*జనవరిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక
*స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అప్పుడే!
*ప్రయత్నాల్లో రాజకీయ పార్టీల నేతలు
*టీఆర్‌ఎస్‌లో ఆశావహులు అధికం
* బీజేపీలో 'కపిలవాయి' తంటా
సాక్షి ప్రతినిధి, వరంగల్ : శాసన మండలి ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గ్రాడ్యుయేట్స్ ప్రస్తుత ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ పదవీకాలం 2015 మార్చి తో ముగియనుంది. జనవరిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. రాజకీయ పార్టీల నేతలు పోటీ కోసం సన్నద్ధమవుతున్నారు.
సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని నేతలు ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టిసారిం చారు. మిగిలిన పార్టీలతో పోల్చితే అధికార టీఆర్‌ఎస్‌లో ఆశావహుల సంఖ్య అధికంగా ఉండనుంది. శాసనసభ మళ్లీ ఏర్పాటైనప్పటి నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానంలో టీఆర్‌ఎస్ రెండు సార్లు గెలిచింది. రెండు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దిలీప్‌కుమార్ గెలుపొందారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ కావడంతో మూడు జిల్లాల్లోని టీఆర్‌ఎస్ నేతలు పోటీ పడుతున్నారు.
ఆశావహులు వీరే..!
వరంగల్ జిల్లా నుంచి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు టి.రవీందర్‌రావు, నాయకడు నాగుర్ల వెంకటేశ్వర్లు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ గ్రాడ్యుయే ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదవరెడ్డి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. సాధారణ ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చిన వారికి మళ్లీ అవకాశం ఉండే పరిస్థితి లేదని టీఆర్‌ఎస్ వర్గాల అంచనా. ఈ నిబంధన లేకుం టే.. పరకాలలో పోటీ చేసి ఓడిపోయి న ముద్దసాని సహోదర్‌రెడ్డి ప్రయత్నించే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు పెద్దగా ప్రభావం చూపిన సందర్భాలు లేవు.
నల్లగొండ, ఖమ్మం జిల్లా లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పోటీ చేసే అవకాశముందని హస్తం నేతలు చెబుతున్నారు. జిల్లా కు చెందిన కాంగ్రెస్ నేత బండా ప్రకాశ్ పేరు వినిపిస్తోంది. బీజేపీ తరఫున ఎడ్ల అశోక్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ప్రయత్ని స్తే మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న తమకు అన్యా యం జరుగుతుందని కమలనాథులు వాపోతున్నారు. వామపక్ష పార్టీలు బరిలో దిగితే పొరుగున ఉన్న ఖమ్మం, నల్లగొండ నేతలకే అభ్యర్థిత్వం దక్కనుంది.
'గ్రాడ్యుయేట్'తోపాటే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక!
స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడి ఎన్నిక కూడా జనవరిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సం స్థల ఎమ్మెల్సీ స్థానాల పునర్విభజన ప్రక్రియ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతోపాటే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్లుగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవీ రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉంది. శాసనమండలి ఆరంభమైన మొదట్లో జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గండ్ర వెంకటరమణారెడ్డి గెలి చారు. 2009లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికవడం తో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్లు జిల్లాలో 929 మంది ఉన్నాయి. వరంగల్ కార్పొరేషన్‌లోని 58 డివిజన్లు మినహాయిస్తే.. మిగిలిన 871 స్థానాలకు ప్రస్తుతం ప్రతినిధులు ఉన్నారు. బల్దియాను గ్రేటర్ వరంగల్‌గా మార్చే అంశం ప్రభుత్వ పెండింగ్‌లో ఉంది. వరంగల్ నగర పాలక సంస్థ ఎన్నికలు ఎప్పు డు నిర్వహిస్తారనే అంశంలో స్పష్టత రావడంలేదు. ప్రస్తు తం 53 డివిజన్‌లుగా ఉన్న కార్పొరేషన్ పరిధిని పునర్విభజనతో 58 డివిజన్లకు విస్తరిస్తూ మున్సిపల్ శాఖకు వరంగల్ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటికి ఇంకా ఆమోదం రాలేదు.
ఇక రెండు నెలలు సందడి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఓటర్లలో 70 శాతం మంది ఉంటే ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేకుంటే.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతోపాటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకేసారి జరిగితే పోటీ చేసే నాయకులు పెరుగుతారు. టీఆర్‌ఎస్‌కు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవకాశం దక్కని నేతలు స్థానిక సంస్థల కోటా కోసం ప్రయత్నించనున్నారు.
గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పని చేసిన టీఆర్‌ఎస్ నేత కొండా మురళీధర్‌రావు మళ్లీ పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, సీనియర్ నేత జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు బరిలో ఉండే అవకాశం తక్కువగానే ఉంది. రెండు ఎమ్మెల్సీల ఎన్నికలు కలిసి నిర్వహిస్తే రెండు నెలలపాటు రాజకీయ సందడి నెలకొంటుంది.
శాసనమండలి రేసులో ప్రముఖులు
Published Tue, Nov 4 2014 1:02 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement