
సాక్షి, నాగర్‌కర్నూల్ : త్వరలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్షేత్రస్థాయి పరిశీలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా శరవేగంగా ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం పూర్తితో కేసీఆర్‌పై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందన్నారు. రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశమన్నారు. అడవిలో ఉండడంతో నార్లాపూర్ పంపు హౌస్ పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీరందించడం కేసీఆర్ లక్ష్యమని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా మొత్తం సస్యశ్యామలమవుతుందని భరోసా వ్యక్తం చేశారు.