నిజామాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్:
పది రోజులుగా వాడవాడలా ఘనంగా పూజలందుకున్న గణపయ్య బుధవారం అంతకంటే ఘనంగా నిమజ్జనానికి తరలనున్నాడు. ఈ సందర్భంగా జరిగే శోభాయాత్ర కోసం నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. అధికారులు కావలసిన సౌకర్యాలను కల్పించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. శోభాయాత్రలు జరిగే దారి పొడవునా, నిమజ్జనం జరిగే నీటి వనరుల వద్ద తగిన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో నేడు నిమజ్జనం జరుగనుంది.
నగరంలో
నగరంలోని దుబ్బ వద్ద మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్య శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఆనవాయితీగా సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు గంజుల పోశెట్టి పచ్చ జెండా ఊరి రథాన్ని ప్రారంభి స్తారు. ఆ వెనుక గణపతులు బయలుదేరుతాయి. గత 67 సంవత్సరాలుగా ఈ రథోత్సవం కొనసాగుతున్నట్లు సార్వజనిక్ గణేష్ మండలి నిర్వాహకులు తె లిపారు. బాలగంగాధర్ తిలక్‌ను ఆదర్శంగా తీసుకొ ని నగరంలో గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. 1946లో ఇందూరు నగరానికి చెందిన పది మంది పురప్రముఖులు వినాయక శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. గణపతి బావి వరకు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి నిమజ్జనం చేసేవారు. 1946 నుంచి 1953 వరకు ఎడ్లబండ్లపై గణపతులను ఊరేగించేవారు. 1975లో నిజామాబాద్ ఫర్టిలైజర్ మర్చంట్స్ అసోసియేషన్ సహకారంతో ఆధునిక సౌకర్యాలు సమకూర్చారు.
అప్పటి నుంచి రంగులతో తీర్చిదిద్దిన 40 జతల ఎడ్లతో రథయాత్ర సాగుతోంది. ఈ యేడు 25 జతల ఎడ్లతో రథయాత్ర నిర్ణీత సమయంలో ప్రారంభిస్తామని సార్వజనిక్ గణేష్ మండలి బాధ్యులు బంటు బాలవర్ధి, బంటు గణేష్ తెలిపారు. ప్రారంభోత్సవానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు హాజరవుతారని తెలిపారు.
కార్పొరేషన్ ఏర్పాట్లు
నిజామాబాద్ సిటీ : నిమజ్జనానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. దుబ్బ నుంచి గణేష్ బావి వరకు రోడ్లకు మరమ్మతులు చేశారు.ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్ ముందు, రైల్వేగేట్ సమీపంలో బీటీ రోడ్డు వేశారు. వీధిలైట్లు అన్ని వెలిగేలా చర్యలు తీసుకున్నారు. వినాయక్‌నగర్ నిమజ్జనం బావి వద్ద, నగర శివారు బోర్గాం (పీ) బ్రిడ్జి వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్టర్, ఎస్పీలు మూడుసార్లు నిమజ్జనం కొనసాగే మార్గాన్ని పరిశీలించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు ఎప్పటికప్పుడు సల హా లు,సూచనలు ఇచ్చారు. నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగేందుకు పోలీస్ శాఖ బందోబస్తు చర్యలు చేపట్టింది.డీఎస్పీ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. నగరంలో అనుమానిత ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. డిచ్‌పల్లి నుంచి ఏపీఎస్‌పీ బలగాలను రంగంలోకి దింపారు.
నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
Published Wed, Sep 18 2013 2:48 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement