్రకారం ఎంఎస్‌పీ రూ.15,064 ఇవ్వాలని వ్యవసాయ శాఖ సీఏసీపీని కోరింది. అలాగే మొక్కజొన్న క్వింటా పండించేందుకు రూ.2,172 ఖర్చు అవుతుందని నిర్ధారించారు.
ఆ ప్రకారం ఎంఎస్‌పీ రూ.3,258 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. వేరుశనగ క్వింటా పండించేందుకు రూ.5,282 ఖర్చు అవుతుండగా, ఎంఎస్‌పీ రూ.7,924 ఇవ్వాలని కోరారు. క్వింటా కందులు పండించేందుకు రూ.8,084 వ్యయం అవుతుండగా మద్దతు ధర రూ.12,126 కోరారు. క్వింటా సోయాబీన్ ఉత్పత్తికి రూ.4,694 ఖర్చు అవుతుండగా, ఎంఎస్‌పీ రూ.7,041కు పెంచాలని సీఏసీపీని సర్కారు కోరింది.
Comments
Please login to add a commentAdd a comment