సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నిర్ధారణ, కోవిడ్–19 చికిత్సలు ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రాథమిక దశలోనే కరోనా వైరస్‌ను నిర్ధారించి చికిత్స అందిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చే వరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. బీఆర్కే భవన్‌లో ఫార్మా కంపెనీలు, డీలర్లతో శనివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జ్వరం తదితర లక్షణాలు వచ్చిన వారిని ఉపకేంద్రాల స్థాయిలో గుర్తించి పీహెచ్‌సీకి తరలిస్తామని, అక్కడే కరోనా వైరస్ పరీక్షలు నిర్ధారణ చేసి ప్రాథమిక చికిత్స కూడా చేస్తామన్నారు. హోంఐసోలేషన్ అవసరమైన వారికి మందులు పంపిణీ చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తామన్నారు. అవసరమైన వారిని పెద్దాసుపత్రికి తరలిస్తామని వివరించారు. కోవిడ్–19 రోగులకు ఇచ్చే మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో మందులకు కొరత లేదని, అవసరమైన మందులను ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
మందులు బ్లాక్‌మార్కెట్‌కు తరలితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రతి మందుల షాప్‌లో మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి విధిగా అవసరమైన మందులు సరఫరా చేయాలని కోరారు. ఎక్కువ ఖరీదు ఉన్న మందులు కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా చికిత్సలో అవసరమైన అన్నిరకాల మందులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్‌ను ఆదేశించారు. వైరస్ లోడ్‌ను తగ్గించడానికి వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్ మందును తయారు చేస్తున్న హెటిరో కంపెనీ యాజమాన్యంతో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మాట్లాడారని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మందులను సరఫరా చేయాలని కోరారని, కాబట్టి త్వరలోనే ఆ మందు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు.
ప్రజల ప్రాణాలే ముఖ్యం
ఆసుపత్రుల వారీగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం కోఠిలోని వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆస్పత్రుల్లో అవసరమైన సిబ్బందిని నియమించుకునే అవకాశాన్ని సూపరింటెండెంట్లకు ఇస్తున్నట్లు వెల్లడించారు. సిబ్బంది, పరికరాలు అడిగిన 24 గంటల్లోనే ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టీం వర్క్‌తో పనిచేసి ప్రజల ప్రాణాలు పోకుండా చూడాలని వైద్యశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
హాస్పిటల్‌కి వచ్చిన ఏ ఒక్క పేషంట్‌ను కూడా వెనక్కి తిరిగి పంపించ కూడదని.. ప్రాథమిక చికిత్స అందించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన హాస్పిటల్‌కి పంపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రులు చుట్టూ పేషెంట్లు తిరుగుతున్నారని వస్తున్న వార్తలకు స్వస్తి పలకాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రిపై కూడా ఈటల సమీక్ష నిర్వహించారు. హైటెక్ యుగంలో పురాతన కట్టడాలతో ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని, ప్రజలు ప్రాణాలు హరించే విధంగా ఉన్నా ఉస్మానియా ఆసుపత్రిని ఆధునీకరించాలని అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment