Seminars
-
GIS 2023: 9 రంగాలపై సెమినార్లు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో పలు రంగాలలో మొదటి రోజు సెమినార్లు జరిగాయి. వీటిలో ప్రధానంగా రెన్యువబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ (పునరుత్పాదక శక్తి), ఆరోగ్య భద్రత – వైద్య పరికరాలు, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఐటీ, ఆటోమేటివ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ ఇన్నోవేషన్స్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రోసెసింగ్ రంగాల్లో సెమినార్లు నిర్వహించారు. పారిశ్రామికవేత్తలకు మంత్రులు, అధికారులు ప్రభుత్వ విధానాలను వివరించారు . ఏపీ ప్రభుత్వం అందించే అవకాశాలతో పాటు ఇక్కడ విస్తారంగా ఉన్న భూమి, వనరులు, నైపుణ్యం కలిగిన యువత, పుష్కలంగా నీటి లభ్యత, నిరంతర విద్యుత్ సరఫరాను వివరించారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని తెలిపారు. ఆరోగ్య భద్రత – వైద్య పరికరాలు ‘ఆరోగ్య భద్రత – వైద్య పరికరాలు’ రంగంపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని హాజరయ్యారు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ఆమె వివరించారు. ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు, కార్పొరేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 95 శాతం ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. రాష్ట్రంలోని 2,200 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా 3,200 రోగాలకు వైద్యం అందిస్తున్నాం. పార్లమెంట్ నియోజకవర్గానికో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. వైద్య విభాగంలో పెట్టుబడులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది’ అని మంత్రి వివరించారు. దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన మణిపాల్ ఎంటర్‌ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో దిలీప్ జోష్, ఉస్మానియా వైద్య నిపుణులు గురునాథ్‌రెడ్డి, ఎయిమ్స్ హెచ్‌వోడీ ముకేష్ త్రిపాఠి తదితరులు క్వాలిటీ హెల్త్ సిస్టమ్, ప్రైవేట్ సెక్టార్ హెల్త్ కేర్, వైద్య రంగం ద్వారా వచ్చే రెవెన్యూ, ఉద్యోగావకాశాలు, ఇమేజింగ్ హెల్త్ కార్డ్ డెలివరీ, కమ్యునికబుల్, నాన్ కమ్యునికబుల్ డిసీజస్ అనే అంశాలపై మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు అందిస్తున్న ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ విధానాన్ని, ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ తెలుగువారికి అందిస్తున్న ఉచిత వైద్యాన్ని ప్రశంసించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. పునరుత్పాదక ఇంధన శక్తి రెన్యువబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ (పునరుత్పాదక ఇంధన శక్తి) రంగంలో పెట్టుబడిదారులతో రాష్ట్ర ఇంధన శక్తి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన శక్తి రంగంలో పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే సదుపాయాలు, ఆర్పీవో ప్రయోజనాలను వివరించారు. ‘2030 నాటికి ఏపీలో 500 కేటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రభుత్వ లక్ష్యం. 10 నుంచి 15 బిలియన్ డాలర్ల గ్రీన్ఎనర్జీ అవకాశాలు ఏపీలో ఉన్నాయి. 38 జీడబ్ల్యూ సోలార్, 44 జీడబ్ల్యూ విండ్, 34 జీడబ్ల్యూ హైడ్రో ప్రాజెక్టులకు అవకాశాలున్నాయి. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం, 6 పోర్టులు, ఇతర రాష్ట్రాలతో పోల్చితే 45% ఎకనామికల్ వాటర్ సదుపాయం ఏపీలో ఉన్నాయి. నిపుణులైన మానవ వనరులు కూడా అందుబాటులో ఉన్నాయి’ అని పెద్దిరెడ్డి వివరించారు. -
ఆర్కిటెక్చర్ విద్యార్థులకు గీతాబోధ
తమ చుట్టూ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు కొందరైతే.. పనిచేస్తోన్న రంగంలో మూలాల వరకు ఉన్న లోటుపాట్లు, అవకాశాలను వ్యక్తిగతంగా శోధించి తెలుసుకుని, వాటిని సరిచేయడానికి, సమాజాభివృద్ధికి తోడ్పడే విధంగా కార్యరూపం దాల్చుతారు. ఈ కోవకు చెందిన వారే 53 ఏళ్ల ఆర్కిటెక్ట్ గీతా బాలకృష్ణన్. కోల్‌కతాకు చెందిన గీతా బాలకృష్ణన్.. ఢిల్లీలోని స్కూల్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో బీఆర్క్ చదివింది. కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో ప్రాక్టికల్ శిక్షణ తీసుకుంది. తరువాత వివిధ ఆర్టిటెక్ట్ల దగ్గర ఉద్యోగం చేసింది. కానీ ఆమెకు అక్కడ చేసే పని సంతృప్తినివ్వలేదు. దీంతో ‘నిర్మాణ రంగంలో ప్రత్యామ్నాయ పద్ధతులు’ పై కోర్సు చేసింది. ఈ కోర్సు చేసేసమయంలో ప్రొఫెసర్ కేఎస్ జగదీష్‌తో పరిచయం ఏర్పడింది. ఈయన మార్గదర్శకంలో సాంప్రదాయేతర ఆర్కిటెక్ట్ డిజైన్లపై గీతకు మక్కువ ఏర్పడింది. దీంతో పర్యావరణానికి హాని కలగని డిజైన్లు చేస్తూనే..బెంగళూరుకు చెందిన ఎన్జీవో ఆవాస్ (అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ అండ్ సర్వీసెస్) పరిచయంతో ఎన్జీవో తరపున సేవాకార్యక్రమాలు నిర్వహించేది. ఇలా చేస్తూనే పట్టణాల్లో నివసిస్తోన్న నిరుపేదలకు ఆవాసం కల్పిస్తున్న మరో సంస్థతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఈవిధంగా సామాజిక సేవచేస్తూనే మరోపక్క ఎంతోమంది కలల ఇంటినిర్మాణాలకు ప్లాన్లు రూపొందించేది. ఇథోస్ అనేక ప్రాజెక్టుల్లో పనిచేసిన తరువాత ఆర్కిటెక్చర్ విద్యార్థులకు, నిర్మాణ రంగంలో ఉన్న ఇంజినీరింగ్ వృత్తి నిపుణులకు మధ్య సమన్వయం కొరవడిందని గుర్తించింది గీత. ఈ గ్యాప్‌కు ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ‘ఇథోస్’ సంస్థను స్థాపించి విద్యార్థులకు, సివిల్ ఇంజినీరింగ్ నిపుణులకు మధ్య వారధిని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరువందల కాలేజీల్లోని మూడువేలకుపైగా విద్యార్థులను వివిధ ఆర్టిటెక్ట్ సెమినార్లు నిర్వహించి వారికున్న సందేహాలను నివృత్తి చేసేలా, ఇంజినీరింగ్ పట్ల వృత్తిపరమైన అవగాహన కల్పించేలా వృత్తినిపుణులకు, విద్యార్థులను ముఖాముఖి పరిచయ కార్యక్రమాల ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ఆర్కిటెక్ట్ విద్యార్థులు తమ డిగ్రీ అయిన వెంటనే వారి ఆసక్తికి తగిన ఉద్యోగం సులభంగా దొరికే సదుపాయం కల్పిస్తోంది ఇథోస్. 2018లో ఇథోస్.. ఏసీఈడీజీఈ పేరిట ఆన్లైన్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించింది. దీనిద్వారా కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ అండ్ డిజైనింగ్‌లో ఆన్లైన్ మాడ్యూల్స్‌ను అందిస్తోంది. ఆరు రాష్ట్రాలు..1700 కిలోమీటర్లు మానవుని జీవన శైలిపై అతను నివసించే భవన నిర్మాణ ప్రభావం కూడా ఉంటుందని గీత గట్టిగా నమ్ముతోంది. ఆర్కిటెక్ట్‌లు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్లు రూపొందించాలని ఆమె చెబుతోంది. అలా చెప్పడం దగ్గరే ఆగిపోకుండా తన ఇథోస్ ఫౌండేషన్ స్థాపించి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్‌కతా నుంచి ఢిల్లీవరకు అర్కాజ్ పేరిట 1700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ పాదయాత్రలో భాగంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలలో పర్యటించింది. కాలినడకనే ఆరు రాష్ట్రాల్లో తిరుగుతూ అక్కడి సంప్రదాయాలు, భవన నిర్మాణ శైలిని దగ్గరగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న కొంతమందితో మాట్లాడి వారి ఇంటి నిర్మాణం, ఆ ఇంటితో ఉన్న అనుబంధం, ఎలాంటి అనుభూతిని పొందుతున్నారో అడిగి తెలుసుకుంది. ఇంటి నిర్మాణానికి మంచి ప్లానింగ్ ఉంటే జీవితం మరింత సుఖమయమవుతుందని పాదయాత్రలో అనేకమందికి అవగాహన కల్పించింది. వందల కిలోమీటర్ల ప్రయాణంలో తాను తెలుసుకున్న అనేక విషయాలను యువ ఆర్కిటెక్ట్‌లకు తెలియ జెబుతోంది. బాగా స్థిరపడిన వారు వృద్ధాప్యం లో తమ సొంత గ్రామాల్లో జీవించేందుకు వసతి సదుపాయాల డిజైన్లు, నిరుపేదలు కనీస వసతి సదుపాయాల కోసం ఏం కోరుకుంటున్నారో దగ్గరగా చూసిన గీత వారికి తగిన డిజైన్లు ఎలా రూపొందించాలి? ఆ డిజైన్లు నిరుపేదల జీవన శైలిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో కాబోయే ఆర్కిటెక్ట్‌లకు వివరిస్తోంది. చేస్తోన్న పనిలోని లోటుపాట్లు్ల, అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్ తరాలను మెరుగుపరిచేందుకు కృషిచేస్తోన్న గీత లాంటి వాళ్లు మరింత మంది ఉంటే నాణ్యమైన వృత్తి నిపుణులుగా మరెందరో ఎదుగుతారు. -
సీఎం జగన్ ఏడాది పాలన: ప్రత్యేక సదస్సులు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు రోజుల పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. (రుణపడి ఉంటాం.. థాంక్యూ జగనన్న) 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం.. 25న పరిపాలన సంస్కరణలు-సంక్షేమం, 26న వ్యవసాయం-అనుబంధ రంగాలు, 27న విద్యారంగం సంస్కరణలు-పథకాలు, 28 న పరిశ్రమలు-పెట్టుబడుల రంగం, 29న వైద్య ఆరోగ్య రంగం సంస్కరణలు-పథకాలపై సదస్సులు నిర్వహించనున్నారు. 30న రైతు భరోసా కేంద్రాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఆన్లైన్ పద్దతిలో.. ఆన్ లైన్ పద్దతిలో సదస్సులను ప్రభుత్వం నిర్వహించనుంది. సదస్సుల్లో ప్రతి రోజు సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. జిల్లా స్థాయిలో ఇంచార్జ్ మంత్రి, మంత్రులు, లబ్ధిదారులతో సదస్సులు జరగనున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ 50 మంది మాత్రమే పాల్గొనాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
త్వరలో జిల్లా స్థాయి నేతన్నల సదస్సులు
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి నేతన్నల సదస్సులు ప్రతి జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు, వృత్తి అభివృద్ధి పథకాలను వివరించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చేనేత, వస్త్ర పరిశ్రమ రంగాల అభివృద్ధిపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం సచివాలయంలో కేటీఆర్ సమీక్షించారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని చేనేత కార్మికుల సమస్యలపై చర్చించారు. సిద్దిపేట జిల్లాలో నేతన్నల తొలి సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు కేటీఆర్, హరీశ్‌రావు సూచించారు. గొల్లభామ చీరలకు ఆదరణ సిద్దిపేట గొల్లభామ చీరలకు ప్రజల్లో ఆదరణ లభిస్తోందని, వాటికి మరింత ప్రాచుర్యం కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని గోల్కొండ షోరూంలలో ఈ చీరలను అందుబాటులో ఉంచుతామన్నారు. సిద్దిపేటలో గొల్లభామ చీరలు నేసే 30 మంది చేనేత కార్మికులకు జఖాత్‌లు ఇవ్వాలని హరీశ్‌రావు అధికారులకు సూచించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని చేనేత కార్మికులకు నిర్వహణ పెట్టుబడి త్వరగా అందించాలని సూచించారు. పూచీకత్తు లేకుండా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణం అందించే అంశాన్ని పరిశీలించాలని కేటీఆర్ ఆదేశించారు. చేనేత కార్మికులకు రుణ మాఫీ సజావుగా అందేలా చూడాలన్నారు. జిల్లాల వారీగా ఎంతమందికి రుణమాఫీ జరిగిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రుణ మాఫీపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. సిద్దిపేట, దుబ్బాకలో చేనేత క్లస్టర్.. సిద్దిపేట, దుబ్బాకలో ప్రత్యేక చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని, దుబ్బాక, చేర్యాల, సిద్దిపేటల్లో అసంపూర్తిగా ఉన్న చేనేత సొసైటీల భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని హరీశ్‌రావు కోరగా, కేటీఆర్ అందుకు అంగీకరించారు. నేతన్నల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంలో చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా నేతన్నల జీవితాల్లో మార్పు వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలు, యూనిఫాంల సరఫరా, వివిధ ప్రభుత్వ శాఖలు జరిపే వస్త్ర సేకరణ ఆర్డర్ల ద్వారా నేతన్నలకు చేతి నిండా పని దొరుకుతుందని పేర్కొన్నారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, మగ్గాల ఆధునీకరణ వంటి పథకాలతో నేతన్నలకు ప్రయోజనం చేకూరుతోందని చెప్పారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయనున్న చేనేత చీరలను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు అధికారులు చూపించగా.. వారు సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, చింత ప్రభాకర్, సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
మెట్పల్లి మున్సిఫ్ జడ్జి సంతోష్‌కుమార్ గుండంపల్లిలో న్యాయవిజ్ఞాన సదస్సు మల్లాపూర్ (కోరుట్ల) : గ్రామీణ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేం దుకే న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు మెట్పల్లి మున్సిఫ్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ సంతోష్‌కుమార్ అన్నారు. మండలంలోని గుండంపల్లిలో ఆదివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన హాజరై మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగినపుడు పౌరులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని తెలిపారు. పేదలకు ఉచిత న్యాయ సేవలందించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో కోఆర్డినేటర్‌గా ఎలేటి రాంరెడ్డి ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు సేవలందిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై సతీశ్, సర్పంచ్ భూపెల్లి దేవయ్య, ఎంపీటీసీ మార్గం హారీకప్రతాప్, మల్లాపూర్ సింగిల్ విండో చైర్మన్ ఏలేటి రాంరెడ్డి, ఉపసర్పంచ్ జక్కుల అనిల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మెహన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు మగ్గిడి వెంకటనర్సయ్య, పుప్పాల భానుమూర్తి, కొండ ప్రవీణ్‌కుమార్, రాజ్‌మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
విజ్ఞానాభివృద్ధికి సదస్సులు దోహదం
వెలుగుబంద (రాజానగరం) : తరగతిలో పొందిన విజ్ఞానాన్ని మరింతగా వృద్ధి చేసుకునేందుకు సదస్సులు దోహదపడతాయని ఓఎ¯ŒSజీసీ జీఎం (హెచ్ఆర్) ఆర్కే శర్మ అన్నారు. గైట్ కళాశాలలో ‘మేగ్న 2కే16’ పేరిట నిర్వహించిన మేనేజ్మెంట్ ఫెస్ట్ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పారిశ్రామిక రంగంలో ఆటోమేష¯ŒS విధానం పెరుగుతోందని, తదనుగుణంగా యువ ఇంజనీర్లు కూడా తయారుకావాలని గైట్ కళాశాల ఎండీ కె.శశికిరణ్‌వర్మ అన్నారు. అప్పుడే ఉపాధి, ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయన్నారు. సదస్సు సందర్భంగా నిర్వహించిన వివిధ వైజ్ఞానిక పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే మిస్ మేగ్నస్‌గా సాయిప్రణవి, మిస్టర్ మేగ్నస్‌గా భానుశంకర్‌లను ప్రకటించారు. యమహా లక్కీ డ్రా విజేత కె.పద్మకు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.లక్ష్మి శశికిరణ్‌వర్మ, ఓఎ¯ŒSజీసీ జీఎం (హెచ్ఆర్) కాకినాడ డీకే కలోరా, గెయిల్ హెచ్ఆర్ రాజమహేంద్రవరం హెడ్ రెడ్డి, డీజీఎం కేవీఎస్ రావు, చీఫ్ మేనేజర్ రాజారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు పలు సంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. -
'అవగాహన సదస్సులు నిర్వహిస్తాం'
విజయవాడ: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోని మండలాల్లో మాస్టర్ ప్లాన్‌పై అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌పై రాజధాని ప్రాంత ప్రజల్లో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ నెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. అలాగే అగ్రికల్చర్ జోన్‌పై అభ్యంతరాలను స్వీకరించేందుకు ఫిబ్రవరి 15 వరకు గడువు ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 1న ల్యాండ్ పూలింగ్, మాస్టర్ ప్లాన్‌పై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామకంఠాల సమస్యను సీఆర్డీఏ కమిషనర్, గుంటూరు కలెక్టర్ పరిష్కరిస్తారని నారాయణ స్పష్టం చేశారు. -
విజయం: స్తుతి... అందరమ్మాయిల్లా కాదు!
దేశవిదేశాల్లో మహిళా సాధికారతకు సంబంధించిన సెమెనార్లలో పాల్గొన్న స్తుతి తన కంపెనీని కేవలం మహిళా ఉద్యోగులతోనే నడిపిస్తుండటం విశేషం! సాధారణంగా ఓ అమ్మాయికి 23 ఏళ్లొచ్చేసరికి ఏం చేస్తుంటుంది? సరదాగా కాలేజీకి వెళ్తూ చదువు కొనసాగిస్తుంటుంది! మరి అదే వయసులో ఓ మార్వాడి అమ్మాయి ఏం చేస్తుంటుంది..? సంప్రదాయబద్ధులారై పెళ్లి చేసుకుని తల్లి కూడా అవుతుంది. కానీ స్తుతి జలన్ ఆ వయసులో మిగతా అమ్మాయిల్లా పుస్తకాలతో కుస్తీ పట్టలేదు.. తోటి అమ్మాయిల్లా పిల్లల్ని కనే పనిలోనూ పడలేదు! ఏ అండా లేకుండానే, పెద్దగా పెట్టుబడి కూడా పెట్టకుండానే సొంతంగా కంపెనీ ఆరంభించింది! ఆపై ఎంతో శ్రమించి.. దాన్ని గొప్ప స్థాయికి తీసుకొచ్చింది. ఆ కథేంటో తెలుసుకుందాం రండి! ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉండే రాజ్‌గంగపూర్ అనే చిన్న పట్టణంలో మార్వాడి కుటుంబానికి చెందిన స్తుతి జలన్.. తమ ఊర్లో సరైన పాఠశాలలు లేవని, తన అక్కతో కలిసి జైపూర్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుకుంది. ఐతే చదువు మీద స్తుతికి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే తన అక్కకు తల్లిదండ్రులు పెళ్లి చేసేయడంతో ఆమెకు దిగులు పట్టుకుంది. చదువు ఆపేస్తే తనకూ పెళ్లి చేసేస్తారని పుస్తకాలతో కుస్తీ పట్టింది. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక.. మీడియా-కమ్యూనికేషన్‌తో పాటు కొన్ని కోర్సులు చేసింది. తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించింది. ఐతే ఆ ఉద్యోగం ఆమెకు నచ్చలేదు. మరోవైపు పెళ్లి కోసం తల్లిదండ్రుల పోరు! ఈ పరిస్థితుల్లో ఓ నిర్ణయం స్తుతి జీవితాన్ని మలుపు తిప్పింది. అదే.. సొంతంగా క్రాస్‌హెయిర్స్ కమ్యూనికేషన్స్ అనే పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీ ఆరంభించడం! వ్యాపారం ఎవరైనా ఆరంభిస్తారు.. కానీ ఆరంభంలో వచ్చే ఒడుదొడుకుల్ని తట్టుకుని, దాన్ని నిలబెట్టడంలోనే ఉంది గొప్పదనం! స్తుతి చేసిందదే. తన దగ్గర ఉన్న పొదుపు డబ్బులతో ముంబయిలో తన గురువు ప్రహ్లాద్ కక్కర్ కార్యాలయంలోనే ఓ వైపు టేబుల్ మీద కంప్యూటర్‌తో తన కంపెనీని మొదలెట్టింది స్తుతి. ఉద్యోగులంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి తనూ శ్రమించింది. ఏడాది పాటు కష్టపడితే.. సొంతంగా మరో ఆఫీస్ తీసుకునేంత ఆదాయం సమకూరింది. కంపెనీ ఆరంభించిన తర్వాతి ఏడాది, అంటే 2002లో స్తుతికి ఓ పెద్ద ఈవెంట్ చేసే అవకాశం దక్కింది. అనురాధ అనే ఓ జిమ్ యజమాని.. అనాథ బాలల కోసం చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమం అది. దీన్నుంచి పెద్దగా డబ్బులేమీ రాలేదు కానీ.. స్తుతి పీఆర్ ఏజెన్సీకి మంచి పబ్లిసిటీ లభించింది. దీని తర్వాత ఈవెంట్లు వరుస కట్టాయి. ఫోస్టర్స్, యాక్స్ పల్స్ వంటి సంస్థలు ఆమెతో ఈవెంట్లు చేయించాయి. అందరిలా మామూలుగా ఈవెంట్లు చేయకుండా.. తన ప్రత్యేకత చూపించింది స్తుతి. తక్కువ ఖర్చుతో గ్రాండ్ ఈవెంట్లు చేయడం, కొత్తదనం చూపించడంతో ముంబయిలో ‘క్రాస్‌హెయిర్స్’కు మంచి పేరొచ్చింది. ఐతే ఆ సమయంలోనే పెళ్లి కావడం వల్ల స్తుతి ఢిల్లీకి మకాం మార్చాల్సి వచ్చింది. అక్కడ మళ్లీ కొత్తగా ‘క్రాస్‌హెయిర్స్’ ప్రయాణం మొదలైంది. రెండు మూడేళ్ల తర్వాత అక్కడ కూడా పేరు తెచ్చుకున్న స్తుతి రెండు ప్రధాన నగరాల్లోనూ ‘క్రాస్‌హెయిర్స్’ను ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ప్రస్తుతం క్రాస్హెయిర్స్కు ఢిల్లీ ఫ్యాషన్ వీక్, బ్రిటిష్ కౌన్సిల్, సత్యపాల్, సోనీ పిక్చర్స్, ప్రొవోగ్, నీతా లుల్లా, బకార్డి వంటి క్లైంట్లు సొంతం. 2011లో యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ గ్లోబల్ ఉమెన్స్ ప్రోగ్రాంలో నికోల్ కిడమన్, చెల్సియా క్లింటన్ వంటి ప్రముఖులతో కలిసి పాల్గొనే అవకాశం దక్కింది స్తుతికి. అంతే కాదు.. ఉమెన్ లీడర్స్ ఇండియా అవార్డ్స్‌లో ఆమెకు ‘బెస్ట్ యంగ్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్’ పురస్కారం కూడా దక్కింది. దేశవిదేశాల్లో మహిళా సాధికారతకు సంబంధించిన సెమెనార్లలో పాల్గొన్న స్తుతి తన కంపెనీని కేవలం మహిళా ఉద్యోగులతోనే నడిపిస్తుండటం విశేషం! - ప్రకాష్ చిమ్మల -
నేటినుంచి ‘రైతుహిత’ సదస్సులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించేందుకు వీలుగా రైతులను సమాయత్తం చేయడానికి ‘రైతుహిత’ పేరిట ఆదివా రం నుంచి సమగ్ర రైతు సదస్సులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ స్మితా సబర్వాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి సాగు పద్ధతులు, పంట మార్పిడి, కలుపు నివారణ, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం, ఆరుతడి పంటలు, ఉద్యా న పంటలు, పూలు, పండ్ల తోటల పెంపకంతోపాటు పాల ఉత్పత్తి తదితర అంశాలపై నియోజకవర్గ పరిధి లో ఉత్తమ ఫలితాలు సాధించిన రైతులతో సలహా లు, సూచనలతో కూడిన అవగాహన కల్పిస్తామని ఆ మె పేర్కొన్నారు. జిల్లాలో మట్టి సామర్థ్యానికి అనుగుణంగా పంటలను పండించడంపై అవగాహన కల్పిస్తామన్నారు. సాగులో రైతు పెట్టుబడిని తగ్గించడానికి అనుగుణంగా యాంత్రీకరణను ప్రోత్సహించడం, డ్రమ్ సీడింగ్ విధానంలో వరి నాటడంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. వీటితోపాటు వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య, పట్టుపరిశ్రమ, విద్యుత్, బ్యాంకర్లు తదితరులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే అవగాహన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. దుబ్బాక నుంచి ప్రారంభం.. నియోజకవర్గాల వారీగా నిర్వహించే రైతు హిత సదస్సులను దుబ్బాక నుంచి ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన అవగాహనసదస్సును మిరుదొడ్డిలోని టీటీ డీ కళ్యాణ మండపంలో ఆదివారం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. డి సెంబర్ 4న గజ్వేల్, 5న సిద్దిపేట, 6న నర్సాపూర్, 12న నా రాయణఖేడ్, 20న సంగారెడ్డి, 21న పటాన్చెరు ని యోజకవర్గాలకు సంబంధించి సమగ్ర రైతు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. -
కాకతీయుల చరిత్రపై సెమినార్లు
గణపురం, న్యూస్‌లైన్ : కాకతీయుల చరిత్రను ప్రపంచానికి తెలియజేయడానికే ఏడాదిపాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పౌర సంబంధాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని గణపేశ్వరాలయం(కోటగుళ్లు)లో మూడు రోజులపాటు జరిగిన కాకతీయ ఉత్సవాలు గురువా రం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాకతీయుల పాలనలో దేవాలయాలు, భారీ నీటి వనరులు, గొలుసు కట్టు చెరువులను తవ్వించారని చెప్పారు. ఈ నీటి వనరులు నేటికీ వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో ప్రపంచ బ్యాంక్ నిధుల తో జిల్లాలోని అన్ని చెరువులకు మరమ్మతులు చేయించిన ట్లు చెప్పారు. కాకతీయుల చరిత్ర, పాలనపై జాతీయ స్థాయి సెమినార్లు నిర్వహిస్తామని, గణపేశ్వరాలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గణపేశ్వరాలయా న్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పర్చడానికి శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. కాకతీయ ఉత్సవాలకు గుర్తుగా గణపేశ్వరాలయ ప్రాంగణంలో కేంద్ర పురావస్తు మంత్రిత్వశాఖ దేవాలయానికి మంజూరు చేసిన రూ.2కోట్ల 70లక్షల నిధుల నుంచి ఆర్చి నిర్మిస్తామని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య చెప్పారు. ఆలయ పునరుద్ధరణ పనులకు నిధులు మంజూ రు చేయించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్లో చివరి వారంలో ముగింపు ఉత్సవాలు : కలెక్టర్ కిషన్ కాకతీయ ముగింపు ఉత్సవాలు డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో ఉంటాయని కలెక్టర్ కిషన్ తెలిపారు. అక్టోబర్ 2న ఇంటాక్ ఆధ్వర్యంలో రాణి రుద్రమదేవి మహిళా సాధికారత సదస్సు, 5, 6 తేదీల్లో యువజన ఉత్సవాలు, 25, 26 తేదీల్లో ‘కాకతీయ చరిత్ర-కళలు-కట్టడాలు’ అనే అంశంపై కాకతీ య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నవంబర్ 9, 10 తేదీల్లో ఇరిగేష న్, టెక్నాలజీ ఆఫ్ కాకతీయాస్ అనే అంశంపై ఎన్ఐటీ ఇం టాక్ ఆధ్వర్యంలో సదస్సు, నవంబర్ 14న కాకతీయ బాలల సృజనోత్సవాలు, డిసెంబర్13, 14 తేదీల్లో రాక్ రిస్టోరేషన్‌పై సెమినార్ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. దేవాలయాలను పరిరక్షించుకోవాలి : డీఐజీ కాంతారావు కాకతీయులనాటి దేవాలయాలను పరిరక్షించుకుని భావితరాలవారికి అందించవలసిన గురుతర బాధ్యత మన అందరిపై ఉందని డీఐజీ కాంతారావు అన్నారు. కాకతీయుల కాలం స్వర్ణయుగమని, భక్తి కోసం దేవాలయాలను నిర్మించి కాకతీయులు చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. కోటగుళ్లలో ముగిసిన కాకతీయ ఉత్సవాలు మండల కేంద్రంలోని గణపేశ్వరాలయం(కోటగుళ్లు)లో ఈనెల 24 నుంచి నిర్వహించిన కాకతీయ ఉత్సవాలు గురువారం విజయవంతంగా ముగిసాయి. కాకతీయ సామ్రాజ్యానికి 930 ఏళ్లు, రామప్పగుడి నిర్మాణం జరిగి 800 ఏళ్లు, రాణి రుద్రమదేవి పట్టాభిషేకం జరిగి 750 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పాటు జిల్లాలో కాకతీయ ఉత్సవాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొద టి, రెండు విడుతల్లో కోటగుళ్లలో ఉత్సవాలకు అవకాశం లభించకపోయినా ఈ మూడు రోజులు ఉత్సవాలు అంగరం గ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో కనిపించని జిల్లా మంత్రులు కోటగుళ్లలో రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాకతీయ ఉత్సవాల్లో జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య మూడు రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా హాజరు కాకపోవడంపై స్థానికుల్లో నిరసన వ్యక్తమైంది. సొంత జిల్లాలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొనకపోవడం దురదృష్టకరమని పలు రాజకీయ పార్టీల నాయకులు విమర్శించారు.