సాక్షి, హైదరాబాద్: ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు(కేటీఆర్) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం అమీర్ పేట్‌లో జరిగిన ‘అన్నపూర్ణ’ పథకం ఆరేళ్ల వేడుకలో మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కార్పోరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దివ్వాంగుల సౌలభ్యం కొరకు ‘మొబైల్ అన్నపూర్ణ పథకం’ ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇతర మెట్రో నగరాలకంటే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అన్నపూర్ణ ఆహార పథకం ద్వారా ఆరేళ్లలో 150 ప్రాంతాల్లో 4 కోట్లమందికి ఆహారాన్ని అందించామన్నారు. అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ అన్నపూర్ణ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. కాగా అధికారులు నూతన విధానంతో ఆలోచించాలని, మరిన్ని వినూత్న పథకాలు తీసుకురావాలన్నారు. ఇక అన్నపూర్ణ భోజనం లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తరించాలని మంత్రి వ్యాఖ్యానించారు.
మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ... నగరవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనలతో 150 కేంద్రాలను పెంచామన్నారు. ఎన్నో రాష్ట్రాలు అన్నపూర్ణ పథకంను అమలు చేస్తున్నాయని, అయితే కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయలేక చేతులెత్తేశాయన్నారు. తెలంగాణ జీహెచ్‌ఎంసీ మాత్రం ఈ పథకాన్ని విజయవంతగా అమలు చేస్తోందని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దూరదృష్టి కారణంగానే ఈ విజయం సాథ్యమైందని పేర్కొన్నారు.
సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ... 6 ఏళ్ల క్రితం ఒక సెంటర్‌లో ప్రారంభించిన ఈ పథకం.. ఇప్పుడు 150 సెంటర్లకు పెరగడం అదృష్టమన్నారు. అనంతపురం జిల్లాలో తాను కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో పల్లెల్లో అన్నం అందించాలని పుట్టపర్తి సాయిబాబా తనకు చెప్పారని తెలిపారు. అలా ఆయన చెప్పడంతో తనలో కొత్త ఆలోచనలు వచ్చాయన్నారు. తాను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం వచ్చిందన్నారు. ఆయన స్పూర్తితోనే అన్నపూర్ణ పథకాన్ని అమలు చేశానన్నారు. కాగా నోట్ల రద్దు సమయంలో సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు సెంటర్లను పెంచమని ఆదేశించిడంతో 150 సెంటర్లలో ఈ పథకాన్ని అమలు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment