
సాక్షి, హైదరాబాద్: నగరానికి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ఆర్టీసీ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరీంనగర్ వెళ్లేందుకు తాను ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. అక్కడ బస్సు అందుబాటులో లేకపోవడం.. వాకబు చేసేందుకు కనీసం సిబ్బంది కూడా లేకపోవడంతో షాక్ తిన్నారు. దీంతో వెంటనే ఆయన రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఎస్సెమ్మెస్స్ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఆయన వెంటనే స్పందించి.. సదరు ప్రయాణికుడికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా.. ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
కరీంనగర్‌కు చెందిన శంకరయ్య, ఆయన కుమారుడు అరవింద్ ఆదివారం ఉదయం అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులో కరీంనగర్ వెళ్లేందుకు ముందుగానే వారు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారు. బస్సు ఉదయం 10.30 గంటలకు రావాల్సి ఉండగా.. ఎంత వేచి చూసినా అది రాలేదు. దీంతో వాకబు చేసేందుకు ఆర్టీసీ కౌంటర్ వద్దకు వెళ్లగా.. అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడం వారికి విస్మయం కలిగించింది. దీంతో వెంటనే ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఎస్సెమ్మెస్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులను ఆరాతీసి.. బస్సును ఏర్పాటుచేశారు. అంతేకాకుండా ఆర్టీసీ సిబ్బంది అలసత్వంపై విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment