
రెండో చాన్స్.. ఎవరికో...?
- మలివిడత విస్తరణలో జిల్లాకు అవకాశం దక్కేనా
- ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు
- తెరపైకి ఏనుగు, గంప, బాజిరెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా 11 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. జిల్లా నుంచి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు ప్రయత్నం చేసినా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కడికే వ్యవసాయశాఖ మంత్రిగా చాన్స్ లభించింది. మంత్రివర్గ విస్తరణ జరగనుందన్న ప్రకటన వెలువడటంతో జిల్లా నుంచి ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
సామాజిక వర్గం పరిగణనలోకి..
రెండోదఫా విస్తరణలో ఇతర జిల్లాల నాయకుల ప్రాధాన్యత, సామాజిక వర్గం, సీనియారిటీ తదితర కోణాల్లో పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జిల్లాలో సీనియర్ రాజకీయవేత్త, ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రిగా అవకాశం దక్కింది. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ ఎస్‌లో కొనసాగు తూ నాలుగు పర్యాయాలు గెలుపొందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి అవకాశం లేకుండా పోయింది.
కామారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్‌సింధేలతో పాటు ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రయత్నం చేసినా.. మొదటి విడతలో చాన్స్ దక్కలేదు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు మన జిల్లాకు మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారంతో మరోసారి ఆశావహులు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావుతో పాటు శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి దక్కితే.. ఇక్కడ ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చాన్స్ ఉంటుందంటున్నారు. లేదంటే జూపల్లితో పాటు లక్ష్మారెడ్డికి ఇస్తే.. జిల్లాలో గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్‌లలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇందూరుకు ఇద్దరు మంత్రులు
ఎంపీటీసీలు మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు.. జడ్పీటీసీల నుంచి జడ్పీ చైర్మన్ వరకు... నిజామాబాద్ నగర మేయర్, రెండు మున్సిపాలిటీలో విజయభేరీ మోగించిన ఇందూరు జిల్లాకు రెండు మంత్రి పదవులు ఖాయమన్న ఆశాభావాన్ని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మంత్రి వర్గంలోకి తీసుకునే వారిలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌ల పేర్లను ప్రకటించినప్పటికీ పోచారానికి మొదటి విడతలోనే అవకాశం కల్పించారు. ఆ తర్వాత మళ్లీ విస్తరణ జరిగితే రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలను అందించిన జిల్లాకు రెండు మంత్రి పదవులు, స్పీకర్ పదవులు దక్కుతాయన్న ప్రచారం జరిగింది. అయితే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరికే మంత్రి పదవి దక్కగా, రెండో మంత్రి, విప్‌లపై సస్పెన్స్ నెలకొంది.