సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఈ నెల 27న తాము నిర్వహించ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు బి.రమేశ్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సెంట్రల్ జోన్ డీసీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. శాంతియుతంగా నిర్వహించతలపెట్టిన ధర్నాకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. హనుమ జయంతి సందర్భంగా శోభా యాత్ర, జీసస్‌కు సంబంధించి మరో కార్యక్రమం ఉందన్న కారణంతో అనుమతి నిరాకరించారని తెలిపారు. తమ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ధర్నా చేస్తున్నామని, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధర్నా చేసుకుంటామని తెలిపామని, అయినా పోలీసులు అంగీకరించలేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తమ ధర్నాకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment