ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత | MLA ravindarreddi to against conference | Sakshi
Sakshi News home page

ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత

Published Fri, Jul 31 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత

ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత

- ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డికి వ్యతిరేకంగా సదస్సు
- దళితుల భూములు ఆక్రమించుకున్నారని ఆరోపణ
- అఖిలపక్ష నేతలను అరెస్టు చేసిన పోలీసులు
- అన్ని దారులనూ మూసేసి ముమ్మర తనిఖీలు
- పోలీసుల వలయాన్ని  ఛేదించుకుని వచ్చిన వివిధ పార్టీల నేతలు
ఎల్లారెడ్డి:
దళితుల భూములనూ, ప్రభుత్వ భూములనూ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి ఆక్రమించుకున్నారని ఆరోపి స్తూ అఖిలపక్షాలు గురువారం ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేయ తలపెట్టిన సదస్సు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిం ది. నాయకుల అరెస్టుతో అర్ధంతరంగా రద్దయ్యింది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చే దారులన్నిటిని పోలీసులు దిగ్బంధించినా మారుమూల గ్రామాల గుండా ఎల్లారెడ్డి పట్టణానికి చేరుకున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అఖిలపక్ష నేతలను అరెస్ట్ చేసి తరలించే క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు ఎల్లారెడ్డిని అష్ట దిగ్బంధనం చేశారు.
 
అసలేం జరిగింది
ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి స్వగ్రామం ఎర్రాపహాడ్‌లో దళితుల భూములను ఆక్రమించారంటూ ఎంఆర్‌పీఎస్, వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం ఎల్లారెడ్డిలోని బాలా గౌడ్ ఫంక్షన్‌హాల్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణంతో పోలీసులు ఈ సమావేశానికి అనుమతి నిరాకరించారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడం, దివంగత రాష్ర్తపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరుగుతున్న దృ ష్ట్యా అఖిలపక్ష సమావేశాన్ని రద్దు చేసి ముఖ్యనాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయూలని నేతలు భావించారు. ఈ సమావేశానికి వస్తున్న నేతలను కూడా పోలీసులు నిరోధించారు. కామారెడ్డి వైపు నుంచి వస్తున్న నేతలను అరెస్ట్ చేసి భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎల్లారెడ్డి వైపు వస్తున్న ఆర్‌టీసీ బస్సు లు, వాహనాలను తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు గట్టి నిఘా ఉంచడంతో గాంధారి మండలంలోని మారుమూల దారుల గుండా సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి దండు వెంకట్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి గైనికాడి విజయలక్ష్మి, సామాజిక కార్యకర్త బంగారుసాయిలు, జిల్లా అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నారాయణ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుభాష్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌చార్జి నల్లమడుగు సురేందర్ తదితరులు ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, పా లాభిషేకం చేస్తున్న నేతలను సీఐ రామకృష్ణ నేతృత్వంలో అరెస్ట్ చేసి ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
 
భూములు తిరిగి ఇచ్చేదాకా పోరాటం
పోలీసుస్టేషన్‌లోనే అఖిలపక్ష నేతలు విలేకరులతో మాట్లాడారు. రవీందర్‌రెడ్డి దౌర్జన్యపాలన జరుపుతున్నారని, అధికారం ఉంది కదా అని తన ఫాంహౌజ్ నిర్మాణం కోసం దళితుల భూములను, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. అఖిలపక్ష సమావేశానికి పోలీసుల ద్వారా అనుమతి రాకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. దళితుల భూములు తిరిగి వారికి అప్పగించేవరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే భూములను ఆక్రమించకుంటే, అందుకు తగిన సాక్ష్యాధారాలు అందజేయాలని కోరారు. నియోజకవర్గంలో ఏ సమ స్యను గురించి అడిగినా, వారిని అక్రమంగా అరెస్ట్ చేయిస్తున్నారని, ఎమెర్జెన్సీ కాలం కంటే ఘోరంగాపరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

తెలంగాణ పేరు మీద మూ డు మార్లు గెలిచిన రవీందర్‌రెడ్డి అభివృద్ధి మరిచి సొంత ఆస్తులు కూడ బెట్టుకోవడానికి అధికారాన్ని వాడు కుంటున్నారని అన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఎన్ని ఆస్తులు ఉండేవో, ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎక్కడివో సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్‌పీఎస్ సీనియర్ నాయకుడు సిద్ధిరాములు, స్టూడెం ట్స్ జేఏసీ రాష్ర్త అధ్యక్షుడు సర్దార్‌సింగ్, ఎంఆర్‌పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బాలరాజు, మాలమహానాడు బాన్స్‌వాడ ఇన్‌చార్జి సంగయ్య, సీపీఎంఎల్ కామారెడ్డి నియో జకవర్గ ఇన్‌చార్జి కట్ల భూమన్న, సీఐటీయూ నాయకురాలు నూర్జహాన్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బిట్ల సురేందర్, మండల ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు పద్మారావు, మండల టీడీపీ అధ్యక్షుడు నాగం పరంధాములు తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి పూచీకత్తుపై విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement