
పట్టుబడిన జిల్లా మైనింగ్ అధికారి శ్రీనివాస్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు
సాక్షి, నాగర్‌కర్నూల్: అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొంతమంది అధికారులు ప్రభుత్వ వ్యవస్థకు మచ్చ తెస్తున్నారు. వేలకువేలు జీతాలు వస్తున్నా అక్రమ సంపాదనపై మోజుతో అత్యాశకు పోయి ఇరుక్కుంటున్నారు. మంగళవారం తాజాగా గనులు, భూగర్భశాఖ అధికారి పి.శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడ్డారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల మొదటి రోజే అధికారి పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
డబ్బులు డిమాండ్ చేసి..
స్టోన్ అండ్ మెటల్ క్వారీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తినుంచి డబ్బులు డిమాండ్ చేయగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ వెల్లడించారు. వెల్దండ మండలం శంకర్‌కొండతండాలోని 303 సర్వే నెంబర్‌లో 18 ఎకరాల భూమిలో స్టోన్ అండ్ క్రషర్ క్వారీ ఏర్పాటుకు నారాయణ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. మీ సేవా కేంద్రంలో నవంబర్ 10న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా నవంబర్ 13న మైనింగ్‌శాఖ కార్యాలయంలో ఫైల్‌ను సమర్పించారు. మైనింగ్ ఏడీ శ్రీనివాస్ వద్దకు గత 18 రోజులుగా అనుమతి కోసం తిరుగుతున్నాడు. నవంబర్ 28న మరోసారి ఏడీని కలిస్తే మొత్తం పని కావాలంటే రూ.లక్ష ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. ఎంత బతిమిలాడినా వినలేదు. విసుగుచెందిన నారాయణ ఏసీబీని ఆశ్రయించాడు.
పట్టుబడ్డారిలా..
ఏసీబీ అధికారుల సూచన మేరకు నారాయణ మొదటి విడతగా మంగళవారం రూ.15వేలను మైనింగ్ ఏడీ శ్రీనివాస్‌కు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్టుగానే కార్యాలయంలో డబ్బులు ఇస్తుండగా వలపన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఏసీబీ కోర్టుకు హాజరుపర్చి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారి డబ్బులు డిమాండ్ చేసినా ప్రజలు నిర్భయంగా ఏసీబీని ఆశ్రయించాలని, వారిపేరును గోప్యంగా ఉంచి అవినీతి పరుల పనిపడతామని ఈ సందర్భంగా విలేకరులతో తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు లింగస్వామి, ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
పెరిగిన అవినీతిపరుల ఆగడాలు
జిల్లాలో అవినీతి అధికారుల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల ఏసీబీ అధికారుల దాడులు పెరిగినా అధికారుల్లో మార్పు రావడంలేదు. జిల్లాలో ఏదో ఒక చోట ఎవరో ఒకరు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా పట్టుబడిన మైనింగ్ ఏడీ శ్రీనివాస్‌పై ఎన్నో ఆరోపణలున్నాయి. జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుండటంతో ప్రభుత్వ పనుల పేరుతో పర్మిట్లు పొంది బయట అమ్ముకుంటున్నా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమ ఇసుక రవాణాకు పర్మిట్లు ఇష్టారాజ్యంగా ఇచ్చాడనే ఆరోపణలు లేకపోలేదు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతిలేని క్వారీలు జిల్లాలో అనేక కొనసాగుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ఒక్కశాఖలోనే కాదు వివిధ శాఖల్లోనూ అవినీతి అధికారులు రాజ్యమేలుతున్నారు. ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది.
Comments
Please login to add a commentAdd a comment