వెంటిలేటర్‌పై గీట్ల ముకుందరెడ్డి
పెద్దపల్లి, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతోన్న ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డ ఆయనకు వెంటిలేటర్ సహాయం అందించారు. గీట్ల కొద్ది రోజులుగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను తన పెద్ద కుమారుడు రాజేందర్‌రెడ్డి ఇంటికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
అమెరికాలో ఉంటున్న ముకుందరెడ్డి కూతురు వాణి బుధవారం ఏ రాత్రి వరకైనా హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. గీట్ల పరిస్థితి పూర్తి విషమంగా ఉందని తెలిసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్దపల్లిలోని గీట్ల నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని విషాదంలో మునిగిపోయారు. ఎంపీ వివేకానంద, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులు భానుప్రసాదరావు, దాసరి మనోహర్‌రెడ్డి, విజయరమణారావు తదిత రులు మంగళవారం సాయంత్రం తమ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ పయనమయ్యారు.
సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా..
కూనారం గ్రామానికి 1970, 1976లో రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికైన గీట్ల 1981లో పెద్దపల్లి సమితి అధ్యక్షుడిగా ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. 1983 నుంచి వరుసగా ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకసారి టీఆర్‌ఎస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన చరిత్ర ఆయనది. ఇందులో మూడుసార్లు గెలిచి ఐదుసార్లు ఓడిపోయా రు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న గీట్ల ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎ మ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సైతం దాఖలు చేశారు. అధిష్టానం భానుప్రసాదరావుకు టికెట్ ఇచ్చిం ది. ముకుం దరెడ్డికే టికెట్ లభిస్తుందనే ధీమాతో ఉన్న సీనియర్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటారని ప్రచారం జరిగినప్పటికీ... అధిష్టానం బుజ్జగింపులు, హామీలతో పోటీ నుంచి తప్పుకున్నారు.
గీట్లనే టార్గెట్
1983 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులెందరో వచ్చినా వారందరికీ గీట్ల ముకుందరెడ్డే టార్గెట్. 1983లో గోనె ప్రకాశరావుపై ఓడిపోయిన ఆయన తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందిన గీట్లను స్వయంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఢిల్లీకి రప్పించుకుని అభినందించారు. అప్పటినుంచి ఇప్పటివరకు గోనె ప్రకాశరావు, వేముల రమణయ్య, బిరుదు రాజమల్లు, కాల్వ రాంచంద్రారెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, సి.సత్యనారాయణరెడ్డి, విజయరమణారావు ఇలా అందరికీ ఆయనే ప్రత్యర్థి. 2009లో ఓటమి తర్వాత కొంత కాలంపాటు స్తబ్ధుగాఉన్న ఆయన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తీరుకు నొచ్చుకున్నారు.
సీనియర్లను గౌరవించడం లేదని ఆయనతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. ఈసారి అసెంబ్లీ బరిలో నిలవాలని ఏడాదికాలంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఊరూరా తిరిగి బూత్‌స్థాయి కమిటీలు నియమించారు. ప్రచార బాధ్యతలు కార్యకర్తలకు అప్పగించారు. పార్టీలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ప్రాబల్యం పెరిగిపోతోందని గ్రహించినప్పటికీ... ప్రజలమధ్యే ఉంటున్న తనను అధిష్టానం గుర్తిస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్న ఆయనకు అధిష్టానం షాక్ ఇచ్చింది. బుజ్జగింపులతో బరిలోంచి తప్పుకున్నా టికెట్ తనకు ఇవ్వలేదని మనస్తాపానికి గురయ్యారు.