టీడీపీ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు(ఫైల్)
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఆయన మదిలో ఏముంది? రాజకీయంగా అడుగులు ఎటువైపు వేయనున్నారు.. టీడీపీలోనే కొనసాగుతారా.. మరో పార్టీలోకి వెళతారా.. ఏ పార్టీ అక్కున చేర్చుకుంటుంది.. ఆయన రాకకోసం ఎదురుచూస్తున్న రాజకీయ పక్షాలకు చేరువవుతారా.. ఇవన్నీ ప్రచారాలేనని కొట్టిపారేస్తారా.. ఇటువంటి అంశాలన్నీ జిల్లాలో రాజకీయ వేడిని రేపుతున్నాయి. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎటువైపు మొగ్గు చూపుతారన్న అంశంపై కొద్ది నెలలుగా అనేక ఊహాగానాలు షికార్లు చేస్తున్నా.. ఆయన రాజకీయ పయనంపై స్పష్టత కొరవడింది.
పొలిట్‌బ్యూరో సభ్యుడిగా టీడీపీలోనే కొనసాగుతున్నా.. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుని మరోసారి ఎంపీ బరిలో దిగుతారన్న ప్రచారం కొద్ది నెలలుగా హోరెత్తుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా గెలుపొందడంతో అప్పటి నుంచి టీడీపీలో రాష్ట్ర రాజకీయాలకు పరిమితమవుతూ జిల్లా రాజకీయాలపై అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి గూడుకట్టుకుంది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తన రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో నామా నాగేశ్వరరావు జిల్లా ప్రజల నాడిని పరిగణనలోకి తీసుకుని తనకు అనుకూలంగా రాజకీయాలను మలచుకునే విధంగా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని అనేక నెలల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్‌లో చేరడమా..! లేదా కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ నుంచి పోటీ చేయడమా.. అన్న అంశంపై ఆయన ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాను తీసుకునే నిర్ణయానికి టీడీపీ శ్రేణులతోపాటు తటస్థుల మద్దతు కోసం నామా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తనకు సాన్నిహిత్యం ఉన్న పలు పార్టీల నేతలు, తటస్థులతో తరచూ టచ్‌లో ఉంటూ రాజకీయ పరిణామాలను చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిర్ణయం ఎలా ఉంటుందో..?
వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పలు రాజకీయ పక్షాలు కూటమిగా ఏర్పడి శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్రస్థాయిలో యోచిస్తున్నట్లు ప్రచారం జరగడం.. దీనికి టీడీపీ నుంచి సైతం అనుకూలమైన సంకేతాలు ఉన్నాయని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్న నేపథ్యంలో నామా నాగేశ్వరరావు నిర్ణయం ఎలా ఉంటుందన్న అంశం ఎవరికీ ఒక పట్టాన అంతుపట్టడం లేదు. రాష్ట్రస్థాయిలో అనేక రాజకీయ పక్షాలు కాంగ్రెస్‌తో కలిసి నడిచే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ సైతం కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రిని కొనసాగించే అవకాశం ఉందని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నామా కాంగ్రెస్‌లో చేరి.. ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించే అవకాశం ఉన్నా జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక నేతగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుందని, అదే కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు ఖరారైతే 2009లో టీడీపీ గెలుపొందిన ఖమ్మం సీటునే మళ్లీ టీడీపీ కోరుకునే అవకాశం ఉందని, అప్పుడు నామా కాంగ్రెస్‌తోపాటు టీడీపీని బలపరిచే రాజకీయ పక్షాల కూటమితో ఎన్నికల బరిలో దిగి విజయం సాధించడం ద్వారా జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని.. ఒకవేళ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినా మిత్రపక్ష ఎంపీగా ఆయనకు మంత్రి పదవి అవకాశం ఉంటుందన్న ముందుచూపుతో ఆచితూచి అడుగులు వేస్తున్నారని, అందుకే ఎన్నికల పొత్తు.. పలు రాజకీయ పక్షాల వైఖరిపై వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నట్లు టీడీపీలోని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎదురు ప్రశ్నలే..
కాంగ్రెస్‌లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు, రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన అంశాలను సైతం నామా తన సన్నిహితులతో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అంశం పార్టీ శ్రేణుల్లో.. అలాగే అభిమానుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2004 ఎన్నికల్లో ఖమ్మం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన నామా.. ఆ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై ఓడిపోయారు. జిల్లా టీడీపీలో నామా, తుమ్మల వర్గాలు కొనసాగగా.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖమ్మం అభ్యర్థిగా పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో ఓటమి చెందడం..
ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరడం, తొలుత మంత్రిగా.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, కొద్ది కాలానికే పాలేరు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ద్వారా జిల్లా రాజకీయాలపై తుమ్మల మళ్లీ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఇక అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న నామా తెలంగాణలో టీడీపీకి వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలను పరిశీలిస్తూ.. రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై ఒక పట్టాన నిర్ణయానికి రాలేకపోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో..? ఎవరికి స్నేహ హస్తం అందిస్తుందో తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఎన్నికల పొత్తు వరకు రాజకీయ నిర్ణయం తీసుకోకుండా వేచి చూడటం రాజకీయంగా సరైంది కాదని నామా అనుచరులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
రాజకీయంగా తాను ఎటువంటి నిర్ణయం తీసుకుంటాననే అంశంపై సన్నిహితులకు సైతం స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడంతో ఆయన మనసులో ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా..? వాటి గురించి అన్వేషణ చేస్తున్నారా..? అన్న అనుమానం టీడీపీ వర్గాల్లోనూ.. ఆయన అనుచర గణంలోనూ వ్యక్తమవుతోంది. అయితే జిల్లా రాజకీయాలపై అవగాహన ఉన్న నామా తన రాజకీయ భవితవ్యంపై ఎవరు ప్రశ్నించినా.. ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఎదురు ప్రశ్న వేసి రాజకీయ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆయా రాజకీయ పక్షాల బలాబలాలు, ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనిపై దృష్టి సారించారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment