సమావేశంలో పాల్గొన్న మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి నేతన్నల సదస్సులు ప్రతి జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు, వృత్తి అభివృద్ధి పథకాలను వివరించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చేనేత, వస్త్ర పరిశ్రమ రంగాల అభివృద్ధిపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం సచివాలయంలో కేటీఆర్ సమీక్షించారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని చేనేత కార్మికుల సమస్యలపై చర్చించారు. సిద్దిపేట జిల్లాలో నేతన్నల తొలి సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు కేటీఆర్, హరీశ్‌రావు సూచించారు.
గొల్లభామ చీరలకు ఆదరణ
సిద్దిపేట గొల్లభామ చీరలకు ప్రజల్లో ఆదరణ లభిస్తోందని, వాటికి మరింత ప్రాచుర్యం కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని గోల్కొండ షోరూంలలో ఈ చీరలను అందుబాటులో ఉంచుతామన్నారు. సిద్దిపేటలో గొల్లభామ చీరలు నేసే 30 మంది చేనేత కార్మికులకు జఖాత్‌లు ఇవ్వాలని హరీశ్‌రావు అధికారులకు సూచించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని చేనేత కార్మికులకు నిర్వహణ పెట్టుబడి త్వరగా అందించాలని సూచించారు. పూచీకత్తు లేకుండా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణం అందించే అంశాన్ని పరిశీలించాలని కేటీఆర్ ఆదేశించారు. చేనేత కార్మికులకు రుణ మాఫీ సజావుగా అందేలా చూడాలన్నారు. జిల్లాల వారీగా ఎంతమందికి రుణమాఫీ జరిగిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రుణ మాఫీపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
సిద్దిపేట, దుబ్బాకలో చేనేత క్లస్టర్..
సిద్దిపేట, దుబ్బాకలో ప్రత్యేక చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని, దుబ్బాక, చేర్యాల, సిద్దిపేటల్లో అసంపూర్తిగా ఉన్న చేనేత సొసైటీల భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని హరీశ్‌రావు కోరగా, కేటీఆర్ అందుకు అంగీకరించారు. నేతన్నల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంలో చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా నేతన్నల జీవితాల్లో మార్పు వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలు, యూనిఫాంల సరఫరా, వివిధ ప్రభుత్వ శాఖలు జరిపే వస్త్ర సేకరణ ఆర్డర్ల ద్వారా నేతన్నలకు చేతి నిండా పని దొరుకుతుందని పేర్కొన్నారు.
నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, మగ్గాల ఆధునీకరణ వంటి పథకాలతో నేతన్నలకు ప్రయోజనం చేకూరుతోందని చెప్పారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయనున్న చేనేత చీరలను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు అధికారులు చూపించగా.. వారు సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, చింత ప్రభాకర్, సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment