సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఈ నెల రెండో వారంలో ప్రవేశించనున్నాయి. సోమవారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్రంలోకి ఎప్పుడు వస్తాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణంగా జూన్ 8న ప్రవేశించాలి. ఈసారి ఎప్పుడు ప్రవేశిస్తాయన్న దానిపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టతనివ్వలేదు. రెండో వారంలో వస్తాయని మాత్రమే చెబుతున్నారు. అంటే 8వ తేదీ తర్వాత రెండో వారంలో ఎప్పుడైనా రావచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజా రావు వెల్లడించారు. ఇది వాతావరణంలోనూ, రుతుపవన గాలుల్లోనూ వచ్చే మార్పులపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కాగా, 2019లో తెలంగాణలోకి రుతుపవనాలు జూన్ 21న, 2018లో జూన్ 8న ప్రవేశించాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు సంబంధించి జూన్ నుండి సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా చాలావరకు సాధారణ వర్షపాతం (96 నుంచి 104 శాతం) నమోదయ్యే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. పరిమాణాత్మకంగా రుతుపవనాల సమయంలో వర్షపాతం దేశం మొత్తం 102 శాతం (మోడల్ లోపం 4 శాతం ప్లస్ ఆర్ మైనస్). జూలైలో దేశవ్యాప్తంగా మొత్తం వర్షపాతం 103 శాతం, ఆగస్టులో 97 శాతం (మోడల్ లోపం 9 ప్లస్‌ఆర్ మైనస్) ఉంటుందని రాజారావు తెలిపారు. ఇక తెలంగాణలో జూన్ నుండి సెప్టెంబర్ మధ్య వర్షపాతం 102 శాతం (మోడల్ లోపం 8 శాతం ప్లస్ ఆర్ మైనస్) ఉంటుందని రాజారావు వివరించారు.
అరేబియా సముద్రంలో వాయుగుండం
దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులు మొత్తం ప్రాంతాలు, మాల్దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాల్లోకి సోమవారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని రాజారావు తెలిపారు. నైరుతి రుతుపవనాలు 1న కేరళలోకి ప్రవేశించడం వల్ల సాధారణ తేదీకి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లైందని రాజారావు వెల్లడించారు. మరోవైపు తూర్పు మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం దక్షిణ నైరుతి దిశగా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది రాగల 12 గంటల్లో మరింత బలపడి తూర్పు మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో బలపడి తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. ప్రారంభంలో మంగళవారం ఉదయం వరకు ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తర ఈశాన్య దిశగా బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో హరిహరేశ్వర్ (రైగర్, మహారాష్ట్ర), దామన్ మధ్య ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలను దాటే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దీంతో తెలంగాణలో మంగళవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక బుధవారం కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రెండో వారంలో ‘నైరుతి’
Published Tue, Jun 2 2020 2:40 AM | Last Updated on Tue, Jun 2 2020 2:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment