సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మహేందర్‌రెడ్డి. చిత్రంలో కలెక్టర్ రఘునందన్‌రావు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘రైతుబంధు’ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందజేస్తామని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారి పట్టాదార్ పుస్తకాలు, రైతులకు ఆర్థిక చేయూతనందిస్తున్న రాష్ట్రం మనదేనని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘రైతుబంధు’ పథకంపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్నివర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతానికి వివాదరహిత భూములకు చెక్కులను పంపిణీ చేస్తున్నప్పటికీ, మిగతా వాటికి దశలవారీగా సాయం అందజేస్తామన్నారు. వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూముల విషయంలో ప్రభుత్వంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, యాదయ్య, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పెంటారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కోఅర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ హరీశ్, వివిధ మండలాల రైతు సమన్వయ సమితి సమన్వయకర్తలు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
రైతు రావాలి.. ఆధార్ చూపాలి...కలెక్టర్ రఘునందన్‌రావు..
వ్యక్తిగతంగా రైతు వస్తేనే చెక్కు అందజేస్తాం. ఆధార్‌ను తప్పనిసరిగా చూపాలి. చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీకి ప్రత్యేక బృందాలను నియమించాలి. రెవెన్యూ గ్రామం యూనిట్‌గా చెక్కులు పంపిణీ చేస్తాం. ప్రతి మండలానికి నోడల్ బ్యాంకును గుర్తించాం. 10వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య ఉదయం 7 నుంచి 11 గంటలవరకు, సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు చెక్కులను నిర్దేశిత ప్రదేశంలో అందజేస్తాం. చెక్కుల జారీ, తేదీ, స్థలం తదితర వివరాలతో కూడిన స్లిప్పులను రెండు రోజలు ముందటే ఆయా గ్రామాల్లో రైతులకు పంపిణీ చేస్తాం.
వక్ఫ్, దేవాదాయ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూదాన్ బోర్డు అసైన్డ్ చేస్తే ఆ రైతులకు మాత్రం పెట్టుబడి సాయం దక్కుతుంది. పట్టాదార్లకు కాకుండా ఇతరులకు చెక్కుల పంపిణీ జరగదు. ఆధార్ వివరాలు ఇవ్వని 22 వేల మందికి చెక్కులు ఇవ్వడంలేదు. జిల్లావ్యాప్తంగా 93శాతం రికార్డుల ప్రక్షాళన జరిగింది. మిగతా 7 శాతంలో వివాదాస్పద, కోర్టు కేసులు ఇతరత్రా భూ వివాదాలున్నవి ఉన్నాయి. రైతు బంధు పథకం కింద రూ.283.05 కోట్ల సాయం అందజేస్తున్నాం. బ్యాంకుల్లో నగదును సమృద్ధిగా ఉంచుకోవాలని ఆదేశించాం. నగదు మార్పిడిలో ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంకులకు పోలీస్‌బందోబస్తును ఏర్పాటు చేస్తాం.
చెక్కులివ్వకపోతే చిక్కులే..
1965లో భూదాన్ యజ్ఞబోర్డు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ భూములను ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులకు పెట్టుబడి సాయం అందించలేమనడం సరికాదు. కబ్జాలో ఉన్న ప్రతి రైతుకూ సాయం చేయాల్సిందే. అలా చేయకపోతే పథకం ఉద్ధేశం పక్కదారి పట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. 93శాతం మందికి చెక్కులు పంపిణీ చేసి.. మిగతావారిని విస్మరించడాన్ని కొందరు అనుకూలంగా మలుచుకునే వీలు లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment