మూసీ.. జల రాకాసి | the river of musi water polluted | Sakshi
Sakshi News home page

మూసీ.. జల రాకాసి

Published Fri, Dec 12 2014 1:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మూసీ.. జల రాకాసి - Sakshi

మూసీ.. జల రాకాసి

పరీవాహక ప్రాంతంలో పరుచుకున్న పచ్చి విషం
 జలాల్లో ప్రమాదకర మూలకాల ఆనవాళ్లు
 పంటలు, పశుపక్ష్యాదులపై పెను ప్రభావం
 కుందేళ్లు, పావురాలలో కనిపించని పునరుత్పత్తి
 మనుషుల్లో అజీర్తి, కిడ్నీ, లివర్, కేన్సర్ సమస్యలు
 పరిశోధనల్లో విస్తుగొలిపే నిజాలు..
 పరిస్థితి ఇలాగే ఉంటే.. మరో పదేళ్లలో
 ‘నో మ్యాన్ జోన్’గా మారే ప్రమాదం
 
 శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి: రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల మీదుగా పారుతూ లక్షలాది మందికి అన్నం పెట్టి జీవనరేఖగా భాసిల్లిన మూసీ నది ఇప్పుడు ఆ ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. ఆ నదిలో ఇప్పుడు పారుతున్నది జలం కాదు.. అచ్చంగా గరళం! అత్యంత ప్రమాదకర రసాయనాలతో పూర్తిగా కలుషితమైన మూసీ ఇప్పుడు.. మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ‘మరో దశాబ్ద కాలం పాటు ఇదే పరిస్థితి కొనసాగితే.. ఈ ప్రాంతం నో మ్యాన్ జోన్‌గా మారిపోయే ప్రమాదం లేకపోలేదు’ అని కేంద్ర ప్రభుత్వ సంస్థలు సైతం హెచ్చరించాయి. మూసీ పరీవాహక ప్రాంతమంతా కలుషితమైపోయిందన్న వాస్తవాన్ని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన వృక్షశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ సి.వెంకటేశ్వర్ బృందం నిరూపించింది. ఈ బృందం మూడేళ్లపాటు చేసిన పరిశోధనల్లో అనేక చేదు నిజాలు వెలుగుచూశాయి. ‘సాక్షి’ సైతం మూసీ తీర ప్రాంత జలాలను, ఆ నీటితో పండిన కాయగూరలను ఓ ప్రముఖ ల్యాబొరేటరీకి పంపి పరీక్షలు నిర్వహించింది. మూసీ నీళ్లు, పంటలు పూర్తిగా విషతుల్యం అయ్యాయని ఈ పరీక్షల్లో తేలింది. ఈ నది తీర ప్రాంతంలోని  నీరు తాగి, ఒడ్డున పండే పండ్లు, కాయగూరల్ని తిన్న పశుపక్ష్యాదుల్లో పునరుత్పత్తి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనుషుల్లోనూ మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అజీర్తి, కాలేయం, కిడ్నీ సమస్యలతో పాటు రకరకాల కేన్సర్లకు మూసీ జలాలు కారణమవుతున్నాయి.
 
 ప్రమాదకర మూలకాలు ఎన్నో...
 ప్రస్తుతం మూసీలో ఎక్కడ ముట్టుకున్నా పచ్చి విషం ఆనవాళ్లే తేలుతున్నాయి. ఇటీవల జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.రాంమోహన్ బృందం కిస్మత్‌పూర్, చాదర్‌ఘాట్, ఫతుల్లాగూడ, చిన్నరావులపల్లి తదితర ప్రాంతాల్లో పరిశోధనలు నిర్వహించింది. మూసీ జలాల్లో ప్రమాదకరఅర్సెనిక్, క్రోమియం, కాపర్, నికెల్, లెడ్ వంటి మూలకాల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు ఇందులో తేలింది. జీడిమెట్ల, బాలానగర్ నుంచి వచ్చే రసాయనాలు హుస్సేన్‌సాగర్ మీదుగా గోల్నాక వద్ద మూసీలో కలుస్తున్నాయి. ఉప్పల్‌కు వచ్చేసరికి నీరు మరింత విషంగా మారిపోతోంది. మూసీ తీర ప్రాంతంలో  పంటల దిగుబడి తక్కువగా రావటం, వచ్చిన పంటల్లోనూ ప్రమాదకర భార లోహాలు ఉంటున్నాయి.
 
 పరిశోధనల్లో తేలిందేంటంటే...
 
 ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ సి.వెంకటేశ్వర్ బృందం మూసీ జలాలపై చేసిన పరిశోధనల్లో విస్తుగొలిపే అంశాలు వెలుగుచూశాయి. వర్సిటీ ఆవరణలోనే ఎకరం స్థలంలో ఏడాదిపాటు కుందేళ్లు, పావురాలు, చేపలతో ఈ ప్రయోగాన్ని చేశారు. వీటిని మూడు విభాగాలుగా విడగొట్టి ఒక జతకు మూసీ నీళ్లు, మరో జతకు బోరు నీళ్లు, మరో జతకు శుద్ధి చేసిన మూసీ నీరందించారు.
 
 చేపలూ బతకలేదు
 
 ప్రత్యేక కొలనులో రీసెర్చ్ స్కాలర్ శ్రీనివాస్ రవ్వ, బొచ్చె, బంగారు తీగ చేపలపై ఏడాదిపాటు ప్రయోగం నిర్వహించారు. అందులో మూసీనీటిలో వేసిన చేపలు రెండు నెలల అనంతరం చనిపోయాయి. కొన్ని మాత్రమే తక్కువ సైజులో ఏడాది పాటు బతకగలిగాయి. ఈ నీటి లో నాచు కూడా పెరగలేదు. అదే సాధారణ నీటి కొలనులో వేసిన చేపలు 90 శాతం పెరిగి పెద్దయ్యాయి. ఈ నీటిలో సాధారణంగా వచ్చే నాచు ఇతర కీటకాలు సైతం పెరిగి పెద్దయ్యాయి.
 
 ఇదీ మురుగు లెక్క...
 
 ప్రతిరోజూ మూసీలో కలుస్తున్న వ్యర్థ జలాలు.. 26.89 కోట్ల లీటర్లు
 నెలకు మూసీలో కలుస్తున్న వ్యర్థ జలాలు.. 806.7 కోట్ల లీటర్లు. అంటే ఏడాదికి 9,680.4 కోట్ల లీటర్లు!
 ఈ 9 వేల కోట్ల లీటర్ల వ్యర్థ జలాల్లో శుద్ధి చేస్తోంది వెయ్యి కోట్ల లీటర్లు మాత్రమే. మరో 8,680.4 కోట్ల లీటర్లు శుద్ధి చేయకుండానే మూసీలో కలుస్తున్నాయి. అంటే ఏడాదికి 8.6 టీఎంసీల మురుగు జలాలు మూసీలో కలుస్తున్నాయి. ఈ నీటిని శుద్ధి చేస్తే లక్ష ఎకరాల్లో పంటలు సాగు చేయొచ్చు.
 
 అరకొరగా శుద్ధి..
 
 అత్తాపూర్, అంబర్‌పేట, ఉప్పల్, నాగోలు, ఖైరతాబాద్, పటేల్‌నగర్, రంగధాంచెర్వు తదితర ప్రాంతాల్లో నిర్మించిన  సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్-ఎస్టీపీ (మురుగుశుద్ధి కేంద్రాలు) ద్వా రా మూసీ జలాలను శుద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నవాబ్‌సాహెబ్‌కుంట, ఫాక్స్‌సాగర్, కూకట్‌పల్లి, పికెట్, నాచారం, ఉప్పల్ నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థ జ లాలు నేరుగా మూసీలోకి చేరుతున్నాయి. పటాన్‌చె రు, జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్, కాటేదాన్, ఉప్ప ల్, నాచారం, సనత్‌నగర్ పారిశ్రామిక వాడల నుంచి విచ్చలవిడిగా రసాయన వ్యర్థాలను బయటకు వదులుతున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఎస్టీపీలకు పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసే సామర్ధ్యం లేదు. ఈ వ్యర్థాలను శుద్ధి చేయాలంటే రసాయన శుద్ధి కేంద్రాలు(ఈటీపీ)లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
 
 పావురాల్లో వింత వ్యాధులు
 ఓయూ ఆవరణలో ఆరు జతల పావురాలను పెంచారు. ఇందులో కొన్నింటికి మూసీ నీరు, మరికొన్నింటికి మంచినీరు అందించారు. వీటిలో మూసీ నీరు తాగిన పావురాలు కొన్ని గుడ్లు పెట్టలేదు. కొన్ని గుడ్లు పెట్టినా.. వాటి పెపైంకు పల్చగా ఉండటంతో వెంటనే పగిలిపోయాయి. అంతే కాకుండా వీటి కాళ్లకు లెగ్‌ట్యూమర్ సోకింది. మంచినీళ్లతో పెరిగిన పావురాల్లో ఏ అనారోగ్య సమస్య ఎదురుకాలేదు.
 
 బోరు నీళ్లు తాగిన కుందేళ్లు ఇలా..


 రోజంతా హుషారుగా ఉన్నాయి. ఏడాదిలోనే పిల్లలకు జన్మనిచ్చాయి. ఏడాది పాటు రోజూ కిలో వరకు ఆహారం తీసుకున్నాయి. రెండు లీటర్ల నీటిని తాగేవి. రోజులో 10 గంటలే నిద్రపోయేవి.

 

రాత్రి వేళల్లో చురుగ్గా ఉండేవి. వాటి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి.
 
 

 

మూసీ నీళ్లతో పెరిగినవి ఇలా..


 ఏడాదిపాటు కిలో ఆహారం ఇచ్చినా అందులో సగం మాత్రమే తీసుకున్నాయి. కేవలం అరలీటరు నీటిని (మూసీ నీళ్లు) తాగేవి. రోజుకు 18 -19 గంటలు నిద్రలోనే ఉండేవి. ఏడాది దాటినా పెద్దగా బరువు పెరగలేదు. పునరుత్పత్తి కూడా జరగలేదు.
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement