
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అభయహస్తం పథకం పింఛన్‌దారుల వివరాలను సేకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. అభయహస్తం పథకం అమలు తీరుపై గురువారం తన చాంబర్‌లో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆసరా లబ్ధిదారులకు నెలకు రూ. 2,016 చొప్పున అందుతున్నాయన్నారు. గతంలో అభయహస్తం లబ్ధిదారులుగా ఉన్న 1.90 లక్షల మందికి ఆసరా కింద ప్రయోజనం దక్కడంలేదని, వీరందరికి ఆసరా పింఛన్లు అందజేసే దిశగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు నిధుల కొరత ఉందని, ఈ సమస్యను అధిగమించేందుకు ఉపాధి హామీ నిధులను వినియోగించే అంశాన్ని పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు.