ముందుచూపేదీ?. | Munducupedi? | Sakshi
Sakshi News home page

ముందుచూపేదీ?.

Published Sun, Jan 4 2015 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

ముందుచూపేదీ?.

ముందుచూపేదీ?.

సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.36.50 కోట్లతో ఏడేళ్ల కింద చేపట్టిన మంచినీటి పథకం మూన్నాళ్ల ముచ్చటే అవుతోంది. తరచూ లీకేజీలతో నీరందించేందుకు ఆపసోపాలు పడుతున్న ఈ నీటి పథకానికి అధికారుల ముందుచూపు లేమితో మరో గండం వచ్చింది. సిరిసిల్ల-వేములవాడ పట్టణాల మధ్య ఫోర్‌లేన్ రహదారి నిర్మాణం జరుగుతుండగా.. పైపులైన్ పైనే రోడ్డు వేస్తున్నారు. రోడ్డుపై భారీ వాహనాల రాకపోకలతో పైపులైన్ పగిలితే అటు రోడ్డుకు, ఇటు నీటి సరఫరాకు ముప్పు తప్పదు.

పైపులైన్‌ను మింగేస్తున్న ఫోర్‌లేన్
సిరిసిల్ల-వేములవాడ పట్టణాల మధ్య ఏడు కిలోమీటర్ల డబుల్ రోడ్డును ఫోర్‌లేన్‌గా విస్తరిస్తున్నారు. రూ.16 కోట్లతో ఫోర్‌లేన్ పనులు జరుగుతున్నాయి. పైపులైన్ పైన కొత్తగా రహదారి వేయడంతో ఎప్పుడు పైపు పగిలిపోయినా రహదారికి, నీటి సరఫరాకు ముప్పు వాటిళ్లుతుంది. పైపులైన్ నిర్మాణ దశలో ఇంజినీర్లు రహదారి విస్తరణను దృష్టిలో ఉంచుకొని మరింత ఎడంతో పైపులైన్ వేస్తే ఈ ప్రమాదం వచ్చేది కాదు.

దీనికితోడు కరీంనగర్-కామారెడ్డి డబుల్ రోడ్డును భవిష్యత్‌లో ఫోర్‌లేన్‌గా మార్చుతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో ఫోర్‌లేన్ నిర్మాణం జరిగితే కరీంనగర్ నుంచి సిరిసిల్ల వరకు పైపులైన్ మొత్తం రహదారి అడుగుభాగంలో భూస్థాపితమయ్యే ప్రమాదముంది. పైపులైన్ మూలంగా దీర్ఘకాలం మన్నికగా ఉండాల్సిన రహదారి సైతం చెడిపోయే అవకాశముంది.

షిఫ్టింగ్‌కు రూ.12 కోట్ల ఖర్చు
ప్రజాధనమంటే అధికారులకు లెక్కలేకుండా పోయింది. రూ.16 కోట్లతో నిర్మిస్తున్న ఫోర్‌లేన్ పనుల్లో భాగంగా మంచినీటి పైపులైన్‌ను షిఫ్టింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అక్షరాలా రూ.12 కోట్లు ఖర్చవుతుందని మున్సిపల్ అధికారులు అంచనా వేసి ఆర్‌అండ్‌బీ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. పైపులైన్ షిప్టింగ్‌కు సర్కారు నుంచి అనుమతి రావాల్సి ఉందని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ బి.సుమన్‌రావు తెలిపారు.

తలకు మించిన భారం..
సిరిసిల్ల పట్టణానికి సమీపంలోనే మానేరువాగు ఉంది. దశాబ్దకాలంగా పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను మానేరు వాగే తీరుస్తోంది. పక్కన ఉన్న వాగును వదిలేసి నలభై కిలోమీటర్ల దూరంలోని ఎల్‌ఎండీ నుంచి పైపులైన్ నిర్మించి సిరిసిల్లకు నీరు అందించాలని 2007లో రూ.36.50 కోట్లతో మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. ఆ నిధులతో కరీంనగర్ ఎల్‌ఎండీ నుంచి సిరిసిల్ల వరకు పైపులైన్ వేశారు.

రగుడు వద్ద నీటి శుద్ధి ప్లాంట్‌ను నిర్మించారు. నిర్మించిన నాటి నుంచి లీకేజీలతో నీటి పథకం నీరుగారిపోతోంది. మూడేళ్లపాటు కాంట్రాక్టర్ ఈ పథకాన్ని అతి కష్టమ్మీద నిర్వహించి మున్సిపాలిటీకి అప్పగించారు. దీంతో నిర్వహణ ఖర్చులు మున్సిపాలిటీకి తలకుమించిన భారమైంది.

ఎల్‌ఎండీ వద్ద మోటార్లు ఆన్‌చేస్తే మూడు గంటల వరకు సిరిసిల్లకు చుక్కనీరు చేరదు. ఆలోగా కరెంటు అంతరాయం ఏర్పడితే అంతే సంగతులు. ఇలా నీటి పథకం దినదిన గండంగా వెల్లదీస్తోంది. ఇప్పటికీ నీటి పంపింగ్ కష్టంగానే మారింది. పథకం నిర్మాణ దశలోనే ఇంజినీర్ల పర్యవేక్షణలోపం, ప్రజాప్రతినిధుల అవినీతిదాహం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.

నీటి కష్టాలు తీరేదెలా..?
సిరిసిల్ల శివారులో ఉన్న మానేరువాగు నుంచి నీటిని పంప్ చేస్తూ నల్లా నీరు అందిస్తుండగా, శివారు ప్రాంతాల్లో నీటి కష్టాలు తప్పడం లేదు. ఎల్‌ఎండీ పైపులైన్ పగుళ్లతో ‘నీరు’ గారిపోతుండగా మానేరువాగు నీరే దిక్కవుతోంది. సిరిసిల్లలో ఎనిమిదివేల నల్లాలు ఉండగా ఆరు ప్రాంతాల్లోని వాటర్‌ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో మున్సిపాలిటీ అధికారులు ట్యాంకర్ల ద్వారా అరకొర నీటిని అందిస్తున్నారు. పట్టణంలోని తారకరామనగర్, గణేశ్‌నగర్, సుందరయ్యనగర్, బీవైనగర్, వెంకంపేట, ప్రగతినగర్ ప్రాంతాల్లో పైపులైన్లు ఉన్నా నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌లో భాగంగా మధ్యమానేరు జలాశయం నుంచి నీటిని పంప్ చేసి సిరిసిల్ల ప్రాంతంలోని 307 గ్రామాలతో పాటు పట్టణానికి అందించాలని రూ.670 కోట్లతో ప్రతిపాదించింది. ఇక రూ.36.50 నీటిపథకం పూర్తిగా నిరుపయోగంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement