కాంగ్రెస్‌ను చూసి సిగ్గే సిగ్గు పడుతోంది
కాంగ్రెస్‌ను చూసి సిగ్గే సిగ్గు పడుతోంది
Published Tue, May 30 2017 5:35 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
హైదరాబాద్: రాహుల్ గాంధీ సభలో తమ పాలనపై కాంగ్రెస్ చార్జీషీట్ పెడుతామంటే సిగ్గే సిగ్గు పడుతోందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్ షా టూర్ తో బీజేపీ నేతలు అభాసు పాలయినట్టే కాంగ్రెస్ కూడా రాహుల్ టూర్ తర్వాత అభాసు పాలు కాక తప్పదన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన అక్రమాలను తెలంగాణ ప్రజలు మరిచి పోలేదన్నారు. రాహుల్ కు అబద్దాలు చెప్పి అభాసు పాలుకావద్దని కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ పాలనలో మహబూబ్‌నగర్ నుంచి వలసలు ఉండేవి, ఇపుడు వలసలు ఆగినందుకు మా మీద ఛార్జ్ షీట్ వేస్తారా ? అని నిలదీశారు.
రైతులకు 17 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసినందుకు మా మీద ఛార్జి షీట్ వేస్తారా అని ప్రశ్నించారు. ఎర్ర జొన్న రైతులపై కాంగ్రెస్ హయాంలో జరిగిన దాష్టీకాన్ని తెలంగాణ మరిచి పోలేదని అన్నారు. తెలంగాణ యావత్తు కేసీఆర్ వెంట ఉందని చెప్పారు. టీడీపీ తో పొత్తు గురించి మాట్లాడిన జైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నందుకు ఆ పార్టీ నేతలు సిగ్గు పడాలన్నారు. తాము పూర్తి సర్వే వివరాలు వెల్లడిస్తే కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ కాక తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ టికెట్ లు అడిగేందుకు గాంధీ భవన్ వచ్చే వారే ఉండరని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంపై ఏవేవో మాట్లాడుతున్నారు.. సర్వే అబద్ధమని అని నమ్మితే హుజుర్ నగర్ నుంచి రాజీనామా చేయండని సవాల్ విసిరారు. ఉత్తమ్ రాజీనామా చేస్తే ఆయన మీద సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపించుకుంటామని వ్యాఖ్యానించారు.
Advertisement