తెలంగాణపై విషం కక్కుతున్న చంద్రబాబు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఈ రాష్ర్టంపై ఏపీ సీఎం చంద్రబాబు విషం కక్కుతూనే ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కాగానే విద్యుత్ పీపీఏలను రద్దుచేయడం ద్వారా చంద్రబాబు కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. ఇద్దరు సీఎంల రాజకీయ ఎత్తులు, జిత్తులకు తెలుగు ప్రజలు బలిపశువులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు సమయంలోనే ఎంతో దూరదృష్టితో సాగునీరు, విద్యుత్ రంగాలలో అనేక అంశాలను పొందుపర్చినా, వాటిని అమలుచేయడంలో ఇరు రాష్ట్రాల సీఎంలు విఫలమయ్యారని ఆరోపించారు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క అంశాన్ని కూడా అమలుకాకుండా తన ఇష్టమున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను, అధికారులను, పోలీసులను రెచ్చగొట్టడం ఏ చట్టంలో ఉందో సీనియర్ ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ ఒక విఫల ముఖ్యమంత్రిగా మిగిలిపోతున్నారని పొన్నాల ఎద్దేవా చేశారు. విద్యుత్, నదీజలాల్లో వాటా వంటివాటిని కేసీఆర్ సాధించుకోలేకపోతునారని విమర్శించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు
త్వరలో ఎన్నికలు జరుగనున్న పట్టభద్రుల నియోజకవర్గాల్లో బరిలో ఉంచే అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. వరంగల్, నల్లగొండ, ఖమం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి కత్తి వెంకటస్వామి, చింతపండు నవీన్ పేర్లు పరిశీలిస్తున్నట్టు పొన్నాల లక్ష్మయ్య మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గానికి మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, పార్టీ ముఖ్య అధికారప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌తో పాటు సుభాష్‌రెడ్డి, బంగారయ్య, రవికుమార్ తదితర పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు.