అందమైన పార్కులు, పార్కింగ్ స్థలాల అభివృద్ధి
ప్రభుత్వ భూములను గుర్తించి సుందరీకరణ
మూసీ ప్రక్షాళనకు సమగ్ర ప్రణాళిక
ఇందిరా పార్క్ వద్ద అంతర్జాతీయస్థాయి కన్వెన్షన్ సెంటర్
‘తెలంగాణ కళా భారతి’ పేరుతో భారీ నిర్మాణం
రాజధానిలోని చారిత్రక నిర్మాణాలకు కొత్త హంగులు
ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్‌తో భేటీలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘మూసీకి ఇరువైపులా అద్భుతమైన పార్కులు, పార్కింగ్ స్థలాలు నిర్మించాలి. హైదరాబాద్‌లో చాదర్‌ఘాట్ నుంచి బాపూఘాట్ వరకు సర్వే చేసి ప్రభుత్వ భూములెన్ని ఉన్నాయో గుర్తించాలి. ఆ తర్వాతే మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు అనువైన ప్రణాళికలు రూపొందించాలి’ అని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్‌తో గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాజధానిలో కొత్త కట్టడాల నిర్మాణంపై చర్చించారు. మూసీ నది చుట్టూ కొత్త నిర్మాణాల ప్రతిపాదనలను హఫీజ్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భౌగోళిక, వాతావరణ, సామాజిక పరిస్థితులపరంగా హైదరాబాద్ ఎంతో ప్రత్యేకమైందని, ఈ ప్రత్యేకతలను, విలక్షణతలను ఓ అవకాశంగా మార్చుకోవాలని కోరారు. హైదరాబాద్ గత వైభవం గుర్తుకు వచ్చేలా నగరంలో కొత్త నిర్మాణాలు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నగరంలో కొత్తగా నిర్మించే టవర్లు, బహుళ అంతస్తుల భవనాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడేలా ఉండాలన్నారు.
ఏ ప్రాంతంలో ఎలాంటి కట్టడం రావాలి, ఎంత విస్తీర్ణంలో నిర్మించాలి, వాటిని ఏ అవసరాలకు వినియోగించుకోవాలనేఅంశాలపై సమగ్ర అధ్యయనం జరిపి ప్రణాళికలు రూపొందించాలని హఫీజ్ కాంట్రాక్టర్‌ను కోరారు. చరిత్ర ఆనవాళ్లు చెరగకుండా, వాటిని మరింత ఆధునికంగా టర్కీ దేశ రాజధాని ఇస్తాంబుల్ నగరం స్ఫూర్తిగా హైదరాబాద్ కూడా అంతర్జాతీయ నగరంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచంలోని ప్రతి పౌరుడు తప్పకుండా సందర్శించాలనుకునే నగరాల జాబితాలో హైదరాబాద్ శాశ్వతంగా ఉండిపోవాలని అభిలషించారు. నగర ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా మల్టీ లేయర్ ఫ్లై ఓవర్ల నిర్మాణం జరగాల్సి అభిప్రాయపడ్డారు. గూగుల్ ఎర్త్ సహాయంతో నగరంలో కొత్త కట్టడాల కోసం అనువైన స్థలాలను ఈ సమావేశంలో గుర్తించారు. ఈ సందర్భంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలు ప్రతిపాదనలను చేశారు. ఇందిరా పార్కు ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో ‘తెలంగాణ కళా భారతి’ పేరుతో అంతర్జాతీయస్థాయి కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించాలని తెలిపారు. అక్కడే నాలుగు ఆడిటోరియాలు, విశాలమైన పార్కింగ్ స్థలం వచ్చే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించాలని సూచించారు. హైదరాబాద్‌లోని పలు ముఖ్యమైన ప్రాంతాల చారిత్రక నేపథ్యం, సామాజిక పరిస్థితుల ఆధారంగా కొత్త నిర్మాణాలు వైవిధ్యంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే, యాదగిరిగుట్ట, జహంగీర్ దర్గాలను సైతం తీర్చి దిద్దాల్సిన అవసరముందన్నారు. మొజంజాహీ మార్కెట్, చార్మినార్, హుస్సేన్‌సాగర్ జలాశయం, ప్రఖ్యాత సాలార్‌జంగ్ మ్యూజియం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న కీలక నిర్మాణాలకు మరింత వన్నె తెచ్చే విధంగా అక్కడి ఆవరణలను తీర్చిదిద్దాలని హఫీజ్‌ను కోరారు.
సాధారణ సిమెంట్ కట్టడం హైటెక్ సిటీ: కేసీఆర్
చార్మినార్, గోల్కొండ, ఫలక్‌నుమా, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీదు, సాలార్‌జంగ్ మ్యూజియం, అసెంబ్లీ, హైకోర్టు లాంటి కట్టడాలను అద్భుత నిర్మాణ కౌశలంతో తిర్చిదిద్ది హైదరాబాద్‌కు నిజాం రాజులు ప్రపంచ ఖ్యాతిని తెచ్చి పెట్టారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తర్వాత వచ్చిన పాలకులు ఆ వారసత్వాన్ని కొనసాగించడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి లేకపోవడం వల్ల నగరాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా చూశారన్నారు. చార్మినార్ లాంటి కట్టడాన్ని మరిపించి, హైటెక్ సిటీ పేరుతో నిర్మించిన ఓ సాధారణ సిమెంటు కట్టడాన్ని హైదరాబాద్‌కు సింబల్‌గా చూపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. నగర ప్రతిష్టను పెంచేలా నిజాం రాజుల అద్భుత కట్టడాలకు అనుబంధంగా మరిన్ని కట్టడాలను నిర్మించాల్సి ఉందని చెప్పారు.
అద్భుతంగా మూసీ తీరం
Published Fri, Dec 12 2014 12:57 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement