హలో ఎమ్మెల్యే గారు..
24 గంటలు ప్రజలకు అందుబాటులో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
నేడు సిద్దుల గుట్టపై కార్యక్రమం ప్రారంభం
ఆర్మూర్ : నమస్తే నేను మీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని.. మీ సేవకు నేను సిద్ధంగా ఉన్నాను.. మీ సమస్య ఏంటో చెప్పండి.. మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను.. అంటూ ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. సమస్యలు తెలుసుకొని సత్వరం పరిష్కరించడానికి 24 గంటలు, 365 రోజుల పాటు ఎమ్మెల్యే ఫోన్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తారు. మ్మెల్యే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసారు. ఈ టెక్నాలజీ ద్వారా 1860425252 నెంబర్‌లో ఎమ్మెల్యేకు సమాచారం చేరవేయవచ్చును. బాధితులు ఈ సెల్ ఫోన్ లేదా ల్యాండ్ ఫోన్‌తో సూచించిన నెంబర్‌కు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గొంతు వినిపిస్తుంది.
బీప్ అనంతరం రెండున్నర నిముషాల పాటు బాధితులు తమ సమస్యను చెప్పుకోవచ్చును. బాధితులు చెప్పే సమస్య రికార్డు అవుతుంది. తర్వాత తిరిగి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కాల్ చేసినందుకు ధన్యవాదాలు.. నేను గాని మా సిబ్బంది గాని సమస్య పరిష్కారానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తాము.. అంటూ కాల్ ముగుస్తుంది. ఈ రికార్డును ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది పరిశీలించి సమస్య తీవ్రతను బట్టి వెంటనే స్పందిస్తారు. వైద్య సేవలు, తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలైతే సంబంధిత సిబ్బంది సమస్యకు సంబంధించిన అధికారితో వెంటనే ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. బాధితులు చెప్పిన సమస్యలన్ని నేరుగా ఎమ్మెల్యేకు అందుబాటులో ఉండే లాప్‌టాప్‌కు చేరుతాయి. ఎమ్మెల్యే స్వయంగా పరిష్కరించాల్సిన సమస్య ఉంటే తన కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్యే తగు చర్యలు తీసుకుంటారు.
నేడు సిద్దుల గుట్టపై ప్రారంభం..
ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఫోన్ ద్వారా 24 గంటలు అందుబాటులో ఉండటానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్టపై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా ఈ మీ సేవలో మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.