సాక్షి, హుజురాబాద్ : రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల పంపిణీలో నిర్దిష్టమైన కార్యచరణ చేపట్టకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. హుజురాబాద్‌లో ఎరువుల కొరకు సొసైటీల ముందు బారులు తీరిన రైతులకు మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టిన రైతులు వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రుణమాఫీపై ఇప్పటివరకు బ్యాంకర్లతో ఎలాంటి సమావేశాలు నిర్వహించకపోవడం పట్ల రైతులపై ప్రభుత్వానికున్న చిత్తశుద్దిని తెలియజేస్తుందని మండిపడ్డారు.
రైతులకు సహకారం అందించడం కోసం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితిలు ఎక్కడా కనబడడం లేదని ఎద్దేవా చేశారు. రైతులెవరు ఆగ్రహానికి గురి కావొద్దని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 10వేల మెట్రిక్ టన్నుల యూరియాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్సీ ద్వారా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సాగునీరు అందించలేకపోతుందని , కనీసం 70 టీఎంసీల మేర నీరు అవసరం ఉందని గుర్తు చేశారు. కాళేశ్వరం పంపులు ఎందుకు ఆపరేట్ చేయడం లేదో చెప్పాలని, ప్రాజెక్టులో తగినంత నీరున్నా ఇప్పటివరకు చుక్కనీరు తరలించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment