
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి వ్యవహారంపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అక్రమాలపై బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రిలో పరిణామాలు, ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆసుపత్రి అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. డాక్టర్ వసంత్‌కుమార్ ఆరోపణలపై మంత్రి ఆరా తీశారు. డాక్టర్ స్థాయిలో ఉన్న ఆయన ఆత్మహత్యకు యత్నించడం సరికాదన్నారు. వైద్యశాఖలో జరుగుతున్న వాటిపై కమిటీలు ఏర్పాటు చేస్తామని..ఎప్పటికప్పుడు తమకు నివేదికలు ఇస్తుంటాయని మంత్రి పేర్కొన్నారు.
వాస్తవాలు వెలికితీస్తాం..బాధ్యతులను శిక్షిస్తాం..
వ్యక్తుల కంటే వ్యవస్థే ముఖ్యమని.. వాస్తవాలు వెలికి తీసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. ఇంటర్‌షిప్‌కు సంబంధించి లీవ్ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మాత్రమే అనుమతులు తీసుకోవాలన్నారు. హాజరుకు సంబంధించి సూపరిండెంట్‌కి ఎలాంటి అధికారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టీచింగ్ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను స్టడీ చేయాలని మంత్రి ఈటల సూచించారు.
అవకతవకలపై విచారణ
గాంధీ ఆసుపత్రిలో అవకతవకలపై విచారణకు వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. విచారణ చేసే బాధ్యతను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య విద్యార్థులకు 100 శాతం హాజరు తప్పనిసరి చేశారు. విద్యార్థుల హాజరు నమోదు బాధ్యతల నుంచి సూపరిండెంట్‌ను తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment