ముస్లిం నివాస ప్రాంతాల్లో సాంకేతిక శిక్షణ సంస్థలు
- కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ముస్లిం నివాస ప్రాంతాల్లో పాలిటెక్నిక్, ఐటీఐ లాంటి సాంకేతిక శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ముక్తార్‌అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. శుక్రవారం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో 17 ఫౌండేషన్ డేలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సంస్థల్లో సాంకేతిక శిక్షణ పొందిన ముస్లిం యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉర్దూ దేశ సంస్కృతి అనీ, దీన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మదర్సాల్లో ఆధ్యాత్మిక బోధనతోపాటు ఉర్దూ పాఠశాలల్లో ఆంగ్లం, హిందీ సబ్జెక్ట్‌ల్లో కూడా విద్యనందించాలని ఆయన కోరారు.
మైనారిటీల సాధికారత, అభివృద్ధికి కేంద్రం కృషి
దేశంలోని మైనారిటీల సాధికారిత, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మైనారిటీలు విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు వెళ్లేందుకు తాము కృషి చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని పర్యాటక భవన్‌లో శుక్రవారం మైనారిటీ సంక్షేమంపై డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో 50శాతానికి పైగా మైనారిటీలు దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారని చెప్పారు. మైనారిటీలు ఎదిగేందుకు కేంద్రప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల రక్షణకు చర్యలు చేపడుతామన్నారు.
ఏ మతం చాంపియన్ అనే చర్చ అనవసరం
పుట్టుకతో అందరూ ముస్లింలేనని ఇటీవల ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నఖ్వీ నిరాకరించారు. ఏ మతం చాంపియన్ అనే అంశం జోలికి తాను వెళ్లనని, ఎవరూ మాట్లాడకూడదన్నారు. ఘర్ వాపసీ, లవ్ జిహాదీలకు కేంద్రం వ్యతిరేకమని చెప్పారు. టైస్టులకు సాయపడేలా పాకిస్తాన్ తీసుకునే చర్యలు గర్హనీయమన్నారు. టైస్టు లక్వీకి బెయిల్ ఇవ్వడాన్ని తప్పు పట్టారు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అడిగిన ప్రశ్నకు అది రాష్ట్రాల అంశమని నఖ్వీ దాటవేశారు.