ఇప్పుడేం చేద్దాం | minister Jagadeeswar reddy discuss on eamcet case | Sakshi
Sakshi News home page

ఇప్పుడేం చేద్దాం

Published Tue, Aug 5 2014 1:43 AM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM

ఇప్పుడేం చేద్దాం - Sakshi

ఇప్పుడేం చేద్దాం

* ఎంసెట్ వివాదంపై సీఎం కేసీఆర్‌తో విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డి రోజంతా మంతనాలు
 
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. సుప్రీం తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తదుపరి వాదనల కోసం మరింత లోతైన అధ్యయనం చేసేందుకు సిద్ధమైంది. రాష్ర్ట విభజన చట్టంలో ఉన్నత విద్యకు సంబంధించి పేర్కొన్న అన్ని క్లాజులపైనా సమగ్ర సమాచారం సేకరిస్తోంది. అంతేకాదు స్థానికత విషయంలో తన వైఖరికే కట్టుబడుతూ పకడ్బందీ వాదనలు వినిపించాలని భావిస్తోంది. రాష్ర్ట విభజన చట్టంలోని అంశాలకు, సుప్రీం తాజా ఆదేశాలకు లోబడే తెలంగాణ ప్రభుత్వమే కౌన్సెలింగ్ నిర్వహించే దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

వచ్చే సోమవారం(11న) నాడు కోర్టు పూర్తి తీర్పును ఇవ్వనున్న నేపథ్యంలో ఈ గడువులోగా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని భావిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో విభజన సందర్భంగా తలెత్తిన వివాదాలు, మధ్య భారత్ వర్సెస్ జోషి కేసులో 1955లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ విడిపోయినప్పుడు స్థానికత విషయంలో తలెత్తిన న్యాయ వివాదాలను రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు లోతుగా పరిశీలించనున్నట్లు తెలిసింది. కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై, ఇకపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలిసింది. పొద్దుపోయే వరకు సీఎంతో పాటే ఉన్న జగదీశ్ రెడ్డి ఈ వ్యవహారంపై మంతనాలు జరిపారు. ఎంసెట్ కౌన్సెలింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ చేసిన వాదనలు, స్థానికత విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్చించినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో తెలంగాణ తర ఫున వాదనలు వినిపించే సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేతో సమన్వయం చేసుకుని సుప్రీం ఎదుట గట్టి వాదనలు వినిపించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది.

కౌన్సెలింగ్‌కు మనమే సిద్ధంగా ఉన్నాం!
ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతి పొందిన కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఆయా కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు సంబంధిత యూనివర్సిటీల నుంచి అఫిలియేషన్లు ఇచ్చేందుకు తనిఖీలు కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం స్థానంలో ఫాస్ట్(తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం) పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది.

మార్గదర్శకాల రూపకల్పనకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. అంతేకాదు తెలంగాణకు ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసింది. ఒకటీ రెండు రోజుల్లో ఈ మండలికి చైర్మన్, వైస్ చైర్మన్ల నియామకాలు కూడా చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ వివరాలన్నింటినీ సుప్రీం దృష్టికి తీసుకొస్తూ ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించడానికి తాము  సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని గట్టిగా చెప్పాలని సర్కారు భావిస్తోంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్ నిర్వహణ వ్యవహారాలన్నీ తెలంగాణ నుంచే జరగాల్సి ఉంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాలేజీలకు ప్రభుత్వ అనుమతులు రాలేదు. వర్సిటీల నుంచి అఫిలియేషన్ల ప్రక్రియ జరగలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. అయినా ఆ రాష్ర్ట ప్రభుత్వం కౌన్సెలింగ్ కోసం తొందరపెడుతోంది. ఇవన్నీ సుప్రీం దృష్టికి తీసుకురావాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. కాగా, సుప్రీం తాజా ఆదేశాలకు సంబంధించిన కాపీ తమకు అందాక క్షుణ్నంగా పరిశీలించి ముందుకు సాగుతామని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement