‘శాంతి’ కోసం సమరం
నిజామాబాద్‌క్రైం, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మధ్యలో పం చాయతీ ఎన్నికలూ వచ్చిపడ్డాయి. అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించే అవకాశముంది. దీనిని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం చ ర్యలు తీసుకుంటోంది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హ క్కు వినియోగించుకునేలా చూసేందుకు కసరత్తు చే స్తోంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరం గా తనిఖీలు నిర్వహిస్తోంది. జిల్లాలో ఈ నెలలో ఇ ప్పటికే కోటి రూపాయలకుపైగా నగదు, 3 కిలోల బంగారం, 24 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.
ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లాలో 2,056 మందిని తహశీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. 327 కేసులు నమోదు చేశారు. తుపాకీ లెసైన్స్ కలిగినవారి వద్దనుంచి ఆయుధాలను డిపాజిట్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 898 తుపాకులను డిపాజిట్ చేసుకున్నారు. బాన్సువాడలో అనుమతి లేకుండా వాడుతున్న ఓ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 174 వారెంట్ కేసులు ఉండగా, 18 కేసులను ఛేదించి, నిందితులను కోర్టులో హాజరు పరిచారు.
మద్యంపై నియంత్రణ
మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి దేశీదారు, మద్యం అక్రమంగా జిల్లాలోకి రవాణా అయ్యే అవకాశాలుండడంతో చెక్‌పోస్టులు, పికెట్ల వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈనెలలో 66 కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ సిబ్బంది.. 457 లీటర్ల మద్యం(148 ఎంఎల్) స్వాధీనం చేసుకున్నారు. అలాగే 59 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
భారీగా బలగాలు
నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపుతున్నారు. ఎన్నికల కోసం నలుగురు డీఎస్‌పీలు, 22 మంది సీఐలు, 42 మంది ఎస్‌ఐలు, 300 మంది ఏఎస్‌ఐలు, 779 మంది కానిస్టేబుళ్లు, 363 మంది హోంగార్డులు, 300 మహిళా హోంగార్డులను ఎన్నికల విధుల్లో నియమించారు. హైదరాబాద్ నుంచి 181 మంది మహిళా కానిస్టేబుళ్లను రప్పిస్తున్నారు.