పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ వద్ద జరుగుతున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల సొరంగం పనులు
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మొదటి ప్యాకేజీ పనుల్లో భాగంగా కొనసాగుతున్న అండర్ టన్నెల్(సొరంగం) పనుల్లో వినియోగిస్తున్న బ్లాస్టింగ్ వల్ల కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌కు ప్రకంపనలు వస్తున్నాయని లిఫ్ట్‌ను నిర్వహిస్తున్న పటేల్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఏడాది క్రితమే ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. సొరంగం పనుల్లో కంట్రోల్ బ్లాస్టింగ్ కాకుండా ఎక్కువ సామర్థ్యంతో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ శబ్దానికి సమీపంలో ఉన్న కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్ వద్ద భూమి కంపించి ఇప్పటికే లిఫ్ట్ వద్ద అద్దాలు పగిలిపోవడంతో పాటు, భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తవచ్చనే ఉద్దేశంతో కేఎల్‌ఐ అధికారులకు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం వారు పరిశీలించారు. బెంగళూరుకు చెందిన ఎన్‌ఐఆర్‌ఎం ప్రతినిధులతో బ్లాస్టింగ్ తీవ్రతను పరీక్షించారు. అయితే బ్లాస్టింగ్ తీవ్రత కేఎల్‌ఐ లిఫ్ట్ వద్ద పెద్దగా ప్రభావం చూపడం లేదని అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే అక్కడ పనిచేస్తున్న వారు మాత్రం బ్లాస్టింగ్ వల్ల లిఫ్ట్‌కు ప్రమాదం పొంచి ఉందని, బ్లాస్టింగ్ తీవ్రత తగ్గించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి నివేదించిన అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.
కేఎల్‌ఐ లిఫ్ట్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు..
పాలమూరు–రంగారెడ్డి సొరంగం పనుల్లో ఎక్కువ సామర్థ్యంతో కూడిన కెమికల్‌ను వినియోగిస్తూ బ్లాస్టింగ్ చేయడం వల్ల భూగర్భంలో ఉన్న కేఎల్‌ఐ లిఫ్ట్‌కు ప్రకంపనలు వస్తున్నాయని, దానివల్ల లీకేజీలు, స్లాబ్‌క్రాక్‌లు, అద్దాలు పగిపోవడం వంటివి జరుగుతున్నాయని లిఫ్ట్ నిర్వాహకులు ఏడాది క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ అదే పరిస్థితి తలెత్తడంతో మూడు నెలల క్రితం కేఎల్‌ఐ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం పాలమూరు–రంగారెడ్డి సీఈ రమేష్, ఈఈ విజయ్‌కుమార్, ఎస్‌ఈ అంజయ్య, ఈఈలు, డీఈలు, ఏఈలు కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌ను పరిశీలించారు. బెంగళూర్ నుంచి ఎన్‌ఐఆర్‌ఎంకు ప్రతినిధులను పిలించి పాలమూరు–రంగారెడ్డి టెన్నెల్ పనుల్లో బ్లాస్టింగ్ చేయించి ప్రత్యేక పరికరం ద్వారా కేఎల్‌ఐ లిఫ్ట్‌లో వచ్చే తీవ్రతను పరీక్షించారు. అయితే పెద్దగా ప్రభావం చూపడం లేదని తేల్చినట్లు సమాచారం. స్వల్పంగా ప్రకంపనలు కనిపిస్తున్నాయని తేల్చినట్లు తెలిసింది.
ఈ విషయం సీఈ రమేష్‌ను వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా చెప్పేందుకు ఇష్టపడలేదు. జనరల్ విజిట్ వెల్లడించారు. బ్లాస్టింగ్ వల్ల కేఎల్‌ఐ లిఫ్ట్‌కు పెద్దగా ఇబ్బంది ఉండదంటూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అధికారులు, కేఎల్‌ఐ అధికారులు వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ–1 పనుల్లో భాగంగా కొనసాగుతున్న సొరంగం పనులు 1,300 మీటర్లు కొనసాగించాల్సి ఉంటుంది. కంట్రోల్ బ్లాస్టింగ్ వినియోగిస్తేనే చుట్టుపక్కల పెద్దగా ఇబ్బంది ఉండదు. కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌లో ఐదు పంపులు ఉన్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని మొదటి ప్యాకేజీ పనులు చేస్తున్న కంపెనీ వారికి కంట్రోల్ బ్లాస్టింగ్ వినియోగించే విధంగా ఆదేశించాలని అక్కడి వారు అభిప్రాయ పడుతున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షించి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.
2005లో రూపకల్పన
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 25 టీఎంసీల మిగులు జలాలను తీసుకునే ప్రతిపాదనలతో 2005లో కేఎల్‌ఐ ప్రాజెక్టును రూ.2,990 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును మూడు లిఫ్ట్‌లుగా విభజించారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద మొదటి లిఫ్ట్, పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ వద్ద రెండో లిఫ్ట్, నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి వద్ద మూడో లిఫ్ట్‌ను నిర్మించారు. మొదటి లిఫ్ట్ నుంచి 13వేల ఎకరాలకు, రెండో లిఫ్ట్ నుంచి 47 వేల ఎకరాలకు, మూడో లిఫ్ట్ నుంచి 2.80 లక్షల ఎకరాలకు కలిపి మొత్తం 3.40 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కేఎల్‌ఐ కాల్వల సామర్థ్యం పెంచుకోవడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న కాల్వల నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేస్తేనే కేఎల్‌ఐ ద్వారా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment