కేసుల్లో దాపరికం లేదు: ఈటల | Minister Etela Rajender Press Meet Over Corona | Sakshi
Sakshi News home page

కేసుల్లో దాపరికం లేదు: ఈటల

Published Wed, Apr 29 2020 3:03 AM | Last Updated on Wed, Apr 29 2020 4:47 AM

Minister Etela Rajender Press Meet Over Corona - Sakshi

మంగళవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మీడియాతో మాట్లాడుతున్న ఈటల 

సాక్షి, హైదరాబాద్‌ : ‘కరోనా పరీక్షలకు వెనుకాడేది లేదు. అలాగని ఎవరికి పడితే వారికి చేయం. ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తాం’అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కరోనా మరణాలు, పాజిటివ్‌ కేసుల వివరాలను దాయడంలేదని, అలాంటి అవసరం కూడా లేదని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని పేర్కొన్నారు. ఆయన మంగళవారమిక్కడి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విలేకరులతో మాట్లాడారు. మే 8వ తేదీలోగా రాష్ట్రం పూర్తిగా కోలుకుంటుందని, మరణాలు లేకుండా కరోనా మహమ్మారి అంతమవుతుందని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. దేశంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుంటే, తెలంగాణలో తగ్గుతున్నాయని తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదికలో వెల్లడించిందన్నారు.

కరోనా కట్టడికి రాష్ట్రంలో చేపడుతున్న చర్యలపై కేంద్రం సంపూర్ణ విశ్వాసం ప్రకటించిందని తెలిపారు. ఐదు కేసులకంటే తక్కువ ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ చేయకూడదని ఐసీఎంఆర్‌ చెప్పిందని, ఇకపై అలాగే అనుసరిస్తామని పేర్కొన్నారు. జిల్లాల్లో కేసుల నమోదు తగ్గిందన్నారు. 14 రోజులుగా చాలా జిల్లాల్లో ఒక్క కేసూ లేదని వివరించారు. జీహెచ్‌ఎంసీలో 30 సర్కిళ్లు ఉంటే, 8 సర్కిళ్లలోనే 70% కేసులు నమోదయ్యాయన్నారు. ప్రస్తుతం రోజుకు 1,540 కరోనా పరీక్షలు చేసే శక్తి రాష్ట్రానికి ఉందని, మరో 3,500 నుంచి 5వేల పరీక్షలు చేసే యంత్రానికి ఆర్డర్‌ ఇచ్చి నట్టు ఈటల వెల్లడించారు. ఒకవేళ మళ్లీ కరోనా విజృంభించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ప్లాస్మా థెరపీకిఅనుమతి వచ్చిందని, త్వరలోనే దాని విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. చదవండి: ఇంట్లోనే చికిత్స! 

1009కి చేరిన కరోనా కేసులు...
రాష్ట్రంలో మంగళవారం ఆరు కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ‘అవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే. దీంతో రాష్టంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1009కి చేరింది. ఇందులో ఇప్పటివరకు 25 మంది చనిపోయారు. తాజాగా 42 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా 374 మంది పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 610 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. గత వారం రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతోంది. సింగిల్‌ డిజిట్‌కు పడిపోయింది. ప్రస్తుతం ఉన్న పాజిటివ్‌ కేసుల్లో 50 శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఆ తరువాత వికారాబాద్, గద్వాల, సూర్యాపేట జిల్లాల్లో ఉన్నాయి. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో కేసులున్నా కూడా వారంతా డిశార్జి అయ్యారు. ఒకట్రెండు కేసులున్న జిల్లాలను క్లస్టర్‌గా గుర్తించలేం. వాటిని సమీక్షించి 22 జిల్లాలను డేంజర్లో లేని జిల్లాలుగా నిర్ణయించాం’అని పేర్కొన్నారు. 

దేశానికే ఆదర్శం...
కరోనా కట్టడిలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఈటల వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి వచ్చిన కొన్ని మినహా మిగిలిన కేసులన్నీ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవేనన్నారు. రూ.వేలకోట్ల ఆదాయం పోతున్నా అది పట్టించుకోకుండా ప్రజల ప్రాణాల కోసం పనిచేస్తున్నామని.. అది చూసి పొగడకపోయినా పర్వాలేదు కానీ విమర్శించడం విజ్ఞత కాదని పేర్కొన్నారు. ఆరు రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల తగ్గడంతో సీఎం కేసీఆర్‌ శుభసూచకం అని చెబితే, దాన్ని జీర్ణించుకోలేని కొందరు రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని, పరీక్షలు చేయడం లేదని, సమాచారం ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘26న మొత్తం 1001 కేసులంటే జీహెచ్‌ఎంసీలో 540 ఉన్నాయని వెల్లడించాం. 27న రంగారెడ్డి, మేడ్చల్‌లోని 16 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే అని గుర్తించి వాటిని కలుపుకొని 556 అని ఇచ్చాం.

దాన్ని పట్టుకొని లెక్కలు తప్పు చూపిస్తున్నారనడం సరికాదు. ఒకరు బరువు తక్కువయ్యేందుకు శస్త్రచికిత్స చేయించుకొని, మరొకరు కేన్సర్‌తో మృతి చెందినా వారికి పాజిటివ్‌ రావడంతో కరోనా మరణాలుగానే లెక్కేశాం. ప్రజలు ఇబ్బందులు పడకూడదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకూడదు, టెస్టుల కోసం లైన్లు కట్టకూడదనే ఉద్దేశంతోనే ర్యాపిడ్‌ టెస్టులను వద్దన్నాం. అందుకే ప్రైవేటు ల్యాబు, ఆసుపత్రులకు టెస్టులు చేసేందుకు పర్మిషన్‌ ఇవ్వలేదు’అని తెలిపారు. పైగా ఈ పరీక్షలను ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఏ ఒక్క ప్రైవేటు ఆస్పత్రి అనుమతి కోసం రావడంలేదని ఈటల వివరించారు.

కేంద్ర బృందం సంతృప్తి..
రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం గాంధీ, గచ్చిబౌలి, కింగ్‌కోఠి ఆస్పత్రులను పరిశీలించి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చిందని ఈటల తెలిపారు. రాష్ట్రంలో పరీక్షలు తక్కువేమీ చేయలేదన్నారు. దేశంలో 7.16 లక్షల పరీక్షలు చేస్తే, 4.1 శాతం పాజిటివ్‌ వచ్చాయని.. తెలంగాణలో 19,063 పరీక్షలకు 5.3 శాతం పాజిటివ్‌ వచ్చాయని వివరించారు. ఐసీఎంఆర్‌ తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్‌ వచ్చిన వాళ్లని కూడా హోం క్వారంటైన్‌ చేయమని ఉందని.. అలా చేస్తే గాంధీ ఆస్పత్రిలో 10 మంది కూడా మిగలరని చెప్పారు. చదవండి: అన్నపూర్ణ మన తెలంగాణ


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement