
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పోలీస్‌శాఖ భర్తీ చేయనున్న 18 వేల పోస్టుల ఉద్యోగాలకు భారీ స్పందన లభించింది. సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఫైర్, జైళ్లశాఖ, ఫింగర్ ప్రింట్స్ తదితర విభాగాల్లోని ఉద్యోగాలకు మొత్తంగా 7,19,840 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల నుంచి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు భారీ ఆదాయం లభించింది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు దరఖాస్తు రుసుములో 50 శాతం రాయితీ లభించగా, ఓబీసీ, జనరల్ అభ్యర్థులు పూర్తిస్థాయి రుసుమును చెల్లించారు. ఇలా రూ. 50 కోట్ల మేర దరఖాస్తు రుసుము వచ్చినట్లు బోర్డు అధికార వర్గాల ద్వారా తెలిసింది. బోర్డుకు ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. బోర్డు కార్యకలాపాలు, నియామక ప్రక్రియకు కావాల్సిన ఖర్చు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అకౌంట్ నుంచి పొందాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుల ద్వారా వచ్చిన ఆదాయం నుంచే నియామక ప్రక్రియకు కొంత మేర కేటాయించుకునే వెసులుబాటు వచ్చినట్లు బోర్డు అధికారులు తెలిపారు.