
అడ్డుగా ఉందని..
మాతృమూర్తి సమాజంలో ఉన్నత స్థానం ఉంది. కానీ ఆ మహోన్నత స్థానానికే కలంకం తెచ్చేలా ఓ తల్లి వ్యవహరించింది. తన ‘సుఖానికి’ అడ్డుగా ఉందన్న కారణంతో కడుపునపుట్టిన ముక్కుపచ్చలారని చిన్నారిని ప్రియుడితో కలిసి దారుణంగా అంతమొందించింది.. మూడు నెలల క్రితం నకిరేకల్ పట్టణంలో వెలుగుచూసిన చిన్నారి డులసి హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు.. కన్నతల్లే ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..
- ప్రియుడితో కలిసి కూతురినే కడతేర్చిన తల్లి
- చిన్నారి డులసి హత్యకేసును ఛేదించిన పోలీసులు
- ఫోన్‌కాల్ లిస్ట్ ఆధారంగా వెలుగులోకి
- నిందితుల అరెస్ట్.. రిమాండ్
నకిరేకల్ : దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన సుష్మితకు నకిరేకల్ పట్టణం సంతోష్‌నగర్‌కు చెందిన నిమ్మనగోటి విక్రమ్‌తో 2012 ఆగస్టు 15న వివాహం జరిగింది. దంపతులు ఇద్దరు స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి డులసి (18 నెలలు) సంతానం.
ప్రియుడితో ప్రేమాయణం
అదే ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, సంతోష్‌నగర్‌లోనే నివాసముంటున్న కోట సాయికిరణ్‌తో సుష్మిత ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసి విక్రమ్ సుష్మితను పాఠశాల మాన్పించాడు. అప్పటి నుంచి దంపతుల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. ఒకనొకదశలో సుష్మిత తన భర్త విక్రమ్‌కు విడాకులు ఇచ్చి సాయికిరణ్‌ను వివాహం చేసుకోవాలనుకుంది.
లైన్‌క్లియర్ చేసుకోవాలని..
తనకు విడాకులు కావాలని సుష్మిత భర్తతో పలుమార్లు తగాదా పడింది. అందుకు విక్రమ్ ఒప్పుకోలేదు. దీంతో చిన్నారి డులసిని అంతమొందించి ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి పన్నాగం పన్నారు. దీనిలో భాగంగానే గత మార్చి 26వ తేదీన విక్రమ్ పాఠశాలకు వెళ్లగానే సాయికిరణ్‌ను ఇంటికి పిలిచింది. తానే డులసిని నీటి బకెట్‌లో వేసి ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేసింది. ఆపై సాయికిరణ్‌తో తలపై కొట్టించుకుని దుండగులు దాడి చేశారని చిత్రీకరించి అందరినీ నమ్మించింది. తన భర్తే దుండగుల చేత చేయించాడని పోలీసులకు తెలిపింది.
వెలుగులోకి ఇలా..
సుష్మిత ఫిర్యాదు మేరకు విక్రమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడే సుష్మిత ప్రేమాయణాన్ని విక్రమ్ పోలీసులకు వివరించడంతో పోలీసులు ఆమె కదలికలపై నిఘా వేశారు. దీంతో పాటు ఆమె సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను విచారించడంతో వారి అనుమానం బలపడింది. సాయికిరణ్‌ను, సుష్మితను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించారని సీఐ వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి స్థానిక మున్సిఫ్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు.