పార్టీ ద్రోహులకు ప్రజలే బుద్ధి చెబుతారు
బూర్గంపాడు : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీకి ద్రోహం చేసినవారికి ప్రజలే బుద్ధిచెబుతారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం బూర్గంపాడు మండల ప్రజాపరిషత్ నూతన పాలకవర్గ అభినందనసభ సంజీవరెడ్డిపాలెంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందన్నారు. అధికారపార్టీ ప్రలోభాలను లెక్కచేయకుండా మండల పరిషత్ పాలకవర్గ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించేందుకు పాటుపడ్డ ఎంపీటీసీ సభ్యులకు, పార్టీనాయకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఏడాదిక్రితం ఎన్నికలు జరిగినప్పుడే పాలకవర్గ ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉందని, కొన్ని కారణాలతో పాలకవర్గ ఎన్నిక నిర్వహణలో జాప్యం జరిగిందన్నారు. దీనిని సాకుగా చూపి కొందరు స్వార్థపరులు అధికారం కోసం పాలకవర్గం పంచనచేరి కుట్రలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నిస్వార్థపరుడికి ఎంపీపీ పీఠం దక్కలాని ఎంపీటీసీ సభ్యులు పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌సీపీకి మద్దతుపలికి కైపు రోశిరెడ్డిని ఎంపీపీగా గెలిపించటం అభినందనీయమన్నారు. రాజకీయప్రస్థానంలో కష్టాలు, సుఖాలు రెండు ఉంటాయని, అన్నివేళలా ప్రజాశ్రేయస్సు కోరేవారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా ఎంపీపీ దంపతులను, ఎంపీటీసీ సభ్యులను, జెడ్పీటీసీని ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పాయం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బట్టా విజయగాంధీ, సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ కొనకంచి బసంతీదేవి, పార్టీ రాష్ట్రనాయకులు ఆకుల మూర్తి, నిరంజన్‌రెడ్డి, భీమా శ్రీధర్, బిజ్జం శ్రీనివాసరెడ్డి, వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కైపు సుబ్బరామిరెడ్డి, భూపెల్లి నర్సింహారావు, మారం శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జక్కం సర్వేశ్వరరావు, ముడావత్ రామదాసు, అజ్మీరా వసంత, చింతా కోటేశ్వరి, తుమ్మల పున్నమ్మ, పాటి భిక్షపతి, అంగోతు సునీత, భూక్యా భీమ్లా, మహ్మద్ అబ్ధుల్‌ఘని తదితరులు పాల్గొన్నారు.