మునగాల : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆగస్టులో నిర్వహించే నిరుద్యోగుల పోరాటాలకు తెలంగాణ ఎమ్మెల్యేలు మద్దతు పలికి భాగస్వాములు కావాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ పిలుపునిచ్చారు. మునగాలలో మూడు రోజుల పాటు కొనసాగుతున్న డీవైఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులలో భాగంగా బుధవారం స్థానిక అండర్ పాస్ బ్రిడ్జి వద్ద నిర్వహించిన నిరుద్యోగ సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత పోరాట త్యాగాల ఫలితంగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేసి ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రంలో నిరుద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆగస్టు నెలంతా తెలంగాణ నిరుద్యోగలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ‘ఉద్యోగాలిచ్చుడో- కేసిఆర్‌ను గద్దెదించుడో’ అనే నినాదంతో ఉద్యమించనున్నట్లు భాస్కర్ తెలిపారు. మునగాల మండలంలో డీవైఎఫ్‌ఐ డివిజన్ నాయకుడైన బొంత శ్రీనివాసరెడ్డి, జూలకంటి ఉపేందర్‌రెడ్డిలను హత్యచేసిన రౌడీలతో చేతులు కలిపి ఈ ప్రాంత ప్రజాతంత్ర ఉద్యమాలను, త్యాగాలను అవహేళన చేసే విధంగా వ్యవహరిస్తూ వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. డీవైఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్షుడు జె.నర్సింహారావు అధ్యక్షత వ హించిన ఈ సదస్సుకు డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.విప్లవకుమార్, రైతుసంఘం జిల్లా నాయకులు బి.శ్రీరాములు, బెల్లంకొండ సత్యనారాయణ, సీపీఎం పార్టీ నాయకులు ఆరె.రామకృష్ణారెడ్డి, దేవరం(లిఫ్ట్)వెంకటరెడ్డి, సొంపంగు జానయ్య , చిర్రా శ్రీనివాస్, స్వరాజ్యం, సుందరం తదితరులు పాల్గొన్నారు.
'నిరుద్యోగ పోరాటాలకు మద్దతివ్వాలి'
Published Thu, Jul 23 2015 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM
Advertisement
Advertisement