గణపురం, న్యూస్‌లైన్ : కాకతీయుల చరిత్రను ప్రపంచానికి తెలియజేయడానికే ఏడాదిపాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పౌర సంబంధాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని గణపేశ్వరాలయం(కోటగుళ్లు)లో మూడు రోజులపాటు జరిగిన కాకతీయ ఉత్సవాలు గురువా రం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాకతీయుల పాలనలో దేవాలయాలు, భారీ నీటి వనరులు, గొలుసు కట్టు చెరువులను తవ్వించారని చెప్పారు.
ఈ నీటి వనరులు నేటికీ వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో ప్రపంచ బ్యాంక్ నిధుల తో జిల్లాలోని అన్ని చెరువులకు మరమ్మతులు చేయించిన ట్లు చెప్పారు. కాకతీయుల చరిత్ర, పాలనపై జాతీయ స్థాయి సెమినార్లు నిర్వహిస్తామని, గణపేశ్వరాలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గణపేశ్వరాలయా న్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పర్చడానికి శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు.
కాకతీయ ఉత్సవాలకు గుర్తుగా గణపేశ్వరాలయ ప్రాంగణంలో కేంద్ర పురావస్తు మంత్రిత్వశాఖ దేవాలయానికి మంజూరు చేసిన రూ.2కోట్ల 70లక్షల నిధుల నుంచి ఆర్చి నిర్మిస్తామని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య చెప్పారు. ఆలయ పునరుద్ధరణ పనులకు నిధులు మంజూ రు చేయించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
డిసెంబర్‌లో చివరి వారంలో ముగింపు ఉత్సవాలు : కలెక్టర్ కిషన్
కాకతీయ ముగింపు ఉత్సవాలు డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో ఉంటాయని కలెక్టర్ కిషన్ తెలిపారు. అక్టోబర్ 2న ఇంటాక్ ఆధ్వర్యంలో రాణి రుద్రమదేవి మహిళా సాధికారత సదస్సు, 5, 6 తేదీల్లో యువజన ఉత్సవాలు, 25, 26 తేదీల్లో ‘కాకతీయ చరిత్ర-కళలు-కట్టడాలు’ అనే అంశంపై కాకతీ య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నవంబర్ 9, 10 తేదీల్లో ఇరిగేష న్, టెక్నాలజీ ఆఫ్ కాకతీయాస్ అనే అంశంపై ఎన్‌ఐటీ ఇం టాక్ ఆధ్వర్యంలో సదస్సు, నవంబర్ 14న కాకతీయ బాలల సృజనోత్సవాలు, డిసెంబర్13, 14 తేదీల్లో రాక్ రిస్టోరేషన్‌పై సెమినార్ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
దేవాలయాలను పరిరక్షించుకోవాలి : డీఐజీ కాంతారావు
కాకతీయులనాటి దేవాలయాలను పరిరక్షించుకుని భావితరాలవారికి అందించవలసిన గురుతర బాధ్యత మన అందరిపై ఉందని డీఐజీ కాంతారావు అన్నారు. కాకతీయుల కాలం స్వర్ణయుగమని, భక్తి కోసం దేవాలయాలను నిర్మించి కాకతీయులు చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.
కోటగుళ్లలో ముగిసిన కాకతీయ ఉత్సవాలు
మండల కేంద్రంలోని గణపేశ్వరాలయం(కోటగుళ్లు)లో ఈనెల 24 నుంచి నిర్వహించిన కాకతీయ ఉత్సవాలు గురువారం విజయవంతంగా ముగిసాయి. కాకతీయ సామ్రాజ్యానికి 930 ఏళ్లు, రామప్పగుడి నిర్మాణం జరిగి 800 ఏళ్లు, రాణి రుద్రమదేవి పట్టాభిషేకం జరిగి 750 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పాటు జిల్లాలో కాకతీయ ఉత్సవాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొద టి, రెండు విడుతల్లో కోటగుళ్లలో ఉత్సవాలకు అవకాశం లభించకపోయినా ఈ మూడు రోజులు ఉత్సవాలు అంగరం గ వైభవంగా జరిగాయి.
ఉత్సవాల్లో కనిపించని జిల్లా మంత్రులు
కోటగుళ్లలో రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాకతీయ ఉత్సవాల్లో జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య మూడు రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా హాజరు కాకపోవడంపై స్థానికుల్లో నిరసన వ్యక్తమైంది. సొంత జిల్లాలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొనకపోవడం దురదృష్టకరమని పలు రాజకీయ పార్టీల నాయకులు విమర్శించారు.