హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి 20వ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు సాయం అందించడానికి రక్తదానం చేసినట్టు వెల్లడించారు. అలాగే స్థానిక ఆస్పత్రుల్లో రక్తదానం చేసి వారికి సాయంగా నిలవాలని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు తమ ఇళ్లపైనే పార్టీ జెండా ఎగరవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్ అవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అలాగే ఈ సారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా పార్టీ పతాకావిష్కరణ చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment