అభివృద్ధికి ఆస్కారం
► ఫలించిన ప్రజాప్రతినిధుల డిమాండ్
► ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా నిధులు రూ.1.5కోట్ల నుంచి రూ.3కోట్లకు పెంపు
► గ్రామ సమస్యల పరిష్కారానికి మరింత వెసులుబాటు
► ఈ ఆర్థిక సంవత్సరంనుంచే అమలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నియోజకవర్గాల అభివృద్ధి నిధులు పెంచాలని కొంతకాలంగా పార్టీలరహితంగా ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్ ఫలించడంతో మరికొన్ని సమస్యలకు పరిష్కారం లభించనుంది. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటాలో అభివృద్ధి నిధులను రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో జిల్లాలో ఉన్న 14మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీ కోటా నిధులు రెట్టింపు కానున్నాయి. ఇదివరకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు గ్రామాల కనీస అవసరాలు తీర్చడానికి సరిపోయే పరిస్థితి లేదు. గ్రామాల్లో ప్రజలు చెప్పే ప్రధాన సమస్యను పరిష్కరించాలనుకున్నా.. ప్రజాప్రతినిధులకు ప్రత్యేక నిధులు పెద్ద మొత్తంలో లేకపోవడంతో సమస్యలను ప్రభుత్వానికి నివేదించి నిధులు కేటాయింపు కోసం అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంది. సీఎం ప్రకటనతో అభివృద్ధి నిధులపై జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.
నిధులున్నా.. ఖర్చుచేయని ఎమ్మెల్యేలు
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధులను కొందరు ఖర్చు చేయడంలో శ్రద్ధ చూపడం లేదు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తిచేసేలా పర్యవేక్షించాల్సిన ఎమ్మెల్యేల్లో కొందరు ఏడాది గడిచినా పూర్తిగా తమ నిధులను ఖర్చుచేయకపోవడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
తాగునీటికే ఎక్కువ కేటాయింపులు
ఇప్పటికే పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తమ అభివృద్ధి నిధులను అత్యధికంగా జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికే వెచ్చిస్తున్నారు. కొత్తగా విడుదల కానున్న నిధులను సైతం అత్యధికంగా తాగునీటి ఎద్దడి తీర్చేందుకు ఖర్చు చేయనున్నారు. అలాగే రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులపై కూడా దృష్టి సారించారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు లేకపోవడం, జిల్లా పరిషత్ నుంచి సైతం వివిధ పథకాల ద్వారా నిధులొచ్చే అవకాశం పూర్తిగా తగ్గిపోవడంతో గ్రామాల్లో ఏ అభివృద్ధి పనిచేయాలన్నా ప్రభుత్వంనుంచి నిధుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల అభివృద్ధి నిధులు వస్తే గ్రామస్థాయిలో తాగునీటి, శానిటేషన్ వంటి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభించింది.
మూడు, నాలుగు విడతలుగా విడుదల
ఏడాదికి జిల్లాలో 14మంది ఎమ్మెల్యేలకు రూ.3కోట్ల చొప్పున రూ.42కోట్లు, నలుగురు ఎమ్మెల్సీలకు కలిపి రూ.12కోట్ల నిధులు మంజూరు కానున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి, ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్సీలు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆ సభ్యులు ఈ మూడు జిల్లాల్లో ఎక్కడైనా తమ అభివృద్ధి నిధులను వినియోగించుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తమ అభివృద్ధి నిధులను జిల్లాలో ఎక్కడ అవసరం ఉన్నా వినియోగించుకొనే అవకాశం ఉంది.
ఈ అభివృద్ధి నిధులను ప్రభుత్వం ఏడాదిలో మూడు లేదా నాలుగు విడతలుగా విడుదల చేయనుంది. ప్రజాప్రతినిధులు తమ అభివృద్ధి నిధుల ద్వారా తాము గుర్తించిన పనులను పూర్తిచేయాలని జిల్లా ప్రణాళిక అధికారి, కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. వాటికి అయ్యే ఖర్చును సంబంధిత అధికారులు నిర్ధారించి ఆయా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభివృద్ధి నిధుల నుంచి వినియోగించి, పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.