విజయం: స్తుతి... అందరమ్మాయిల్లా కాదు! | shuthi is a unique girl | Sakshi
Sakshi News home page

విజయం: స్తుతి... అందరమ్మాయిల్లా కాదు!

Published Sun, Dec 1 2013 4:12 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

విజయం: స్తుతి... అందరమ్మాయిల్లా కాదు! - Sakshi

విజయం: స్తుతి... అందరమ్మాయిల్లా కాదు!

  దేశవిదేశాల్లో మహిళా సాధికారతకు సంబంధించిన సెమెనార్లలో పాల్గొన్న స్తుతి తన కంపెనీని కేవలం మహిళా ఉద్యోగులతోనే నడిపిస్తుండటం విశేషం!
 
 సాధారణంగా ఓ అమ్మాయికి 23 ఏళ్లొచ్చేసరికి ఏం చేస్తుంటుంది? సరదాగా కాలేజీకి వెళ్తూ చదువు కొనసాగిస్తుంటుంది! మరి అదే వయసులో ఓ మార్వాడి అమ్మాయి ఏం చేస్తుంటుంది..? సంప్రదాయబద్ధులారై పెళ్లి చేసుకుని తల్లి కూడా అవుతుంది. కానీ స్తుతి జలన్ ఆ వయసులో మిగతా అమ్మాయిల్లా పుస్తకాలతో కుస్తీ పట్టలేదు.. తోటి అమ్మాయిల్లా పిల్లల్ని కనే పనిలోనూ పడలేదు!
 
 ఏ అండా లేకుండానే, పెద్దగా పెట్టుబడి కూడా పెట్టకుండానే సొంతంగా కంపెనీ ఆరంభించింది! ఆపై ఎంతో శ్రమించి.. దాన్ని గొప్ప స్థాయికి తీసుకొచ్చింది. ఆ కథేంటో తెలుసుకుందాం రండి!
 
 ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉండే రాజ్‌గంగపూర్ అనే చిన్న పట్టణంలో మార్వాడి కుటుంబానికి చెందిన స్తుతి జలన్.. తమ ఊర్లో సరైన పాఠశాలలు లేవని, తన అక్కతో కలిసి జైపూర్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుకుంది. ఐతే చదువు మీద స్తుతికి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే తన అక్కకు తల్లిదండ్రులు పెళ్లి చేసేయడంతో ఆమెకు దిగులు పట్టుకుంది. చదువు ఆపేస్తే తనకూ పెళ్లి చేసేస్తారని పుస్తకాలతో కుస్తీ పట్టింది. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక.. మీడియా-కమ్యూనికేషన్‌తో పాటు కొన్ని కోర్సులు చేసింది. తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించింది. ఐతే ఆ ఉద్యోగం ఆమెకు నచ్చలేదు. మరోవైపు పెళ్లి కోసం తల్లిదండ్రుల పోరు! ఈ పరిస్థితుల్లో ఓ నిర్ణయం స్తుతి జీవితాన్ని మలుపు తిప్పింది. అదే.. సొంతంగా క్రాస్‌హెయిర్స్ కమ్యూనికేషన్స్ అనే పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీ ఆరంభించడం!
 
 వ్యాపారం ఎవరైనా ఆరంభిస్తారు.. కానీ ఆరంభంలో వచ్చే ఒడుదొడుకుల్ని తట్టుకుని, దాన్ని నిలబెట్టడంలోనే ఉంది గొప్పదనం! స్తుతి చేసిందదే. తన దగ్గర ఉన్న పొదుపు డబ్బులతో ముంబయిలో తన గురువు ప్రహ్లాద్ కక్కర్ కార్యాలయంలోనే ఓ వైపు టేబుల్ మీద కంప్యూటర్‌తో తన కంపెనీని మొదలెట్టింది స్తుతి. ఉద్యోగులంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి తనూ శ్రమించింది. ఏడాది పాటు కష్టపడితే.. సొంతంగా మరో ఆఫీస్ తీసుకునేంత ఆదాయం సమకూరింది. కంపెనీ ఆరంభించిన తర్వాతి ఏడాది, అంటే 2002లో స్తుతికి ఓ పెద్ద ఈవెంట్ చేసే అవకాశం దక్కింది. అనురాధ అనే ఓ జిమ్ యజమాని.. అనాథ బాలల కోసం చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమం అది. దీన్నుంచి పెద్దగా డబ్బులేమీ రాలేదు కానీ.. స్తుతి పీఆర్ ఏజెన్సీకి మంచి పబ్లిసిటీ లభించింది. దీని తర్వాత ఈవెంట్లు వరుస కట్టాయి. ఫోస్టర్స్, యాక్స్ పల్స్ వంటి సంస్థలు ఆమెతో ఈవెంట్లు చేయించాయి. అందరిలా మామూలుగా ఈవెంట్లు చేయకుండా.. తన ప్రత్యేకత చూపించింది స్తుతి. తక్కువ ఖర్చుతో గ్రాండ్ ఈవెంట్లు చేయడం, కొత్తదనం చూపించడంతో ముంబయిలో ‘క్రాస్‌హెయిర్స్’కు మంచి పేరొచ్చింది. ఐతే ఆ సమయంలోనే పెళ్లి కావడం వల్ల స్తుతి ఢిల్లీకి మకాం మార్చాల్సి వచ్చింది. అక్కడ మళ్లీ కొత్తగా ‘క్రాస్‌హెయిర్స్’ ప్రయాణం మొదలైంది. రెండు మూడేళ్ల తర్వాత అక్కడ కూడా పేరు తెచ్చుకున్న స్తుతి రెండు ప్రధాన నగరాల్లోనూ ‘క్రాస్‌హెయిర్స్’ను ఉన్నత స్థానంలో నిలబెట్టింది.
 
 ప్రస్తుతం క్రాస్‌హెయిర్స్‌కు ఢిల్లీ ఫ్యాషన్ వీక్, బ్రిటిష్ కౌన్సిల్, సత్యపాల్, సోనీ పిక్చర్స్, ప్రొవోగ్, నీతా లుల్లా, బకార్డి వంటి క్లైంట్లు సొంతం. 2011లో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ గ్లోబల్ ఉమెన్స్ ప్రోగ్రాంలో నికోల్ కిడమన్, చెల్సియా క్లింటన్ వంటి ప్రముఖులతో కలిసి పాల్గొనే అవకాశం దక్కింది స్తుతికి. అంతే కాదు.. ఉమెన్ లీడర్స్ ఇండియా అవార్డ్స్‌లో ఆమెకు ‘బెస్ట్ యంగ్ ఉమన్ ఎంటర్‌ప్రెన్యూర్’ పురస్కారం కూడా దక్కింది. దేశవిదేశాల్లో మహిళా సాధికారతకు సంబంధించిన సెమెనార్లలో పాల్గొన్న స్తుతి తన కంపెనీని కేవలం మహిళా ఉద్యోగులతోనే నడిపిస్తుండటం విశేషం!
 -  ప్రకాష్ చిమ్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement