
రోడ్ల నిర్మాణంలో సమూల మార్పులు
- నగర రోడ్ల విషయంలో మూస పద్ధతులు మానాలి: కేటీఆర్
- అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి
- ముఖ్య శాఖలతో 16న జరిగే వర్క్‌షాప్‌లో కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: నగర రోడ్లు ప్రపంచస్థాయిలో ఉండాలంటే మూస పద్ధతులు మాని విప్లవాత్మక చర్యలు తీసుకోవాల్సి ఉందని మున్సిపల్ మంత్రి కేటీ రామారావు అన్నారు. దీనికోసం అవసరమైతే జీహెచ్‌ఎంసీ బైలాస్, రహదారుల నిర్వహణ మార్గదర్శకాలు మార్చేందుకైనా సిద్ధమన్నారు. శ్రీనగర్‌కాలనీ, యూసుఫ్‌గూడ, గాజులరామారం, షాపూర్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన రహదారుల పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆదివారం స్వయంగా కారు నడుపుకుంటూ రెండు గంటలపాటు ఆయా రోడ్లపై తిరిగిన తాను రోడ్లు బాగాలేనందునే ఇవాళ(సోమవారం) అధికారులతో కలసి పర్యటించానని చెప్పారు.
రోడ్ల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పనితీరు ఇంకా మెరుగు పడాలని అన్నారు. కీలక విభాగాల మధ్య సమన్వయ లోపం ఉండకూడదని అన్నారు. నాలుగు వర్షపు చినుకులకే రోడ్లు గుంతలు పడటం, వాటిని పూడ్చేందుకు ప్యాచ్‌వర్క్‌లకు కోట్లు ఖర్చవుతున్నప్పటికీ ఎగుడుదిగుళ్లు ఏర్పడుతున్నాయన్నారు. కొన్ని మ్యాన్‌హోళ్లు రోడ్లకంటే పైకి, కొన్ని దిగువకు వెళ్లడం జరుగుతున్నాయన్నారు. రోడ్ల నిర్మాణంలో మూస పద్ధతులు మాని సమూల మార్పులు తేవాల్సి ఉందన్నారు.
సమన్వయం పెరగాలి..
వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం జాయింట్ వర్కింగ్ గ్రూపులు పనిచేయాలని గతంలోనే చెప్పానని, జోనల్‌స్థాయి వరకు అవి ఏర్పాటైనప్పటికీ, సర్కిల్ స్థాయిలో ఇంకా ఏర్పాటు కాలేదన్నారు. విద్యుత్ , జలమండలి, రహదారులు తదితర విభాగాలన్నీ కలసి పనిచేయాలన్నారు. అన్ని శాఖలు, సర్వీస్ ప్రొవైడర్లు సమన్వయంతో పనిచేస్తే సమస్యలు రావంటూ అందుకుగాను ఈనెల 16న అన్ని ముఖ్య శాఖలతో వర్క్‌షాప్ నిర్వహించనున్నామని, అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. మంచి రహదారుల కోసం అవసరమైతే చట్ట సవరణ చేస్తామన్నారు.
అక్రమార్కులను వదిలి పెట్టం....
బీఆర్‌ఎస్ గడువు తర్వాత అక్రమ నిర్మాణాలు జరిపేవారిని వదిలిపెట్టబోమని, క్రిమిన ల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గుర్తించిన భవనాల కూల్చివేతలూ జరుగుతున్నాయన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయకుంటే అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వంద రోజుల ప్రణాళిక పనుల్ని 15న వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీసీలతోనే శాశ్వత పరిష్కారం..
రోడ్ల సమస్యలకు వైట్ టాపింగ్, సీసీలతోనే శాశ్వత పరిష్కారమైనప్పటికీ, వ్యయం, ఇతరత్రా కొన్ని ఇబ్బందుల వల్ల చేపట్టలేదని చెబుతూ, మున్ముందు ప్రయత్నిస్తామన్నారు. రహదారులు బాగుండేందుకు నగరాన్ని కొన్ని భాగాలుగా విభజించి రోడ్ల పనులు చేసే కాంట్రాక్టర్లకే వార్షిక నిర్వహణ కూడా అప్పగించే ఆలోచన చేస్తున్నామన్నారు. 15 రోజుల్లో రోడ్ల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాల సమస్యకు పరిష్కార మార్గాలు చేపడతామన్నారు.