
సమావేశంపై చిత్తశుద్ధి ఏదీ !
ఇందూరు : జడ్పీ స్థాయీ సంఘాలలో అతి ముఖ్యమైన సాంఘిక సంక్షేమం స్థాయి సంఘ సమావేశం శనివారం సాదాసీదాగా కొనసాగింది. సమావేశానికి హాజరై తమ పరిధిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన సభ్యులు చాలా మంది హాజరు కాకపోవడం, మాట్లాడే వారు లేకపోవడంతో సమావేశం ముగిసిందనిపించారు. సాంఘిక సంక్షేమం సంఘం కమిటీ చైర్మన్‌గా ఉన్న మాక్లూర్ జడ్పీటీసీ సభ్యురాలు కున్యోత్ లతతో పాటు సభ్యులైన బీర్కూర్, భీమ్‌గల్ జడ్పీటీసీ సభ్యులు నేనావత్ కిషన్, బధావత్ లక్ష్మి మాత్రమే సమావేశానికి హాజరయ్యారు.
మిగతా బిచ్కుంద, మాచారెడ్డి, లింగంపేట జడ్పీటీసీ సభ్యులు సంధి సాయిరాం, గ్యార లక్ష్మి, నాగుల శ్రీలత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే హన్మంత్ సింధేలతో పాటు జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు కూడా సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ఖాళీ కూర్చీల నడుమ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం ముగిసింది. కేవలం ముగ్గురు ప్రజా ప్రతినిధులతోనే సమావేశం జరగడంతో సంక్షేమానికి సంబంధించిన విషయాలు ఒకటి రెండు తప్పా పెద్దగా ప్రస్తావనకు రాలేదు. తమ సమస్యలను సమావేశాల్లో చెప్పి పరిష్కరిస్తారని ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
సమీక్షించిన జడ్పీ సీఈఓ
సభ్యులు పెద్దగా రాకపోవడంతో జడ్పీ సీఈఓ రాజారాం ఒక్కరే సమావేశ బాధ్యతలను తీసుకున్నారు. సాంఘిక సంక్షేమం స్థాయీ సంఘం చైర్మన్ మహిళా కావడంతో ఆమె మాట్లాడలేకపోయారు. అధికారులు చెప్పిన వివరాలను వినడానికి మాత్రమే పరిమితమయ్యారు. సంక్షేమానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ, కార్పొరేషన్ శాఖల అధికారులతో పథకాల వివరాలు, రుణాలు, హాస్టళ్లు తదితర వివరాలు సీఈఓ అడిగి తెలుసుకున్నారు. ఇటు సంక్షేమ శాఖల ఇంజనీర్ శాఖ అధికారితో మాట్లాడి సంక్షేమ వసతిగృహాల నూతన భవనాలు, టాయిలెట్లు, ప్రహరీ తదితర భవనాల నిర్మాణాలు ఎక్కడి వచ్చాయో ఆరా తీశారు.
జిల్లాలోని వవసతిగృహాల్లో దాదాపు 2600 వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో, ఆ కులానికి చెందిన విద్యార్థులనే కాకుండా ఇతర కుల విద్యార్థులను కూడా చేర్పించుకోవాలని తద్వారా ఖాళీల సంఖ్య తగ్గుతుందని సంక్షేమాధికారులు చేసిన ప్రతిపాదనకు సీఈఓ అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, జనరల్ బాడీ సమావేశంలో చర్చకు తెస్తామన్నారు.
వసతిగృహాల భవనాలు, టాయిలెట్లు వచ్చే సమావేశంలోగా పూర్తి చేయాలని, పనులు ప్రారంభించని వాటిని వెంటనే ప్రారంభించాలని సంబంధిత ఇంజనీర్ ఈఈని ఆదేశించారు. ఆర్మూర్, నిజామాబాద్‌లకు మంజూరైన బీసీ స్టడీ సర్కిల్‌ళ్ల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించాలని సూచించారు. బీసీ కార్పొరేషన్‌లో గతేడాది రుణాలు రానందుకు మళ్లీ ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ఖాలేబ్, బీసీ కార్పొరేషన్ ఏఈఓ రామారావు పాల్గొన్నారు.
ఆర్థిక-ప్రణాళిక స్థాయీ సంఘ సమావేశం...
మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్థిక-ప్రణాళిక స్థాయీ సంఘ సమావేశం ఆ సంఘం చైర్మన్ అయిన జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక, ప్రణాళిక శాఖల అధికారులతో సమీక్షించారు. శనివారంతో జడ్పీ ఏడు స్థాయి సంఘాల సమావేశాలు ముగిశాయి.