
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక వైద్యాన్ని నిరుపేదలకు చేరువ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అపోలో గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అన్నారు. టెలీ మెడిసిన్ ద్వారా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని చెప్పారు. ఈ నెల 28 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనున్న జీఈఎస్‌లో మాట్లాడే అవకాశం ఆమెకు లభించిన విషయం తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ రంగంలో విశేష కృషి చేయడమే కాకుండా, 140 దేశాల్లో 50 మిలియన్ల మందిని ప్రభావితం చేయగలిగే స్థాయికి అపోలో గ్రూప్‌ను తీసుకెళ్లిన ఆమె సదస్సులో మాట్లాడబోయే అంశాలను శుక్రవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా ప్రసంగంలో ప్రజావైద్యం బలోపేతం... ఔషధ పారిశ్రామిక రంగం విస్తరణ వంటి అంశాలే కీలకంగా ఉంటాయి.
టెలీమెడిసిన్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు ఎలా అందించవచ్చు. ఆపదలో ఉన్న రోగిని ఎలా కాపాడవచ్చు.. తక్కువ ధరకు అధునాతన వైద్యసేవలు ఎలా అందించవచ్చు.. వైద్య రంగం అవసరాలు.. ఔషధ కంపెనీల ఉత్పత్తులు, ప్రస్తుత మార్కెటింగ్.. వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తా. ప్రభుత్వ పరంగా ఆయా ఆస్పత్రుల్లో నమోదవుతున్న వ్యాధుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి, విశ్లేషించడంతో వచ్చిన ఫలితాల ఆధారంగా చికిత్స అందించే అవకాశం ఉంది. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్ అనేక ఔషధ కంపెనీలకు కేంద్రంగా మారింది. తక్కువ ధరకే మెరుగైన వైద్యసేవలు అందుతుండటంతో విదేశీ రోగులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ తయారైన మందులు విదేశాలకు సరఫరా చేస్తున్నారు.
కానీ వ్యాధి నిర్ధారణలో కీలకంగా మారిన ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ వంటి వైద్య పరికరాలను మాత్రం ఎక్కువ ధర చెల్లించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రులు ఈ ఖర్చులను రోగులపై రుద్దుతున్నాయి. అదే కంపెనీ తమ ఉత్పత్తులను స్థానికంగా కొనసాగిస్తే.. రవాణా, ఇతర చార్జీలు తగ్గే అవకాశం ఉంది. తద్వారా రోగులకు తక్కువ ధరకే మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం లభిస్తుంది. ప్రపంచ పారిశ్రామిక సదస్సులో ఈ అంశాలను ప్రధానంగా వివరించి, పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తా’అని సంగీతారెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment