‘మేం చూసిన క్రైం సీరియళ్లు, సినిమాల్లో నేర సన్నివేశాల ప్రేరణతో దిశను చంపిన తరువాత ఆధారాలు మాయం చేయాలనుకున్నాం. అందుకే శవాన్ని చటాన్‌పల్లికి తీసుకెళ్లి పెట్రోల్‌తో కాల్చాం’ అని దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు విచారణలో పోలీసులకు తెలిపారు.
‘దంగల్ సినిమా చూశాక.. నా కూతురిని స్కేటింగ్‌లో జాయిన్ చేశాను. ఏడాది ప్రాక్టిస్ తరువాత 2018 ఔరంగాబాద్ నేషనల్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించడం జీవితంలో మరువలేని అనుభూతిని ఇచ్చింది’ అని ఓ తండ్రి తన కూతురిని చూసి మురిసిపోయాడు.
సినిమా, టీవీ సీరియళ్లు చాలా శక్తిమంతమైన మాధ్యమాలు. ఇవి రెండువైపులా పదును ఉన్న కత్తుల వంటివి. వీటి ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుంది. ప్రజల ఆలోచనలను ఇవి మార్చగలవు. ప్రభుత్వాలను పడగొట్టగలవు. మంచి వ్యక్తులను తయారుచేయగలవు. 2016లో దంగల్ సినిమా విడుదలయ్యాక మైదానాలకు వచ్చి ప్రాక్టీస్ చేసే యువతులు, బాలికల సంఖ్య పెరిగింది. అయితే మంచి కంటే చెడు త్వరగా వ్యాపించడం ఆందోళనకరంగా మారింది. సినిమాలు, యూట్యూబ్, ఇతర వెబ్ సిరీస్‌లు, క్రైం సీరియళ్లు ప్రజలను ముఖ్యంగా టీనేజర్లను కలుషితం చేస్తున్నాయి. మితిమీరిన హింస, విశృంఖలతతో పెడదోవ పట్టిస్తున్నాయి.
మనిషిని మృగం కంటే భయానకంగా మారుస్తున్నాయి. 2014లో విడుదలైన దృశ్యం సినిమా హత్యోదంతాన్ని అనేక మంది హంతకులు వాడుకున్న తీరు విస్మయం గొలుపుతోంది. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో నమోదైన పలు హత్య కేసుల్లో నిందితులు శవాన్ని, సాక్ష్యాలను మాయం చేసిన తీరు ఆ సినిమాలో చూపినట్లే ఉండటం ఆందోళన కలిగించే అంశం. కానీ, సినిమాలో హీరో కాబట్టి దొరకలేదు. నిజ జీవితంలో మాత్రం వారంతా 24 గంటల్లో పోలీసులకు పట్టుబడటం గమనార్హం.
నియంత్రణ కరువు
యూట్యూబ్, వెబ్ చానళ్లు సెన్సార్ పరిధిలోకి రావు. అందుకే హత్యలు, అశ్లీల సన్నివేశాలతో నింపేసి ట్రైలర్లను ముందు యూట్యూబ్‌లో వదులుతున్నారు. సినిమా సెన్సార్‌కు వెళ్లినప్పు డు ఆ దృశ్యాలకు కత్తెరపడుతోంది. యూట్యూబ్‌లో వ్యూస్ కారణంగా వీరు పెట్టిన డబ్బులు వచ్చేస్తున్నా యి. అందుకే నిర్మాతలు లాభాల కోసం ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. యూట్యూబ్, వెబ్ చానళ్లు సెన్సార్ బోర్డు కిందకి రాకపోవడంతో వాటిలో ప్రసారమయ్యే సీరియళ్లు, సినిమాల్లో ఎలాంటి కత్తెర ఉండదు. ఇప్పుడు ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్, వెబ్ చానళ్ల యాప్‌లు డీఫాల్ట్‌గా వచ్చేస్తున్నాయి.
ఫోన్‌లో ఉచిత డేటా కూడా ఉంటుంది. అవే యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. వెబ్ చానళ్లలో ప్రసారమయ్యే పలు సీరిస్‌లలో అధికశాతం విదేశాలవే. అక్కడ వీటికి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. సెన్సార్ సర్టిఫికెట్లు ఉంటాయి. కానీ, అందులో కంటెంట్ భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉండటమే ఇక్కడ సమస్య. పైగా నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో చిత్రీకరించి మరీ చూపిస్తున్నారు. వీటి వల్ల వివాహేతర సంబంధాలు, చిన్నారులపై లైంగిక దాడులు, అనైతిక బంధాలు, అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్‌లు వంటి నేరాలు ఎక్కువవుతున్నాయి. ఇటీవల జరిగిన దిశ హత్యాచారం, హయత్‌నగర్ ఉదంతాలే దీనికి నిదర్శనంగా మారాయంటే అతిశయోక్తి కాదు.
– సాక్షి, హైదరాబాద్
చట్టాలు చేయాలి
ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ప్రసారమవుతున్న పలు వెబ్ సిరీస్‌లు మన దేశానికి సంబంధించినవి కావు. వారి దేశాల్లో అలాంటి సన్నివేశాలు తప్పు కాదు. సమస్యల్లా అవి మన దేశంలో ప్రసారం కావడమే. అందుకే, వీటిపై మరింత నిఘా పెరగాలి. పలు యాప్స్ కూడా టీనేజీ పిల్లలను పెడదోవపట్టిస్తున్నాయి. విపరీతంగా నేరాలు, అడల్ట్ కంటెంట్‌తో వారి బుర్రలను పాడుచేస్తున్నాయి. వీటికి కళ్లెం వేసేందుకు ‘ఒక ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థ’ఏర్పాటు కావాలి. ఆ బాధ్యత కేంద్రం చేతుల్లోనే ఉంది.
-అనిల్ రాచమల్ల,ఎండ్ నౌ ఫౌండేషన్
త్వరలో నిర్మాత, రచయితలతో సమావేశం
సినిమాలు టీనేజీ పిల్లలపై బాగా ప్రభావం చూపుతాయి. కొన్ని సినిమాల వల్ల వీరిపై చెడు ప్రభావం పడుతోంది. వీటి వల్ల సంభవించే నేరాల్లో అమాయక ఆడపిల్లలు బలవుతున్నారు. ఒక్కోసారి వారే నిందితులవుతున్నారు. అందుకే, వీటిపై బాధ్యత తీసుకోవాల్సిందే. సినిమాల్లో హింస, అశ్లీలత, ఇతర అభ్యంతర సన్నివేశాలకు పగ్గాలు వేయాలి. దీనికి సంబంధించి త్వరలోనే నిర్మాత, రచయితలతో సమావేశం ఏర్పాటు చేసి చెడు సినిమాల వల్ల సమాజంపై పడుతున్న దుష్ప్రభావాన్ని వివరించాలనుకుంటున్నాం.
– ఐజీ స్వాతి లక్రా
పశ్చాత్తాపం కనబడదు
సినిమాలు, ఇతర వీడియోలు చూసి నేరాలకు పాల్పడేవారిది చాలా భయంకర మనస్తత్వం. తమకు కావాల్సిన దానికోసం ఎంత కైనా తెగిస్తారు. పోలీసులకు చిక్కినందుకు బాధపడతారు తప్ప.. చేసిన తప్పుకు చింతించరు. వారి చర్యల వల్ల ఎదుటివారు ఇబ్బందులు పడతార న్న చింత వారిలో అణువంతైనా ఉండదు. ఏది ఏమైనా.. వారు అనుకున్నదే చేస్తారు. అందుకే వీరి నేరాలకు కన్నవారు, కట్టుకున్నవారు బలవుతుంటారు.
– వీరేందర్, సైకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment