సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో కాంగ్రెస్ ఓ అంకం పూర్తి చేసింది. మంగళవారం గాంధీభవన్‌లో సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) ఒక్కో పార్లమెంటు స్థానానికి నాలుగు నుంచి ఐదుగురు ఆశావాహులతో కూడిన ప్యానెల్ ఖరారు చేసింది. ఈ ప్యానెల్‌లోని పేర్లను ఇప్పటికే అధిష్టానానికి పంపగా, నేడు ఢిల్లీలో జరగనున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ పేర్లపై చర్చ జరగనుంది. అనంతరం రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశముందని తెలుస్తోంది. గాంధీభవన్‌లో మంగళవారం జరిగిన పీఈసీ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియాతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీఈసీ సభ్యులు జానారెడ్డి, వి.హనుమంతరావు, డీకే అరుణ, షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంపత్, చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో కొత్త జిల్లాల డీసీసీ అధ్యక్షులు పంపిన ఆశావాహుల జాబితాపై పీఈసీ చర్చించింది. ఒక్కో స్థానం నుంచి 8 నుంచి 10 పేర్లను డీసీసీ అధ్యక్షులు పంపినట్లు సమాచారం. ఈ పేర్లపై చర్చించిన పీఈసీ.. సీనియారిటీ, సామాజిక సమీకరణలు, పార్టీ పట్ల విధేయత లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో స్థానానికి నాలుగు, మరికొన్ని స్థానాలకు ఐదు పేర్లను ఖరారు చేసి అధిష్టానానికి పంపింది.
వాడివేడి చర్చ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతల మధ్య వాడివేడి చర్చ జరిగినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థిపై చర్చ సందర్భంగా సీనియర్ నేత జైపాల్‌రెడ్డిని బరిలో దింపాలని ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ సూచించారు. అయితే ఆయన పోటీకి సుముఖంగా లేరని పీసీసీ చీఫ్ ఉత్తమ్ చెప్పగా.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోటీకి సిద్ధం కాకపోతే ఎలా అని అరుణ ప్రశ్నించారు. జాతీయ స్థాయి నేత పోటీ చేయకుంటే ఎలా అని, ఒకవేళ పోటీ చేయాలనే భావన లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఎందుకు ఇప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న చిన్నారెడ్డి.. పెద్ద నాయకుల గురించి అలా మాట్లాడొద్దని అనబోగా, పెద్ద నాయకుడు కాబట్టే తాను కూడా పోటీలో ఉండాలని ప్రతిపాదిస్తున్నానని అరుణ కౌంటర్ ఇచ్చారు. నాగర్‌కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి ఎంపిక విషయంలోనూ పాలమూరు నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక్కడి నుంచి చంద్రశేఖర్, సతీశ్‌మాదిగల పేర్లను ప్యానెల్‌లో చేర్చాలని అరుణ ప్రతిపాదించారు. దీనికి సంపత్, మల్లురవి అభ్యంతరం వ్యక్తం చేశారు.
సంపత్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్లను వారు ప్రతిపాదించారు. పార్టీ పునాదులు లేని వారిని ఎలా ప్యానెల్‌లో చేరుస్తారని సతీశ్‌మాదిగను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి కూడా అరుణ దీటుగానే కౌంటర్ ఇచ్చారు. పార్టీలో ఏం పునాది ఉందని కొందరు ఏఐసీసీ కార్యదర్శులయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రశేఖర్ పార్టీలో లేరని, సస్పెండైన వారిని ఎలా ప్రతిపాదిస్తారని సంపత్, రవిలు ప్రశ్నించగా, గత ఎన్నికల్లో కనీసం పార్టీ సభ్యత్వం లేని వారికి టికెట్లు ఎలా ఇచ్చారని అరుణ కౌంటర్ వేశారు. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి మధుయాష్కీగౌడ్ పేరు ప్రతిపాదించడంపై సమావేశంలో చర్చ జరిగింది. స్థానికేతరుడైన ఆయన పేరును భువనగిరి నుంచి ఎలా ప్రతిపాదిస్తారని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీలపై చర్చ
కరీంనగర్– ఆదిలాబాద్– నిజామాబాద్– మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసింది. బుధవారం దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా బుధవారం ఖరారు చేసి ఈనెల 28న నామినేషన్ దాఖలు చేయించాలని నిర్ణయించారు. ఈ స్థానంలో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పేరు దాదాపు ఖరారే అయినా ప్రస్తుత ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యతలను మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి అప్పగిస్తూ పీఈసీ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment