ఆ తల్లి వికలాంగురాలు.. ఆమెకు రెండేళ్ల కూతురు.. పైగా భర్త మరో భార్యతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. కూలీనాలి చేసుకుని కూతురుతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. వికలాంగురాలైన తను ఎవరిమీదా ఆధారపడవద్ధని భావించింది. తనువు చాలించాలనుకుంది. అంతే.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కానీ, ఆమె చేసిన నేరానికి ఆ చిన్నారి కూడా బలైంది. ఆ తల్లి నుంచి ఎగసిన మంటలు పక్కనే చిన్నారినీ అంటుకున్నాయి. దీంతో ఇద్దరు మంటల్లో సజీవదహనమయ్యారు.
ఒకవైపు భర్త ఆదరించక వదిలేయడం.. మరోవైపు వికలాంగురాలైన రెండేళ్ల కూతురును పెంచి ఎలా పెళ్లి చేయాలోనని మదనపడింది ఆమె.. పుట్టింటికి వచ్చి తల్లికి భారమయ్యాయని భావించింది... చివరకు తాను నిప్పంటించుకోగా, అటుఇటు కదలలేని కూతురుకు మంటలు అంటుకుని ఇద్దరూ సజీవదహనం కావడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.. ఈ సంఘటన గ్రామస్తులను కలిచివేసింది.
దేవరకద్ర : మండలంలోని హజిలాపూర్‌కు చెందిన తెలుగు పెద్ద నాగమ్మ (30) ని పదేళ్లక్రితం మహబూబ్‌నగర్ మండలం పోతన్‌పల్లి వాసి ఆంజనేయులుతో వివాహమైంది. పిల్లలు పుట్టకపోవడంతో చెల్లెలు చిన్న నాగమ్మను ఇచ్చి నాలుగేళ్లక్రితం రెండో వివాహం చేశారు. చిన్న భార్యకు ఓ కూతురు పుట్టిన తర్వాత పెద్ద భార్యకు రెండేళ్లక్రితం వికలాంగురాలు జన్మించింది.
చిన్న భార్యతో కలిసి ఏడాదిక్రితం భర్త హైదరాబాద్‌కు వెళ్లిపోవడంతో పెద్ద భార్య, తన కూతురు జల్లమ్మ (2) తో సహా పుట్టింటికి వచ్చింది. మూడు నెలల క్రితమే తండ్రి మృతి చెందడంతో తల్లి అనంతమ్మపై కుటుంబ భారం పడింది. పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి కూలినాలీ పనులే దిక్కు. దీంతో కూతురు, మనవరాలిని తల్లి అనంతమ్మ పోషిస్తూ వస్తోంది. తాము భారమయ్యామని భావించిన పెద్ద నాగమ్మ సైతం కూలి పనులకు వెళుతూ ఉండేది. కొన్ని రోజులుగా మతిస్థితిమతం సరిగాలేదు.
ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం అనంతమ్మ దేవరకద్రకు ఎదో పనిమీద వె ళ్లగా ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా అటు ఇటు కదలలేని చిన్నారికి మంటలు అంటుకుని ఇద్దరూ సజీవ దహనమయ్యారు. సాయంత్రం తిరిగి వచ్చిన వృద్ధురాలు, బంధువులు విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతరం బాధిత కుటుంబాన్ని ఎంపీపీ ఈవీ గోపాల్, సర్పంచ్ భాస్కర్, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీకాంత్, నరేందర్‌రెడ్డి పరామర్శించారు. నగరంలోని భర్తకు సమాచార మిచ్చి ఇద్దరి మృతదేహాలను పోతన్‌పల్లికి తరలించారు. దీనిపై పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.
తల్లి, కూతురు సజీవ దహనం
Published Wed, Sep 3 2014 3:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement