సాక్షి, వరంగల్ రూరల్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులన్నింటినీ కైవసం చేసుకొని మరోసారి కాంగ్రెస్, బీజేపీలకు గట్టిషాక్ ఇచ్చేందుకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ పావులు కదుపుతుంది. జెడ్పీలపై, స్థానిక సంస్థలపై గులాబీ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతోనే ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ పదవులు ఆధారపడి ఉండడంతో టీఆర్‌ఎస్ పార్టీ సీరియస్‌గా ముందుకుసాగుతోంది. జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో 16 జెడ్పీటీసీలు, 178 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేలా..
అత్యధిక ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ పకడ్బందీగా ప్రణాళికను రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కొనసాగించేటట్లు టీఆర్‌ఎస్ ఎత్తుగడ వేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించింది. పరకాలకు పులి సారంగపాణి, నర్సంపేటకు గుండు సుధారాణి, వర్ధన్నపేటకు మర్రి యాదవరెడ్డిలను నియమించారు. ముఖ్యంగా పదవుల విషయంలో కేడర్‌లో మనస్పర్దలు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశించారు. దీంతో గ్రామ పార్టీ నుంచి మండల పార్టీ వరకు కమిటీల అభిప్రాయాల మేరకే ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించేందుకు అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ప్రతి మండలకేంద్రంలో ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నుంచి రెబల్‌గా ఎవరు పోటీచేయకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు.
పట్టు జారకుండా
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నందున ఏ ఒక్క దశలో కూడా పార్టీ పట్టును జారనివ్వకుండా టీఆర్‌ఎస్ పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. మూడు దశల్లో ఒకే రీతిలో వ్యూహాన్ని అనుసరించి గెలుపు లక్ష్యాన్ని చేరుకోవాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.
ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి
సర్పంచ్ ఎన్నికల మాదిరిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా ఏకగ్రీవం చేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఏకగ్రీవాల కోసం ఎమ్మెల్యేలు పల్లెల్లో తిరుగుతూ ఇతర పార్టీలకు చెందిన వారిని పార్టీలోకి చేర్చుకుంటూ వారికి ఇతర పదవులపై భరోసా ఇస్తున్నారు. పోటీలేకుండా చేయాలని ఎమ్మెల్యేలు తనకు సాధ్యమైనంత వరకు కృషి చేస్తున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మరో అడుగు ముందుకేసి ఏకగ్రీవం చేసిన ఎంపీటీసీ స్థానానికి తన సీడీఎఫ్ నిధుల నుంచి రూ.15 లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తానని హామీలు ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment